జులై 10 నుంచి పదో తరగతి పరీక్షలు..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్రంలో జులై 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సచివాలయం నాల్గవ బ్లాక్ మొదటి అంతస్థులోని తన ఛాంబర్ లో మంత్రి ఈ మేరకు పదవ తరగతి పరీక్ష తేదీల వివరాలను ప్రకటించారు.
ఆరు రోజుల పాటు పదవ తరగతి పరీక్షలు, రెండు రోజుల పాటు ఓరియంటల్ ఎస్సెస్సీ, వొకేషనల్ ఎస్సెస్సీ పరీక్షలు జరుగుతాయన్నారు. 17వ తేదీనాటికి పరీక్షలు ముగుస్తాయని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు అనుకున్న విధంగా కాకుండా ఈ దఫా 6 సబ్జెక్టులకు 6 పేపర్లు, ఒక్కొక్క పేపర్ కు 100 మార్కుల చొప్పున ప్రశ్నాపత్రాలు ఉంటాయని మంత్రి వివరించారు.
10.07.2020 శుక్రవారం ఫస్ట్ లాంగ్వేజ్, 11.07.2020 శని వారం సెకండ్ లాంగ్వేజ్, 12.07.2020 ఆదివారం థర్డ్ లాంగ్వేజ్, 13.07.2020 సోమవారం గణితం, 14.07.2020 మంగళవారం జనరల్ సైన్స్ (ఫిజికల్ సైన్స్ మరియు బయాలజికల్ సైన్స్ కలిపి), 15.07.2020 బుధవారం సోషల్ స్టడీస్, పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
16.07.2020 గురువారం ఓరియంటల్ ఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్, 17.07.2020 శుక్రవారం ఎస్సెస్సీ వొకేషనల్ కోర్సుకు సంబంధించిన పరీక్షలుంటాయని తెలిపారు. సిలబస్ కు సంబంధించిన అంశాలను మాత్రమే ప్రశ్నాపత్రంలో పొందుపరుస్తామని మంత్రి స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారిని నియంత్రించే కార్యక్రమంలో భాగంగా కొన్ని షరతులు విధించిన నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్ ను 11 పేపర్ల నుండి 6 పేపర్లకు కుదించడం జరిగిందని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విద్యార్థులు ఈ మార్పును గమనించాలని ఆయన సూచించారు. ప్రశ్నాపత్రాల నమూనాను, పరీక్షా కేంద్రాల వివరాలను త్వరలో ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను రేపు అధికారికంగా ప్రకటిస్తామన్నారు.
ఇంకా రెండు నెలల సమయం ఉన్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలకు సమాయత్తం కావాలన్నారు. డీఈవో, కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు.పరీక్షా కేంద్రాలను గుర్తించాలని చెప్పామన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోవిడ్-19 ను నియంత్రించే కార్యక్రమంలో భాగంగా కంటైన్ మెంట్ జోన్ లకు అతీతంగా పరీక్షా కేంద్రాలను గుర్తించి పరీక్షలు నిర్వహించాలని చెప్పామన్నారు.
భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్షలు రాసే విధంగా పరీక్షా కేంద్రాల్లో సీట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పుడున్న 2009 సెంటర్లకు అదనంగా మరిన్ని పరీక్షా కేంద్రాలను గుర్తిస్తామన్నారు. పరీక్షా కేంద్రాలను గుర్తించడం, సీటింగ్ విధానం,రవాణా సౌకర్యం కల్పించడం, హాల్ టికెట్లు అందజేయడం వంటి విషయాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా వంటి మాధ్యమాల ద్వారా విద్యార్థులకు పరిపూర్ణ సమాచారం అందించడం జరుగుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.