గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 27 జనవరి 2020 (21:31 IST)

మండలి సవరణలు సభ పాటించాల్సిన పని లేదు: జగన్‌

శాసన మండలి అనేది ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలని, అంతే తప్ప మంచి చేసే నిర్ణయాలు మండలి వల్ల ఆలస్యం కాకూడదని, మండలిలో కుట్రలు, రాజకీయ కోణంతో ప్రజలకు మేలు జరగకుండా పోయే పరిస్థితి రాకూడదని, అందుకే శాసనమండలి రద్దుపై నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

నిజానికి బిల్లులో మండలి చేసిన సవరణలను శాసనసభ పాటించాల్సిన అవసరం లేదన్న ఆయన, అయినా మండలిలో రాజకీయ కోణంతో బిల్లులను అడ్డుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి మండళ్లను ఏమనాలి? అన్న సీఎం, దీని వల్ల కాలయాపన, ప్రజా ప్రయోజనాలకు విఘాతంతో పాటు, ప్రజా ప్రయోజనాలకు ఆలస్యం జరుగుతోందని చెప్పారు.

మంచికి ఏ మాత్రం అవకాశం లేకపోవడమే కాకుండా, ప్రజా ప్రయోజనం లేని శాసన మండలి మీద డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగ అన్న ముఖ్యమంత్రి మండలికి ఏటా దాదాపు రూ.60 కోట్లు ఖర్చవుతున్నాయని వెల్లడించారు. అంత సొమ్ము ఇంత దండగ పనికి ఖర్చు చేయడం ధర్మమేనా? అన్న విషయాన్ని అందరం ఆలోచన చేయాలని కోరారు.

వీటన్నింటి నేపథ్యంలోనే మండలి రద్దుపై తీర్మానం చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. శాసనమండలి రద్దుపై శాసనసభలో సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. మండలి రద్దుపై ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా స్పష్టంగా వివరించారు. 
 
ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాల్సి ఉంది
ఒక ముఖ్యమైన నిర్ణయం కోసం సభ సమావేశమవుతోందని సభ్యులతో పాటు, ప్రజలందరికీ తెలుసని సీఎం చెప్పారు. అందరి ముందు ఇవాళ ఉన్న ప్రశ్న కేవలం శాసనమండలి భవిష్యత్తుకు సంబంధించింది మాత్రమే కాదని ఆయన స్పష్టం చేశారు.

ప్రజాస్వామాన్ని మనమంతా కూడా బ్రతికించుకోవాలా? వద్దా? అన్న ప్రశ్న మన మందుందని చెప్పారు. అదే విధంగా ప్రజా ప్రభుత్వాలు సక్రమంగా పని చేయాలా? వద్దా? అన్న ప్రశ్నకు కూడా సమాధానం వెతకాల్సి ఉందని పేర్కొన్నారు. 
 
అసెంబ్లీకే అన్ని అధికారాలు
రాజ్యాంగంలోని ఆర్టికిల్‌ 164–2 ప్రకారం, ముఖ్యమంత్రి నేతృత్వంలోని క్యాబినెట్‌ నేరుగా శాసనసభకు జవాబుదారీగా ఉంటుందని, అందుకు కారణం అది నేరుగా ప్రజలు ఎన్నుకున్న సభ అని సీఎం తెలిపారు.

రాజ్యాంగాన్ని తయారు చేసిన కాన్సిట్యుయెంట్‌ అసెంబ్లీ (రాజ్యాంగ సభ) కూడా మండలి కచ్చితంగా అవసరమే అని అనుకుంటే, ప్రతి రాష్ట్రంలోనూ రద్దు చేయడానికి వీలు లేని విధంగా మండలిని ఏర్పాటు చేసి ఉండేదని గుర్తు చేశారు. అలా కాకుండా రెండో సభను ఆప్షనల్‌గా రాష్ట్ర శాసనసభ నిర్ణయానికే వదిలేసి ఆర్టికిల్‌–169 ప్రకారం, మండలి రద్దు అధికారాన్ని కూడా రాష్ట్ర అసెంబ్లీకే ఇచ్చిందని చెప్పారు. 
 
