సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

వ్యాట్ పన్నులు తగ్గించిన ఏపీ - తెలంగాణ - ధరలు తగ్గించిన 9 రాష్ట్రాలు

పెట్రోల్, డీజల్ ధరల విషయంలో సామాన్య ప్రజానీకానికి ఊరట కలిగింది. దీపావళి సందర్భంగా పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ పన్ను తగ్గించడంతో గురువారం నుంచి నూతన ధరలు అమల్లోకి వచ్చాయి. 
 
పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించింది. అంతేకాకుండా రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ ట్యాక్స్ తగ్గించినట్లు తెలుస్తోంది.
 
ఫలితంగా హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై రూ.6.33, డీజిల్‌పై రూ.12.79 చొప్పున తగ్గాయి. దీంతో లీటరు పెట్రోల్ లీటర్ ధర రూ.114.51 నుంచి రూ.108.18కి.. లీటరు డీజిల్ ధర రూ.107.40 నుంచి రూ.94.61కి తగ్గింది. 
 
మరోవైపు ఏపీలోని విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.6.10 తగ్గి రూ.109.03కి చేరింది​. లీటర్ డీజిల్ ధర రూ.12.28 చొప్పున తగ్గి రూ.95.17కి చేరింది. దీంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇదిలావుంటే, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. అలాగే, రాష్ట్రాలు కూడా పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో 9 బీజేపీ పాలిత రాష్ట్రాలు పెట్రోల్‌పై విధించే పన్నును తగ్గించాయి. ఈ జాబితాలో అసోం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి.
 
కాగా అసోం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా రాష్ట్రాలు లీటర్ పెట్రోల్‌పై రూ.7 తగ్గించాయి. మరోవైపు యూపీ ఏకంగా రూ.12 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ మాత్రం రూ.2 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
దీంతో ప్రజలకు పెట్రోల్ మరింత చౌకగా అందుబాటులోకి రానుంది. కాగా ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రమే పెట్రోల్ ధరలను తగ్గించాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్లు వస్తున్నాయి. పెట్రోల్ రేట్లపై పన్ను తగ్గించే విషయంలో తెలుగు రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.