గురువారం, 3 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 6 నవంబరు 2021 (13:26 IST)

నీరు - చెట్టు బాధితులకు ఆఖరి రూపాయి అందే వరకు కృషి

టీడీపీ నీరు చెట్టు కాంట్రాక్ట‌ర్ల‌కు ఆఖ‌రి రూపాయి వ‌ర‌కు చెల్లింపులు జ‌ర‌పాల‌ని రాష్ట్ర కో ఆర్డినేషన్ కమిటీకీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచ‌న‌లు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నీరు- చెట్టు పెండింగ్ బిల్లులను రాబట్టేందుకు గత నెల రోజులుగా కృషి చేస్తున్న నీరు – చెట్టు ఫిర్యాదుల విభాగం పురోగతిని ఆయ‌న స‌మీక్షించారు. నేడు పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షలు నారా చంద్రబాబు నాయుడుని ఫిర్యాదుల విభాగం బాధ్యులు,  సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు, కృష్ణ పశ్చిమ డెల్టా గుంటూరు మాజీ ఛైర్మన్ మైనేని మురళీ కృష్ణ, రాష్ట్రం నీరు చెట్టు విభాగం కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు చెన్నుపాటి శ్రీధర్, కవులూరు రాజ చంద్ర మౌళి తదితరులు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలిసి నివేదిక సమర్పించారు. నీరు - చెట్టు బాధితులకు ఆఖరి రూపాయి అందే వరకు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. 

 
ఈ సందర్బంగా ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు  మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో భారత దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా నీరు-ప్రగతి కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టి నవ్యాంధ్రలోని 665 మండలాలలో సర్వే చేసి ప్రతి మండలంలోను నీటి లభ్యత, అవసరం, కొరతను నిర్ధారించి పుస్తకాలను ముద్రించి రైతులకు అందించామ‌న్నారు. 2015 లో గత ప్రభుత్వ హయాంలో మొట్టమొదటిసారిగా నీరు-ప్రగతి ద్వారా నీటి విలువను గ్రామ స్థాయి వరకు ప్రజలకు తెలియజేసామ‌ని చెప్పారు. అప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా నదులలో, చెరువులలో, భూగర్భంలో 2,225 టి.ఎం.సి.లు అందుబాటులో వుండగా అవసరం 2,750 టి.ఎం.సి.లు అని 525 టి.ఎం.సి.లు కొరత అని నిర్ధారించి, దానిని అధిగమించడానికి రూ.4,851 కోట్లు వెచ్చించి చెరువుల పూడికతీత, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం చేపట్టటం జరిగిందని గుర్తు చేశారు. 

 
నీరు-చెట్టు పనులు చేసిన సన్న, చిన్నకారు రైతులు 3 సంవత్సరాల కాలం పూర్తి అవడంతో ఆర్ధికంగా చితికిపోయి, వడ్డీలు కట్టలేక అప్పులుపాలై, నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు-చెట్టు పనులు చేసిన రైతులు కోట్లు డబ్బు వున్న కాంట్రాక్టర్లు కాదని కేవలం గ్రామాలలో అభివృద్ధి కోసం పనులు చేసిన అభివృద్ధి కాముకులు అని గుర్తించి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మెమోల పేరుతో కక్షపూరిత ధోరణిని విడనాడి నీరు-చెట్టు పెండింగ్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.