గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 10 జులై 2021 (15:48 IST)

ఆంధ్రా ఫిర్యాదులపై ఫిర్యాదులు.. సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య జల వివావాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో గత 11 రోజులు నాగార్జున సాగర్‌ జల విద్యుత్ కేద్రంలో కొనసాగిస్తూ వచ్చిన జల విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ జెన్‌కో నిలిపివేసింది. 
 
తెలంగాణ జెన్‌కో నాగార్జునసాగర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తిని గత నెల 29 నుంచి చేపడుతున్నారు. 11 రోజుల్లో తెలంగాణ జెన్‌కో 30 మిలియన్‌ యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసింది. 
 
ప్రాజెక్టులో నీళ్లు తక్కువగా ఉన్నప్పటికీ.. తెలంగాణ జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఇలా చేపట్టడం వల్ల నీళ్లన్నీ వృథాగా సముద్రంలోకి వెళ్తున్నాయని కేఆర్‌ఎంబీతోపాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. 
 
అయితే.. విద్యుత్‌ ఉత్పత్తిని నిబంధనల మేరకే చేపడుతున్నామని.. తమకు కేటాయించిన నీటి వాటాను వాడుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కానీ, శ్రీశైలంలో నీరు గరిష్టంగా చేరకుండా ఉండేందుకే తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని ఏపీ ఆరోపించింది. 
 
ఈ క్రమంలో ఏపీ రాయలసీమ ఎత్తిపోతల చేపట్టడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రం, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వివాదం సహా కృష్ణా జలాల కేటాయింపులపై ఈ నెల 24న కేఆర్ఎంబీ పూర్తి స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసింది.