బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 5 నవంబరు 2021 (18:11 IST)

ఉమర్ అలీషా జీవిత చరిత్రను ఆవిష్కరించిన ఉప రాష్ట్రపతి

స్వాతంత్ర‌ ఉద్యమంలో తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల నుంచి భారతీయ యువత స్ఫూర్తి పొందాలని, తద్వారా నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. ఆ మహనీయుల కృషి చేసింది వారి కోసం కాదని, భవిష్యత్ తరాల అభివృద్ధి కోసమని తెలిపారు. వివక్షలకు తావులేని సమాజ నిర్మాణమే వారికి మనం అందించే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.
 
 
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వకళాపరిషత్  కన్వెన్షన్ సెంటర్ లో శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతి ఉమర్ అలీషా జీవిత చరిత్రను, పార్లమెంట్ ప్రసంగాల పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. 1885 – 1945 మధ్య కాలానికి చెందిన శ్రీ ఉమర్ అలీషా గారు గొప్ప స్వాతంత్ర్య సమరయోధులన్న ఉపరాష్ట్రపతి, మహా పండింతుడు, మేధావి, బహు గ్రంథకర్త, మహావక్త అయిన అలీషా  అంగ్లేయుల కాలంలో కేంద్ర చట్టసభ సభ్యులుగా వారు సేవలందించారని తెలిపారు. స్వరాజ్యం కోసం తమ వాణిని చట్టసభల్లో బలంగా వినిపించిన అలీషా గారి చట్టసభల ప్రసంగాలను పుస్తకంగా తీసుకురావడం అభినందనీయమని తెలిపారు.
 
 
భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు చరిత్రలో ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారన్న ఉపరాష్ట్రపతి, తొలుత అక్షర జ్ఞానం కలిగిన చైతన్యవంత జనసముదాయం తమదైన పాత్రను పోషించేందుకు సిద్ధమైందని, వారి కృషి సామాన్య జనాలకు సైతం స్ఫూర్తిని పంచి స్వరాజ్య ఉద్యమం దిశగా నడిపిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సాహితీ, సేవా రంగాల్లో శ్రీ ఉమర్ అలీషా గారు తమదైన ముద్రను వేశారని తెలిపారు. సంస్కృతం, పారశీకం, తెలుగు, ఇంగ్లీషు, ఫ్రెంచ్ భాషల్లో ప్రవేశం ఉన్న ఆయన అనేక పురాణేతిహాసాలను సైతం ఔపోసన పట్టారని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఆధ్యాత్మిక మార్గం అంటే సేవా మార్గమే అని చాటిచెప్పిన మానవతావాదిగా అలీషా అని అభివర్ణించారు.
 
 
అల్లూరి సీతారామరాజు, ఆచార్య ఎన్జీ రంగా, తెన్నేటి విశ్వనాథం, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, భోగరాజు పట్టాభి సీతారామయ్య లాంటి మహనీయులతో పాటు ఎందరో మహిళామణులు ఉద్యమంలో పాల్గొన్నారన్న ఉపరాష్ట్రపతి విశాఖ జిల్లా నుంచి స్వరాజ్య ఉద్యమంలో పాల్గొన్న వీరనారీమణుల పేర్లను ప్రస్తావించారు.
 
“ఎలాగైతే పొట్టులేని విత్తనం మొలకెత్తదో, అదే విధంగా సంఘటిత కృషి లేని ప్రయత్నాలు రాణించవు” అన్న తమ తాత గారి మాటలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, భారతీయులు బలంగా విశ్వసించిన వసుధైవ కుటుంబ భావన స్ఫూర్తి ఇదేనని తెలిపారు. నలుగురితో పంచుకోవడం, నలుగు సంక్షేమం పట్ల శ్రద్ధ వహించడం ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలన్న ఆయన, సామాజిక బాధ్యత ద్వారా మన సంపద గొప్పతనాన్ని సంతరించుకుంటుందని తెలిపారు. “లోకంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడూ దాతలుగానే ఉండాలి. సహాయం చేయండి లేదా సేవ చేయండి లేదా మీరు ఇవ్వగలిగిన ఎంతటి చిన్న వస్తువునైనా ఇవ్వండి.” అన్న వివేకానందుని మాటలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, సేవచేయడంలో చిన్న, పెద్ద అనే తేడా ఉండదని ఉద్బోధించారు. 
 
 
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్, శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ప్రస్తుత పీఠాధిపతి ఉమర్ అలీషా సహా పలువురు రచయితలు, భాషావేత్తలు తదితరులు పాల్గొన్నారు.