అప్పుడు ఎందుకు?
దేశంలో చదువుకున్న వారి సంఖ్య అతి తక్కువగా ఉన్న రోజుల్లో మేధావులు, విజ్ఞులు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశాలు తక్కువగా ఉన్న రోజుల్లో ఈ ప్రత్యేక మండళ్లు ఏర్పాటు చేసుకునే వీలు రాష్ట్రాలకు కల్పించారని సీఎం వెల్లడించారు. 
 
కానీ ఇప్పుడు ఎవరెవరున్నారు?
అయితే నేటి శాసనసభలో అలాంటి దుస్థితి లేదన్న ఆయన, ఇదే చట్టసభలో ముగ్గురు పీహెచ్‌డీలు, 38 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, 13 మంది డాక్టర్లు, 14 మంది ఇంజనీర్లు, 68 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారని వెల్లడించారు.

ఇంకా వీరిలో ముగ్గురు సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు, ఇద్దరు గ్రూప్‌ వన్‌ అధికారులు, ఒక ప్రొఫెసర్, ఒక జర్నలిస్టు, ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు, రైతులు కూడా ఉన్నారని చెప్పారు. వీరంతా ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులని ఆయన గుర్తు చేశారు.
 
కేవలం ఆరింటిలోనే! 
మరి ఇలాంటి నేపథ్యంలో దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే కేవలం 6 రాష్ట్రాల్లోనే ఈ మండళ్లు ఉన్నాయన్న సీఎం, అవేమిటో చెప్పారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్‌లోనే మండళ్లు ఉన్నాయన్న ఆయన, నిజానికి ఏపీ ఉమ్మడి రాష్ట్రం కాబట్టి, ఒకటే అని పరిగణించవచ్చని, అందుకే 5 రాష్ట్రాలు మాత్రమే అని చెప్పాలన్నారు. అయినా ఇప్పుడు విడిపోయాయి కాబట్టి, మొత్తం 28 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాలలో మాత్రమే మండళ్లు ఉన్నాయని తెలిపారు.
 
ఎవరెవరు వద్దన్నారు?
గతంలో ఈ మండళ్లు ఉన్న పరిస్థితి చూసి, మాకు ఈ మండళ్లు వద్దు అని ఉపసంహరించుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయన్న ముఖ్యమంత్రి.. అసోం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లు మండళ్ల పని తీరు భరించలేక ఉపసంహరించుకున్నాయని వెల్లడించారు. 
 
కుట్రలు–రాజకీయ కోణం 
రాష్ట్ర క్యాబినెట్‌ శాసనసభకే తప్ప మండలికి జవాబుదారీ కాదన్న వాస్తవం అని, ఇటువంటి వాస్తవం ముందు శాసనసభ చేసిన ఏ బిల్లు అయినా కూడా మండలికి ఎందుకు వెళ్లాలన్న ప్రశ్నకు సమాధానం లేదని సీఎం పేర్కొన్నారు.  

‘ఇవాళ వాళ్లు చేస్తున్న రాజకీయాలు ఈ స్థాయికి దిగజారిపోయిన తర్వాత చూస్తూ ఉన్నప్పుడు. శాసనమండలి చేసిన సవరణలు కూడా పాటించాల్సిన అవసరమే శాసనసభకు లేనప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ప్రజలచేత ఎన్నుకోబడ్డ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేవలం రాజకీయ కోణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే మరి మండళ్లు పని చేస్తుంటే, ఇలాంటి మండళ్లను ఏమనాలి?

దీని వల్ల కాలయాపన, ప్రజా ప్రయోజనాలకు విఘాతం, ప్రజా ప్రయోజనాలకు ఆలస్యం కలగడం తప్ప, ఏ మంచి జరిగే అవకాశం ఇవాళ కనిపించడం లేదు. ప్రజా ప్రయోజనం లేని మండలి. దీని మీద డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగ. ఇటువంటి మండలికి ట్రెజరీ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసే అర్హత కూడా లేదు.

