1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (20:07 IST)

రేపు తిరుపతిలో ఆలయాలు మూత

తితిదేకి అనుబంధంగా ఉన్న ఆలయాలను సూర్యగ్రహణం కారణంగా ఈనెల 21న మధ్యాహ్నం వరకు మూసివేస్తున్నట్లు తితిదే ప్రకటించింది.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఆలయాలను 20వ తేదీ రాత్రి ఏకాంత సేవ తరువాత మూసివేస్తారు. 

నేటి రాత్రి 8:30 గంటలకు ఏకాంత సేవ తర్వాత తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. రేపు ఉదయం 10:18 గంటల నుంచి మధ్యాహ్నం 1:38 గంటల వరకు సూర్యగ్రహణం ఉండడంతో మధ్యాహ్నం 2:30 గంటలకు తిరిగి ఆలయాన్ని తెరవనున్నారు.

అనంతరం రోజువారి కైంకర్యాలు నిర్వహించి రాత్రి 8:30 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తామని, కైంకర్యాల నిర్వహణలో భాగంగా రేపు భక్తులకు దర్శనం ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. తిరుచానూరు, అప్పలాయగుంట ఆలయాల్లో భక్తులకు ఆ రోజు దర్శనం ఉండదు.