1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (20:44 IST)

బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ-టీడీపీ-జనసేన మాయా యుద్ధం: సజ్జల

ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధకు చరిత్రాత్మక విజయాన్ని అందించిన బద్వేల్‌ నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కృజ్ఞతలు తెలిపారు. జరిగిన ప్రతీ ఎన్నికలోనూ సీఎం వైయస్‌ జగన్‌కు ప్రజలు తమ ఆశీస్సులు మెండుగా అందించడమే కాకుండా.. భవిష్యత్తులో కూడా  వైయస్‌ జగన్‌ వెంటే ఉంటామని ప్రజలు తమ ఓట్ల ద్వారా మరోసారి చాటిచెప్పారన్నారు.

ఎన్నిక ఫలితం ఎలా ఉన్నా.. అది మన బాధ్యతను మరింత పెంచుతుంది. ఓటమి చెందినవారు లోపాలు, వెనకబడిన విధానాలపై ఆత్మపరిశీలన చేసుకుంటారు. గెలుపొందినవారు.. ప్రజల అంచనాలను అందుకోవడానికి మరింత కష్టపడేందుకు కృషి చేస్తారు. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఉప ఎన్నికల్లో ప్రజలు వైయస్‌ జగన్‌కు మెండుగా ఆశీస్సులు అందిస్తున్నారు. ప్రజలందించే విజయాలతో మా బాధ్యత మరింత పెరుగుతుందని భావిస్తున్నామన్నారు.  
 
ప్రతిపక్షం నుంచి అధికారపక్షమైనా ఎప్పుడూ ప్రజాపక్షమే.. సేవే వైయస్‌ఆర్‌సీపీ లక్ష్యం. 
2019 ఎన్నికలకు ముందు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించిన వైయస్‌ఆర్‌ సీపీ.. 2019 ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంతే వినమ్రతతో సీఎం జగన్‌ ప్రజల సేవలో నిమగ్నమయ్యారు.

మనం కేవలంగా ప్రజలకు ట్రస్టీలు మాత్రమే అని సీఎం జగన్ గారు చెప్పారు. అధికారమంటే ప్రజలకు సేవ చేయడమేనని ప్రతి అడుగులోనూ సీఎం జగన్ చేసి చూపుతున్నారు. నాయకులు, కార్యకర్తలకు కూడా అదే చెబుతున్నారు. అందుకే క్రమశిక్షణ కలిగిన పార్టీగా వైయస్‌ఆర్‌ సీపీ ఎదిగిందని సజ్జల తెలిపారు.  
 
ఇది చరిత్రాత్మక విజయం
బద్వేలు ఉప ఎన్నికలో సాంకేతికంగా ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేనప్పటికీ వారు అడుగడుగునా ఉన్నారు. బీజేపీ అభ్యర్థిని భుజాల మీద మోస్తూ వచ్చారు. ఎన్నికల్లో నేరుగా పోలింగ్ స్టేషన్లలో ఏజెంట్లుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు కూర్చున్నారు. మొత్తం 281 బూతుల్లో కేవలం 10 చోట్ల మాత్రమే బీజేపీ వారు ఉన్నారని మిగిలిన చోట్ల టీడీపీ కార్యకర్తలు/ఏజెంట్లు ఉన్నారని మీడియాలోనూ వచ్చింది.

ఆ విషయాన్ని వారు కూడా తిరస్కరించలేదు. టీడీపీ మండలాధ్యక్షుడు, కార్యకర్తల ఫొటోలు వచ్చాయని సజ్జల చూపించారు. వీరంతా టీడీపీ గుర్తించిన స్థానిక నాయకులట. వీరంతా నేరుగా బీజేపీ తరుపున పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చున్నారు. జనసేన పవన్‌ కల్యాణ్‌..  బలపరిచిన బీజేపీ అభ్యర్థిని సోమువీర్రాజు ఫొటో పక్కన పవన్‌ ఫొటోలతో అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చిన ఫొటోలను సజ్జల మీడియాకు చూపించారు. 
 
గతంలో టీడీపీ అభ్యర్థి ప్రకటించి చివర్లో తూచ్‌ అన్నదెందుకో?
లోపాయకారి ఒప్పందంతో  బీజేపీ, జనసేన, టీడీపీలు సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నాయ్‌ 
గతంలోనే బద్వేలుకు టీడీపీ అభ్యర్థిగా రాజశేఖర్‌ అనే అతన్ని ఖరారు చేశారు. మా సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య చనిపోతే ఆయన భార్య పోటీ చేస్తారని జగన్ గారు అప్పుడే చెప్పారు. అందులో సస్పెన్స్‌ కూడా లేదు. అయితే బద్వేల్‌ ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకపోయినప్పటికీ అడుగడుగునా వారి పాత్ర కనిపించింది.

మొదట్లో బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేస్తామని హడావుడి చేసిన టీడీపీ.. ఆఖరకు వ్యూహం మార్చి సంప్రదాయం పాటిస్తున్నాం అని స్టేట్‌మెంట్‌ ఇచ్చి చేతులు దులుపుకుంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా పోటీ చేయడం లేదని చెప్పారు. కానీ, ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని భుజాల మీద మోస్తూ వచ్చారు. పోలింగ్‌ బూత్‌లలో ఏజెంట్లుగా కూడా టీడీపీ నాయకులు కూర్చున్నారు.   

ఆ పార్టీ కూడా దాన్ని ఖండించలేదు.  అక్కడ బీజేపీకి 2019లో 800 ఓట్లు కూడా రాలేదు. 700 చిల్లర వచ్చాయి. ఇవాళ 21,621 ఓట్లు ఎక్కడ నుంచి వచ్చాయని సజ్జల ప్రశ్నించారు. టీడీపీ తమ బలమంతా బీజేపీకి బదలాయించి పోలింగ్ ఏజెంట్ల కింద కూర్చున్నారు. అయినా సరే.. ప్రజలు కృతనిశ్చయంతో శ్రీ జగన్ గారి పాలనను ఆశీర్వదించారని సజ్జల తెలిపారు. 
 
ప్రతీ ఎన్నిక మా బాధ్యతను మరింత పెంచుతుంది
బద్వేలులో వైయస్‌ఆర్‌సీపీ ముమ్మరంగా ప్రచారం చేసింది. ప్రతి మండలానికి ఓ ఎమ్మెల్యే ఇన్‌ఛార్జిగా నియమించి ప్రతి ఇంటికీ ప్రచారం చేశామని సజ్జల తెలిపారు. జగన్ గారిపై, వైయస్‌ఆర్‌సీపీ మీద చేస్తున్న విష ప్రచారం, మత పరంగా, కులపరంగా అన్ని రకాలుగా చిచ్చుపెట్టాలని ప్రతిపక్షాలు ప్రయత్నించారు.

అభివృద్ధి, సంక్షేమంలో బ్రహ్మాండంగా నడుస్తున్న రాష్ట్రాన్ని.. ఎత్తిపోయిన రాష్ట్రంగా, శ్రీ జగన్‌ను డ్రగ్‌ లార్డ్‌ కిందనో, ఒక మాఫియా డాన్‌ కిందనో చూపించాలని ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారమంతా ఒట్టి అబద్ధమని, ఆ విషయం తేల్చాలంటే.. బూతులకు వచ్చి ఓట్లు వేయాలని మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి గడపకూ వెళ్లి ప్రచారం చేశారు. దాని ఫలితంగా ఓటర్లు బూతులకు వచ్చి ఓట్లు వేశారు. పోలైన ఓట్లలో 76.23 శాతం వైయస్‌ఆర్‌ సీపీకే వేశారని సజ్జల అన్నారు. 
 
తెర వెనుకైనా, తెర ముందైనా ఒక్కటే ఫలితం 
ప్రతిపక్షాలు ప్రజాక్షేత్రంలో పోటీ చేయలేరు. వారికి తెల్సింది టక్కుటమారి విద్యలు, విష ప్రచారమే 
బీజేపీకి వచ్చిన ఓట్లు చూస్తే.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిన ఓట్లు అవి. ఆ మూడు పార్టీలు ఒక్కటే అని.. గత ఎన్నికల నుంచి వీళ్లు సేఫ్‌ గేమ్ ఆడారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్‌పీటీసీల్లో బలమైన జనసేన అభ్యర్థి ఉంటే.. టీడీపీ, జనసేన, బీజేపీలు లోపాయికారీగా ప్రచారం చేసుకున్నారు.

