శుక్రవారం, 19 జులై 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (09:30 IST)

కొనసాగుతున్న చమురు ధరల బాదుడు - వరుసగా ఐదో రోజు

దేశంలో చమురు ధరల పెరుగుదలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వరుసగా ఐదో రోజూ ఇంధన ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా సోమవారం చమురు కంపెనీలు ధరలను మరోసారి పెంచాయి. 
 
ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. మధ్యప్రదేశ్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.120 మార్క్‌ను ధాటింది.
 
సోమవారం తొలిసారిగా లీటర్‌ పెట్రోల్‌పై 41 పైసలు, డీజిల్‌పై 42 పైసల వరకు పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.69 చేరింది. డీజిల్‌ లీటర్‌కు రూ.98.42, ముంబైలో పెట్రోల్‌ రూ.115.50, డీజిల్ రూ.106.62కు పెరిగింది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.106.35, డీజిల్ రూ.102.59కు చేరింది. 
 
ఇకపోతే, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌ రూ.114.13, డీజిల్‌ రూ.107.40కు చేరింది. రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. గత కొద్ది రోజులుగా ఇంధన ధరలు తగ్గించాలని వాహనదారులు డిమాండ్‌ చేస్తున్నా ధరలు పైపైకి కదులుతున్నాయి.