డ్రగ్స్ కేసులో టాలీవుడ్ దర్శకుడు వాసువర్మ అరెస్టు
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో తెలుగు చిత్ర దర్శకుడు వాసు వర్మను పోలీసులు అరెస్టు చేశారు. ఈయన బస్తీ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ అరెస్టు వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత జూన్ 19వ తేదీన రచయిత మన్నెరి పృథ్వీకృష్ణ, ఈవెంట్ నిర్వాహకుడు రాహుల్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. వారిచ్చిన సమాచారం దర్శకుడు వాసువర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గత కొన్ని రోజులుగా తెలుగు చిత్రపరిశ్రమలో డ్రగ్స్ దందాలు వెలుుగు చూస్తున్న విషయం తెల్సిందే. ఈ కేసుల్లో సినీ ఫైనాన్షియర్లు సహా మరికొందరిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అరెస్టు చేసింది. ఈ కేసులో సినీ నటుడు నవదీప్‌ను కూడా అదికారులు విచారించారు. ఇదే కేసులో దర్శకుడు మంతెన వాసువర్మను ఈ నెల 5వ తేదీన మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
కాగా, ఇదే కేసులో పృథ్వీకృష్ణ అలియాస్ దివాకర్, పూణెకు చెందిన ఈవెంట్ నిర్వాహకుడు రాహుల్ తెలోర్‌ను జూన్ 19వ తేదీన అరెస్టు చేసిన విషయం తెల్సిందే. వీరి నుంచి 70 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా వాసువర్మ పేరు కూడా వెలుగులోకి రావడంతో ఈ నెల 5వ తేదీన ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వీరికి డ్రగ్స్ సరఫరా చేసే ముంబైకి చెందిన విక్టర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.