వీళ్ల లక్ష్యం శ్రీ జగన్‌ను అడ్డుకోవటమే. ప్రజలు ఓటు ద్వారా తేల్చేది కాబట్టి.. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. వారిని ఓటు అడిగి.. వారిని మెప్పుపొందేలా చేస్తున్నాం. మీరు ప్రజల్ని ఓటు అడగడం వదిలేసి.. టక్కుటమారి విద్యలు, విషప్రచారాలు చేశారని సజ్జల తెలిపారు. మీడియా ద్వారా యుద్ధం చేస్తున్నారు తప్ప ప్రజల్లోకి వచ్చే సాహసం ఏనాడూ చేయలేదు. తెర వెనుక కానీ, తెర ముందు వచ్చినా ఏం జరుగుతుందో బద్వేలు ఫలితంతో ఈరోజుతో రుజువైందని భావిస్తున్నాం.

కచ్చితంగా ఇది మరింతగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతను పెంచుతుంది. ఐదేళ్లు  పాలించమని మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చి మళ్లీ ప్రజల ఆశీర్వాదం కోరాలని సీఎం జగన్ గారి నిర్ణయాల ప్రకారం వెళ్తామని సజ్జల అన్నారు. 2024 ఎన్నికల నాటికి స్పష్టమైన మార్పుతో ఓటర్ల దగ్గరకు వెళ్లటానికి సిద్ధమవుతున్నామన్నారు.  
 
రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు దివాళాకోరుతనం
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ లేకుండా రాజకీయ చిత్రపటం చూడటం కుదరదని సజ్జల అన్నారు. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరులో దివాళాకోరుతనం స్పష్టంగా కనిపిస్తోందని సజ్జల అన్నారు. కుప్పంలో చంద్రబాబు మాట్లాడిన వీడియో చూశాను. ఎక్కడ ఏమి మాట్లాడుతున్నారో చంద్రబాబుకే అర్థం కావటం లేదు.

టీడీపీ అధికార ప్రతినిధి చేత బూతులు తిట్టించి ఢిల్లీ వెళ్లి వచ్చిన చంద్రబాబు ఏదైనా జరిగితే ఎదురుదాడి చేయవచ్చని అనుకున్నారు. అధికారంతో మామీద ఏదో చేస్తున్నారని వ్యవస్థలు, పోలీసులు మీద దాడి చేయాలని చంద్రబాబు భావించారు. అలాంటి ప్రయత్నమే ఇటీవల కుప్పం పర్యటనలోనూ చంద్రబాబు చేశారు. కుప్పంలో 30-35 ఏళ్లుగా చాలా ఎన్నికల్లో బాబు గెలిచారు. 2019లో బోగస్‌ ఓట్లు తీసేసిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీలు, సర్పంచ్‌ స్థానాలను కూడా కుప్పం ప్రజలు వైయస్‌ఆర్‌సీపీకి అప్పజెప్పారు. 
 
కుప్పంలో చంద్రబాబు బలప్రదర్శన ఏంటి? 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తివేనా? మానవత్వం ఉన్నదా?
ఎవరైనా సొంత ఇంట్లోకి వెళ్లి బల ప్రదర్శన చేస్తారా? వైయస్‌ఆర్‌ కానీ, శ్రీ జగన్ గానీ ఎప్పుడూ బల ప్రదర్శన చేయలేదు. బాబు సొంత నియోజకవర్గంకు వెళ్లి అక్కడ ఎక్కడ నుంచో మొబిలైజ్‌ చేసిన కార్యకర్తలు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆ మీటింగ్ కు పోయిన వ్యక్తి అన్యాయంగా దెబ్బలు తిన్నాడు.

ఒక ఆటవిక మంద మీద పడితే..  పూనకం వస్తే ఎలా ఉంటుందో.. ఒక చిరు ఉద్యోగిని కొట్టారు. ఆ ప్రాణానికి ఏమైనా అయితే ఎవరు దిక్కు? ఒకవైపు అంతగా చితకబాదుతుంటే.. స్టేజి మీద నుంచి బాంబులు ఉన్నాయా, రాళ్లు ఉన్నాయా అడుగుతున్నాడు తప్ప.. కొట్టడం ఆపండని అన్నారా? మీడియా మిత్రులకు, మీడియా ఛానల్స్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం.

