1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 26 జూన్ 2018 (11:35 IST)

మామూలోడు కాదు.. మహా ముదురు... నకిలీ వేలిముద్ర యంత్రాన్నే తయారు చేశాడు...

మోసాలు చేసేందుకు కొత్తకొత్త టెక్నాలజీని కనిపెడుతున్నారు. ముఖ్యంగా, సైబర్ నేరగాళ్లు ఈ విషయంలో ఆరితేరారు. అయితే, ఓ టెలికాం సంస్థ డిస్ట్రిబ్యూటర్ తమ టార్గెట్లను చేరుకునేందుకు ఏకంగా ఓ నకిలీ ఫింగర్ ఫ్రింట్

మోసాలు చేసేందుకు కొత్తకొత్త టెక్నాలజీని కనిపెడుతున్నారు. ముఖ్యంగా, సైబర్ నేరగాళ్లు ఈ విషయంలో ఆరితేరారు. అయితే, ఓ టెలికాం సంస్థ డిస్ట్రిబ్యూటర్ తమ టార్గెట్లను చేరుకునేందుకు ఏకంగా ఓ నకిలీ ఫింగర్ ఫ్రింట్ మిషన్‌ను తయారు చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన పాత సంతోష్‌ కుమార్‌ అనే యువకుడు బీఎస్పీ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. ధర్మారం బస్టాండ్‌ సమీపంలో ధనలక్ష్మి కమ్యూనికేషన్స్‌ పేరుతో దుకాణం ఏర్పాటు చేసి, వొడాఫోన్‌ ప్రీ–పెయిడ్‌ కనెక్షన్స్‌ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు. 
 
నెలకు కనీసం 600 విక్రయిస్తే.. ఒక్కో కనెక్షన్‌కు రూ.15 చొప్పున కమీషన్‌ వస్తుంది. ఒక్కో ఆధార్ కార్డుకు గరిష్టంగా తొమ్మిది సిమ్‌ కార్డులు మాత్రమే విక్రయించేలా నిబంధన ఉంది. అయితే, కేంద్రం ఇటీవల ఈ-కేవైసీ యంత్రంలో వేలిముద్ర ఎంట్రీ తర్వాతే సిమ్‌ యాక్టివేషన్‌ జరిగేలా ఆదేశాలు జారీచేసింది. దీంతో సిమ్ కార్డుల విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. ఫలితంగా మనోడికి కమిషన్ రాక ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నాడు. 
 
ఈ సమస్యల నుంచి గట్టెక్కేందుకు సరికొత్తగా ఆలోచన చేశాడు. ఇందులోభాగంగా, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల సమయంలో వేలిముద్రల వివరాలను డాక్యుమెంట్‌‌లో పొందుపరుస్తారనే విషయాన్ని తెలుసుకున్నాడు. సబ్-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కేటాయించే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ నంబర్ల సిరీస్‌‌ను తెలుసుకుని వరుసగా ఆ డాక్యుమెంట్లను డౌన్‌‌లోడ్‌ చేయసాగాడు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది స్థిరాస్తుల యజమానుల ఆధార్, పేరు, చిరునామా, వేలిముద్రలు వంటి పూర్తి వివరాల డేటాను సేకరించాడు.
 
ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా రబ్బర్‌ స్టాంపుల తయారీతో పాటు ఫేక్ వేలిముద్రల తయారీ యంత్రాన్ని తయారు చేశాడు. ఈ యంత్రంతో డౌన్‌లోడు చేసుకున్న రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల సహాయంతో పెద్ద సంఖ్యలో నకిలీ వేలిముద్రలను తయారు చేసి, ఈ-కేవైసీ యంత్రంలో సదరు ఆధార్‌ వివరాలు, ఇతర వివరాలు నమోదు చేసి, వేలిముద్రను పెట్టి, సిమ్‌కార్డులను యాక్టివేషన్‌ చేశాడు. ఇలా ఐదు నెలల్లో ఆరు వేల సిమ్ కార్డులు యాక్టివేట్ చేశాడు.
 
అయితే, ఒకే ఈ-కేవైసీ యంత్రం నుంచి భారీగా సిమ్‌కార్డుల కోసం ఆధార్‌ అప్రూవల్స్‌ పొందిన విషయాన్ని గుర్తించిన ఆధార్ విజిలెన్స్‌ విభాగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గాల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన నిఘా అధికారులు, 18 ప్రభుత్వ విభాగాల అధికారులు.. సంతోష్‌కుమార్‌‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. 
 
ఈ విచారణలో సిమ్‌ కార్డుల యాక్టివేషన్‌ టార్గెట్‌ పూర్తి చేసుకోవడం కోసం ఇలా చేసినట్టు చెప్పాడు. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల నుంచి వేలిముద్రల సేకరణ, రబ్బరు స్టాంపుల యంత్రంతో నకిలీ వేలిముద్రల తయారీ, ఇందుకోసం ఇంటర్నెట్‌ను వినియోగించుకున్న తీరు వంటివి తెలుసుకుని అవాక్కయిన అధికారులు.. సంతోష్‌ని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.