ఇటువంటి మండలికి ప్రభుత్వం ఏటా దాదాపు రూ.60 కోట్లు ఖర్చు చేస్తా ఉంది. ఇంతింత సొమ్ము ఇంత దండగ పనికి ఖర్చు చేయడం ధర్మమేనా అని చెప్పి అందరం ఆలోచన చేయాలి’ అని ముఖ్యమంత్రి కోరారు.
 
ఈ బిల్లులు అడ్డుకున్నారు
‘ప్రజలకు ఎంతో ఉపయోగపడే స్కూళ్లు. వాటిలో ఇంగ్లిష్‌ మీడియమ్‌లు పెట్టడం కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌ వల్ల పేద పిల్లలు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా వారికి ఇంగ్లిష్‌ మీడియమ్‌ చదువులు అబ్బుతాయంటే అటువంటి దానికి అడ్డుకుంటారు.

ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేసి వారి సమగ్రాభివృద్ధి కోసం మంచి జరగాలి, ఇంకా ఫోకస్‌గా వాళ్లకు మంచి జరగడం కోసం ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు కావాలని బిల్లులు పెడితే దానికీ అడ్డు తగులుతారు. చివరకు రాష్ట్రం అన్ని రకాలుగా ప్రతి ప్రాంతం కూడా బాగు పడాలని చెప్పి వికేంద్రీకరణ బిల్లు పెడితే, ఆ బిల్లును కూడా అడ్డుకున్నారు ఈ మండలిలో’ అని ముఖ్యమంత్రి వివరించారు.
 
సీరియస్‌గా ఆలోచించాలి
ప్రజలకు అన్నిరకాలుగా మంచి చేయాల్సింది పోయి, రాజకీయ కోణంలోనే ఆలోచించి ప్రజలకు ఎలా హాని చేయాలి?. బిల్లులు ఎలా సమయానికి రాకుండా పోవాలి?. బిల్లులు ఎలా కత్తిరించాలి? అడ్డగించాలి? అన్న దిక్కుమాలిన ఆలోచనలు చేసే ఇటువంటి దిక్కుమాలిన సభలు మనకు అవసరమా అని చెప్పి సీరియస్‌గా ఆలోచన చేయాలని సీఎం కోరారు. 
 
నాడు ఈనాడులో ఏం రాశారు?
గతంలో 1983లో అప్పట్లో ఎన్టీరామారావు గారు మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు, అప్పట్లో ఆ పార్టీ పాంప్లెంట్‌ పేపర్‌ ఈనాడు ఏం రాసిందో వాళ్ల ఎడిటోరియల్స్‌ ఒక్కసారి గమనిస్తే అన్న సీఎం ఆ పత్రిక క్లిప్పింగ్‌ చూపారు. 
1983లో ఎన్టీ రామారావు గారు మండలిని రద్దు చేస్తే, ఈనాడులో రాసింది చదివి వినిపించారు.

‘అనుభవంలో వాటి నిష్ప్రయోజకత్వాన్ని గుర్తించి కొన్ని రాష్ట్రాలు తర్వాత ఆ బురద కడుక్కున్నాయి. అందుకు పార్లమెంటు కూడా ఆమోదముద్ర వేసింది.అందుచేత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లెజిస్టేటివ్‌ కౌన్సిల్‌ను రద్దు చేయాలని నిర్ణయిస్తే దానికి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించి రభస చేయనవసరం లేదు. ఇంకా ఏం రాశారు’..
 
‘నిరర్థకమే కాక, గుదిబండగా కూడా తయారైన కౌన్సిల్‌ రద్దు గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ రద్దు వల్ల ఏదో జరగరాని ప్రమాదం జరిగినట్లుగా గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఈనాడులో ఏం రాశారంటే’..‘ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజా ప్రతినిధులు చేసిన నిర్ణయాన్ని అడ్డుకొట్టాలనుకోవడం ప్రజాస్వామ్యానికి పంగనామాలు పెట్టడమే అవుతుంది. రాజకీయంగా సంభవించిన పరాజయాన్ని మరో మార్గంలో విజయంగా మార్చుకోవడానికి పన్నే వ్యూహాలు ఏ పార్టీకి అయినా మంచి పేరు తీసుకురాలేవు.

