గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (20:41 IST)

దీపావళి ధమాకా : పెట్రోల్‌పై రూ.5 ఎక్సైజ్ సుంకం తగ్గింపు

దీపావళి పండుగ సందర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో దప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు పేర్కొంది. తగ్గించిన ధరలు గురువారం నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. 
 
దేశ ప్రజలకు మరింత ఉపశమనం కలిగించేందుకు రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని సూచించింది. ఇటీవల పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి చేరాయి. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. 
 
బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.110.04గా ఉండగా, డీజిల్ లీటర్‌ రూ.98.42, ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.115.85, డీజిల్‌ రూ.106.62 ధర పలికింది. కేంద్రం తాజా నిర్ణయంతో వాహనదారులకు కాస్త ఊరట కలుగనున్నది.