ఒక్కసారి ఆ వీడియో మళ్లీ వేసుకొని చూడాలన్నారు. ఆ దాడి జరుగుతున్నప్పుడు ప్రజానాయకుడు బదులుగా చంద్రబాబులో దొరతనం కనిపించిది. అంత గుంపు కొడుతుంటే.. అతన్ని కాపాడండి అని పిలుపు ఇవ్వకుండా ఏమున్నాయ్‌? బాంబు ఉందా? రాళ్లు ఉన్నాయా? అనటం ఏమిటని సజ్జల ప్రశ్నించారు. 
 
ఎన్టీఆర్, అంబేద్కర్‌ సాక్షిగా ఎవ్వరినీ వదలను అనటం దేనికి సంకేతం ? 
కళ్ల ముందు దాడి జరుగుతుంటే చంద్రబాబు ఎలా చూశారో అర్థం కావటం లేదు. అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి దెబ్బలు తగలి గుడ్డలు చినిగి ఉంటే.. అతనిపై కనీసం సానుభూతి లేకపోగా.. పూనకం వచ్చినట్లు ఖబడ్ధార్ తేలుస్తానని చంద్రబాబు అనటం ఏంటి? పైగా 14 ఏళ్లు సీఎంగా చేశానని గొప్పగా చంద్రబాబు చెప్పుకుంటారు.

చంద్రబాబు కళ్ల ముందే టీడీపీ కార్యకర్తలు రౌడీల కంటే దారుణంగా ఒక సామాన్యుడి మీద పాశవికంగా దాడి చేస్తే బాబు తన చుట్టూ సెక్యూరిటీని కమ్ముకునేట్టు చేసుకున్నారు. బాంబులున్నాయా అంటావు. ఏం బాంబులు కావాలనా? ఇది జరిపించుకున్న వారు అది కూడా జరిపించుకోవాల్సింది. ఒక అమాయకుడ్ని కొట్టి ఇది బాంబు దాడి అని చెప్పుకునేంతగా చంద్రబాబు ఎందుకు దిగజారి పోయారు. పైగా ఎన్టీఆర్, అంబేద్కర్‌ సాక్షిగా ఎవ్వరినీ వదలను అని చంద్రబాబు అనటం దేనికి సంకేతమని సజ్జల ప్రశ్నించారు. 
 
విజ్ఞత, అనుభవజ్ఞుడిలా చంద్రబాబు తీరు లేదు
ప్రజల కోసం సభ పెట్టినట్లైతే.. వారు ఎవ్వరూ వచ్చి వినకూడదా? సంచి ఉంటే అది బాంబునా? సంచి పట్టుకొని ఎవరు వెళ్లినా వారిని ఉతుకుతారా? లేని ఆవేశం తెచ్చుకొని చంద్రబాబు మాట్లాడారు. ఆ భాష మెచ్యూర్డ్ పొలిటిషియన్ మాట్లాడేదేనా? చంద్రబాబు  విజ్ఞత కోల్పోయారు. అప్పనంగా వచ్చిన అధికారం అది.

27 ఏళ్లు నుంచి అక్రమంగా టీడీపీని అనుభవిస్తున్న ఆస్తి అది. గతిలేక టీడీపీ తమ్ముళ్లు కూడా మోస్తున్నారు. ఒక మాఫియా మూకలు చివరి వరకు తయారైన రాజకీయ మూకలాంటి పార్టీగా టీడీపీ మిగిలింది. పరాకాష్టకు చేరితే ఎలా మాట్లాడతారో అలా చంద్రబాబు మాటలున్నాయని సజ్జల అన్నారు.
 
