గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2023 (16:28 IST)

రాహుల్ బస్సు యాత్రలో అపశృతి.. కొండా సురేఖకు గాయాలు

konda surekha
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు ముమ్మరం చేశారు. ఇందులోభాగంగా, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆ పార్టీ సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్నారు. అయితే, ఆమె నడిపిన బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో ఆమె కంటిపైభాగానికి, చేతికి గాయాలయ్యాయి. 
 
ఈ బైక్ ర్యాలీలో ఆమె స్వయంగా పాల్గొని బైకును నడిపారు. ప్రమాదవశాత్తు ఆ స్కూటీ కిందపడిపోవడంతో ఆమె కుడికన్ను పైభాగానికి, చేతికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు సురేఖ గాయపడిన విషయం తెలుసుకున్న ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సే కొండా మురళి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని గాయపడిన భార్యను చూసిన కంటతడి పెట్టారు. 
 
ఇక ప్రజాక్షేత్రంలోకి నారా భువనేశ్వరి : "నిజం గెలవాలి" పేరుతో ప్రజాయాత్ర  
 
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టయి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన అరెస్టు తర్వాత రాష్ట్రంలో టీడీపీ కార్యక్రమాలు స్తంభించిపోయాయి. వచ్చే యేడాది ఎన్నికలు జరుగనున్నందున పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేయాలని జైలులో తనను కలిసిన పార్టీ నేతలకు చంద్రబాబు సూచిస్తున్నారు. 
 
ఈ క్రమంలో బుదవారం చంద్రబాబుతో ఆయన భార్య నారా భువనేశ్వరి, తనయుుడు నారా లోకేశ్, మరికొందరు టీడీపీ నేతలు ములాఖత్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ... మానసికంగా తాను ధృఢంగా ఉన్నానని, మీరు మాత్రం పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెబుతూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో టీడీపీ ఏపీ శాఖ పార్టీ కార్యక్రమాల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఇందులోభాగంగా, 'నిజం గెలవాలి' పేరుతో పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారానికి కనీసం రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటనలు ఉండేలా పార్టీ వర్గాలు ప్రణాళిక సిద్ధం చేశాయి.
 
చంద్రబాబు అరెస్టుతో ఆగిన భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు స్థానంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనంలోకి వెళ్లనున్నారు. యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించిన లోకేశ్.. చంద్రబాబు జైలు నుంచి రాగానే పాదయాత్రను కొనసాగించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 
 
అప్పటివరకు భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని లోకేశ్ చేపట్టనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యక్రమాల నిర్వహణ, సమీక్షపై నాలుగైదు రోజుల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఓ టూర్ ప్లాన్‌ను సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత నారా లోకేశ్, నారా భువనేశ్వరి‌లు ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు.