శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (14:00 IST)

తెలుగుభాషా దినోత్సవం.. గిడుగును గుర్తు చేసుకున్న పవన్.. మాతృభాషను చిన్నారులకు..?

ఆగస్టు 29వ తేదీ తెలుగుభాషా దినోత్సవం. గిడుగు రామమూర్తి జయంతి (ఆగస్టు 29వ తేదీ)ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. గిడుగు జీవితకాలంలో చేపట్టిన కృషి ఎన్నో శాఖలకు విస్తరించింది. వాటిలో ప్రధానంగా నాలుగు విభాగాల గురించి వివరించవలసి ఉంటుంది.
 
మొదటిది ఆయన ముప్పయ్యేళ్ళకు పైగా ఉపాధ్యాయుడిగా పనిచేసారు. పర్లాకిమిడి మునిసిపల్ కౌన్సిల్ సభ్యుడిగా, పాఠశాలల పరీక్షకుడిగా, పర్యవేక్షణాధికారిగా పనిచేసారు. 1813లో బ్రిటిష్ ఇండియాలో మిషనరీలో మొదటిసారిగా ప్రాథమిక పాఠశాలలు తెరిచారు. 
 
గిడుగు అనగానే ప్రజలకు స్ఫురించేది వాడుకభాష గురించి చేపట్టిన ఈ మహోద్యమమే. ఈ ఉద్యమం ఫలితంగానే నేడు మనం పాఠశాలల్లో, సమాచార ప్రసారసాధనాల్లో, సాహిత్యంలో మాట్లాడే భాషను ఉపయోగించుకోగలుగుతున్నాం. గిడుగు వెంకట రామమూర్తి (1863-1940) ఆధునిక తెలుగు భాషానిర్మాతల్లో ముఖ్యుడు. ఉపాధ్యాయుడు, చరిత్ర, శాసన పరిశోధకుడు, వక్త, విద్యావేత్త. అలాంటి వ్యక్తి పుట్టిన రోజునే తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.  
 
అయితే తెలుగు భాషకు ఇతర రాష్ట్రాల్లో ప్రాధాన్యత తగ్గిపోవడంతో పాటు.. సొంత రాష్ట్రాల్లోనే తెలుగు భాషకు తగిన గుర్తింపు లభించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని చిన్నారులకు మాతృభాష దూరం కాకుండా చూడాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వ్యావహారిక భాషోద్యమ మూలపురుషుడు గిడుగుకు నివాళులర్పించారు. అనంతరం పవన్‌ మాట్లాడుతూ.. తెలుగు భాషకు పట్టం కట్టడమే గిడుగుకు నిజమైన నివాళి అన్నారు.
 
మాతృభాష తీయదనం భావితరాలకు అందించేందుకే 'మన నుడి- మన నది' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలో ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యవహారాలన్నీ తెలుగులోనే ఉండాలని, ప్రభుత్వం వాడే భాష ప్రజలందరికీ అర్థమయ్యేలా సరళంగా ఉండాలన్నారు. ప్రజలు కూడా నిత్య వ్యవహారాల్లో తెలుగుభాషకు పట్టం కట్టాలని ఈ సందర్భంగా పవన్‌ కోరారు.