గెలిస్తే మా గొప్ప.. ఓడితే డబ్బులు పంచారని విమర్శలా?
గెలిచిన ప్రతిసారీ మా విజయం. ఓడిన ప్రతిసారీ వారు రూ.5-10 వేలు పంచారని విమర్శలు చేయటం ఏంటి? అధికారం అంటే తెలియని, రాలేని పార్టీలు ఏం మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అధికారంలో రాగలిగే పార్టీలు, అధికారంలో రాగల సత్తా ఉన్న పార్టీలు ఇలా మాట్లాడరు. ప్రతి ఒక్కరూ ఎన్నికలు ఎదుర్కొంటూ వచ్చారు.

2011 ఉప ఎన్నికల నుంచి పదేళ్లుగా ఎన్నికలు ఎదుర్కొన్నాం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల ఉప ఎన్నికలో ఓడిపోయాం. అయినా ప్రజాస్వామ్యంలో భాగమని భావించాం. ఎక్కడ కూడా మొత్తం చుట్టేసి ఇవన్నీ అక్రమాలే అనలేదు. రేపు 2024లో సాధారణ ఎన్నికలు జరుగుతాయి. చెరువు మీద అలిగితే.. ఏమి అవుతుందో తెల్సు. 
 
మూడు ప్రాంతాల నాయకులా? లేక ఒక ప్రాంతం నాయకులా?
పాదయాత్ర పేరుతో రాజకీయ లబ్ధికి టీడీపీ ఎత్తుగడలు
న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటే.. రాయలసీమ ఎందుకు? పక్కనే ఉన్న దుర్గమ్మ ఆలయానికీ వెళ్లొ్చ్చు కదా!
ఎన్నికల్లో ప్రజల దగ్గరకు వెళ్లి మెప్పించాలి. కానీ ఇలా అహంకారంతో, పూనకం వచ్చినట్లు కుప్పంలో చంద్రబాబు వ్యవహరించారు. తాజాగా రెచ్చగొట్టేలా పాదయాత్ర రూపంలోనూ మొదలుపెట్టారు. వీళ్ళు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు నాయకులు అనుకుంటున్నారా? లేక ఇక్కడున్న ఈ కొద్ది ప్రాంతానికి నాయకులు అనుకుంటున్నారా?

కోర్టు అనుమతించిన ప్రకారం 150 మంది మాత్రమే పాదయాత్ర చేయాలి. పాదయాత్ర పేరుతో వీళ్లంతా పోతున్నది ఆవేశంతో. ఎవరైనా రెచ్చిపోయి దాన్ని ఓ అరాచకంలా సృష్టించాలని, ఆవేశాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని సజ్జల సందేహం వెల్లబుచ్చారు. తద్వారా ఏమైనా రాజకీయ ప్రయోజనం వస్తుందేమో అని టీడీపీ ప్రయత్నిస్తోంది. కాష్టం మీద పేలాలు వేయించుకున్నట్లు ఆ బాపతు ఆలోచనలతో టీడీపీ వ్యవహరిస్తోందన్నారు.

టీడీపీ మీద ఆశ పెట్టుకుంటే మిగిలిన వారు కూడా అంతే అని సజ్జల అన్నారు. ఎవ్వరూ అమరావతి నుంచి రాజధాని తీసేయలేదు. ఈ ప్రాంతంతో పాటు మిగిలిన చోట్ల అభివృద్ధి జరగాలి. న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటే.. పక్కనే ఉన్న అమ్మవారి వద్దకూ వెళ్లొచ్చు. రాయలసీమ దాకా ఎందుకు. అక్కడ ఎవరైనా ఏమైనా అంటే.. ఏదో చేయాలని. టీడీపీ సెంట్రల్‌ ఆఫీసులో కూర్చొపెట్టి తిట్టించి ఆవేశం వస్తే.. చూడుచూడు అంటున్నారు. ప్రతిసారీ కులాలు, మతాలు, వర్గాల మధ్య ఘర్షణ రావాలని ప్రమాదకరమైన ఆటకు టీడీపీ తెరదీసింది. 
 
ఇక్కడ నుంచి తిరుపతికి పోవాలంటే శ్రీకాళహస్తి  మీదుగా వెళ్లాలి. ఎవరైనా మా రాయలసీమ అభివృద్ధి కావాలని అడిగారు అనుకో! అప్పుడు ఎవరిది తప్పు అవుతుంది. వీరు నిన్న మొదలుపెట్టింది ప్రశాంతంగా చేస్తున్నట్లు ఉన్నదా? నిన్న జరిగిన దాంట్లో, ఆవేశాలు. పొలిటికల్ గేమ్‌ అని స్పష్టంగా కనపడటం లేదా? అది టీడీపీ షోగా ఉంది తప్ప రైతులది కాదు.

