గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (10:04 IST)

రాజద్రోహం మినహా ఇతర కేసుల్లో విచారణకు ఓకే : ఆర్ఆర్ఆర్‌కు కోర్టు ఆర్డర్

raghurama
రాజద్రోహం మినహా మిగిలిన కేసుల్లో విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌లోని దిల్‌ కుషా ప్రభుత్వ అతిథి గృహంలోనే విచారించాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. 
 
ఇదే కేసులో ఇతర నిందితులైన ఏబీఎన్‌, టీవీ-5లతో కలిపి ఎంపీని విచారించాలని భావిస్తే 15 రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని పేర్కొంది. ఆయన ఎంచుకున్న న్యాయవాది సమక్షంలోనే విచారించాలని, ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయాలని ఆదేశించింది. 
 
ఎంపీకి వై-కేటగిరీ భద్రత ఉన్న నేపథ్యంలో విచారణ గది బయట సెక్యూరిటీ సిబ్బందిని అనుమతించాలని, కేసు విషయాలపై మినహా ఇతర అంశాలను ప్రశ్నించడానికి వీల్లేదని సీఐడీకి తేల్చిచెప్పింది. పిటిషనర్‌ హృద్రోగి అయిన నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. 
 
ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించినందున, ఈ కేసులో దర్యాప్తు పూర్తయినప్పటికీ సంబంధిత కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయవద్దని స్పష్టంచేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే అధికారులు కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ బుధవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చారు.