గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 జనవరి 2024 (08:53 IST)

డ్రగ్స్ కేసు కేసులో వైకాపా నేత ద్వారంపూడి విక్రమ్ అరెస్టు..

drugs
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అధికార వైకాపాకు చెందిన కీలక నేత ద్వారంపూడి విక్రమ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. కారులో డ్రగ్స్‌ తరలిస్తుండగా నిజామాబాద్‌ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. విక్రమ్‌తోపాటు మరొకరిపైనా కేసు నమోదు చేశారు. నార్కోటిక్స్‌ యాక్ట్‌ కింద నిజామాబాద్‌ జైలుకు పంపించారు. వీరికి పరిచయం ఉన్న మరో ఇద్దరిని కూడా డిచ్‌పల్లి పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. 
 
ఏపీలోని కోనసీమ జిల్లా అలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన ద్వారంపూడి విక్రమ్‌ వైసీపీ నాయకుడు. అదే రాష్ట్రంలోని పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన షేక్‌ ఖాజా మొయినొద్దీన్‌ సిస్టి ఇతనికి స్నేహితుడు. హైదరాబాద్‌లో ఉంటున్న వీరిద్దరూ ఇతర ఫ్రెండ్స్‌తో కలిసి కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొనేందుకు, ఢిల్లీలో రాహుల్‌, మైక్‌ అనే వ్యక్తుల ద్వారా కొకైన్‌, గాంజా పౌడర్‌, ఎండీఎంఏ డ్రగ్‌ను సేకరించారు. 
 
వీటిని కారులో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా.. మార్గమధ్యంలో నిజామాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పక్కా సమాచారం మేరకు ఆదివారం రాత్రి వీరిని అడ్డుకొని కారు తనిఖీ చేసి, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు ఎండీఎంఏ డ్రగ్‌ 3.2 గ్రాములు, కొకైన్‌ 12.3 గ్రాములు, గంజాయి పౌడర్‌ 3.1 గ్రాములు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు. 
 
ద్వారంపూడి విక్రమ్‌ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి (బొటానికల్‌ గార్డెన్‌ రోడ్‌)లో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. విక్రమ్‌ తండ్రి సత్యనారాయణ రెడ్డి గతంలో జొన్నాడ గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీలో గ్రామస్థాయి నేతగా ఉండటంతో పాటు పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పట్టుబడ్డ మరో వ్యక్తి షేక్‌ ఖాజా మొయినొద్దీన్‌ హైదరాబాద్‌లోని మణికొండలో గల పంచవటి కాలనీలో నివాసం ఉంటున్నాడు.
 
ఈయన ఓ హోటల్‌ నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా హైదరాబాద్‌లో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నిందితులకు ఢిల్లీకి చెందిన వ్యక్తులతో ఎలా పరిచయమైంది? గతంలో ఇదే విధంగా డ్రగ్స్‌ను తీసుకొచ్చారా? వీరి వెనుక ఉన్న వారెవరు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.