ఇక్కడ దళితులు, పేదలు, బీసీలకు స్థలాలు ఇస్తుంటే డెమెగ్రఫిక్ ఇం బ్యాలెన్స్ అని అడ్డుకున్నారు. ఏ సొసైటీలో ఉన్నాం మనం.  కొద్ది మంది కోసం అమరావతి పెట్టుకున్నారా! రియల్‌ ఎస్టేట్ వెంచర్‌లాంటిది. ఒక రియల్ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్ కోసం, అన్ని వర్గాల వాళ్ల సామాజిక వర్గంతో సహా, రైతాంగం ప్రయోజనాలు కాలరాసి, వాళ్ల భవిష్యత్‌ నాశనం చేసి కొద్ది మంది ప్రయోజనాలకు భంగం కలిగిందని కొద్ది మందిని ముందు పెట్టి నడిపిస్తున్న డ్రామా ఇది. 
 
అమరావతిలో పేదలకు భూములు ఇస్తే.. డెమెగ్రాఫిక్ ఇం బ్యాలెన్స్‌ అంటారా?
టీడీపీ రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లైతే.. పేదలకు ఇళ్లు ఇస్తే. ఊర్లకు ఊర్లు డెవలప్ అయితే.. దాన్ని స్వాగతిస్తారా? వ్యతిరేకిస్తారా? ఈరోజు ఇంకో ప్రాంతానికి వెళ్తూ.. అమరావతిని సమర్థించండని ఊరేగింపులు చేస్తున్నారు. ఏమైనా అయితే బాధ్యత మీదా? కాదా అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

ప్రతి అడుగులో తప్పుడు ప్రచారం, దుర్మార్గంగా వ్యవహరించి రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని టీడీపీ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏమి అవుతుందో తెలియదు కానీ.. ఇప్పటికీ వీళ్లు (బీజేపీ, జనసేన, టీడీపీ) కలిసే ఉన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి, ఎలా అన్నది  విషయంలో క్లారిటీ లేదేమో కానీ ఈ పార్టీలు (బీజేపీ, జనసేన, టీడీపీ) కలిసే ఉన్నాయని సజ్జల అన్నారు. మొదటి నుంచి చంద్రబాబు లోపాయికారీగా అన్నీ చేసుకుంటున్నారు. ఈరోజు విడిగా పోటీ చేసినట్లు నాటకాలు వేస్తున్నారన్నారు. 
 
ప్రజలకు సంబంధంలేని చర్చల్లో ఎల్లో మీడియా విషప్రచారం
సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని ఇబ్బంది పెట్టవచ్చని ఊసుపోక ఎల్లో మీడియాలో ప్రజలకు సంబంధం లేని చర్చలు పెడుతున్నారు. ఈ మాట అనటానికి బాధగా ఉంది. ఒక సీరియస్ పొలిటికల్ పార్టీ ఇలా వ్యవహరించకూడదు. కానీ ప్రతిపక్షం అలా వ్యవహరిస్తోందని సజ్జల అన్నారు. మాకు సంబంధించినంత వరకు ప్రజాభీష్టం మా బాధ్యతను మరింతగా పెంచిందన్నారు.

తిరుపతి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో, బద్వేలు ఉప ఎన్నికల్లో ప్రలోభాలు అనేవి లేకుండా చూశాం. రాజకీయ సంస్కృతిని మార్చాలని శ్రీ జగన్ గారు చూస్తున్నారు. మంద బలం, ధన బలం, కండ బలం, కుల బలమో కాకుండా.. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మన్సలు పొందే పార్టీగా వైయస్‌ఆర్‌సీపీ ఉండాలన్నదే సీఎం జగన్ గారి లక్ష్యమని సజ్జల వివరించారు. ఇదే వినమ్రతతో, విధేయతతో ప్రజలకు మరింత చేరువగా ఉంటామన్నారు.