ఈ వాస్తవాన్ని ప్రతిపక్షం గుర్తించి సవ్యమైన పద్ధతిలో కృషి చేసినప్పుడే మళ్లీ పుంజుకునే అవకాశం లభించవచ్చు. అంత ఓర్పు లేక అడ్డదార్లు తొక్కితే పరిస్థితి మరింత దుస్థితిగా పరిణమిస్తుంది’ అని మొత్తం చదివి వినిపించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌.. అంత చక్కగా అప్పట్లో ఈనాడులో రాశారని అన్నారు. 
 
ఒక్కడి కోసం
‘1983లో ఆనాడు మండలిని ఒక మనిషి కోసం ఆ రోజుల్లో రద్దు చేశారు. ఆ మనిషి సాక్షాత్తూ ఆ ఈనాడు అధినేత రామోజీరావు గారు. అప్పటి రాజకీయాలపై కాస్తో కూస్తో అవగాహన ఉన్న ఎవరికైనా ఆ విషయాలు అర్థమవుతాయి. ఆరోజు ఒక మనిషి కోసం ఏకంగా మండలిని రద్దు చేశారు.

అటువంటి మనిషి కోసం రద్దు చేస్తేనే ఇటువంటి గొప్ప గొప్ప ఎడిటోరియల్స్‌ రాశారు. మరి ఈరోజు కోట్ల మంది ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న చట్టాలకు రాజకీయ కోణంతో అడ్డుకున్న రీత్యా, అనవసర ఆర్థిక భారం దృష్ట్యా రద్దు చేస్తున్నామంటే అందుకు గర్వపడుతున్నాం’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
 
మాకు మెజారిటీ వస్తుంది. అయినా? 
‘ఇదే మండలిని ఇలాగే కొనసాగిస్తే వచ్చే ఏడాదిలోనే మా పార్టీకి మెజారిటీ వస్తుందని అందరికీ తెలుసు. మాకు కావాల్సి వారిని ఈ సభలో పెట్టుకునేందుకు దండిగా అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ పార్టీగా మాకున్న అవకాశాల కన్నా ప్రజలకు ఉన్న అవసరాలు, ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు ముఖ్యం కాబట్టి, మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేస్తున్నాం ఇవాళ’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
 
ఎల్లో మీడియా అసత్య ప్రచారం
‘అన్ని అంశాలు ఆలోచించి ప్రజా ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం ఇవాళ. ఆపరేషన్‌ ఆకర్ష అంటూ చంద్రబాబు గారి పత్రికలు సిగ్గుమాలిన రాతలు రాశాయి. ఒక్కో ఎమ్మెల్సీని కోట్లు పెట్టి కొంటున్నామంట. ఇంత దిగజారుడు రాతలు చంద్రబాబు గారి పేపర్లలో చూస్తున్నాం.

నాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే వీళ్లు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు గారు పట్టపగలే ఖూనీ చేస్తుంటే ఏ రోజైనా వీరు కనీసం నోరైనా విప్పారా? అని మీ సమక్షంలో, ఈ సభ సమక్షంలో అడుగుతున్నాను.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ  ఇదే చంద్రబాబు ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయినా కూడా వీరు కనీసం నోరైనా విప్పారా? అని అడుగుతున్నాను. ఇదే ఈనాడు, ఇదే చంద్రజ్యోతి, ఇదే టీవీ5. ఇదే ఎల్లో మీడియాను అడుగుతున్నాను’. 

‘మా పార్టీ వారిని అక్షరాలా 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేసి, కండువాలు కప్పి, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడిచినా ఇవే పత్రికలు, ఇదే ఎల్లో మీడియా కనీసం నోరైనా విప్పాయా? అని అడుగుతున్నాను.

అలా నోరు విప్పకపోగా, చంద్రబాబునాయుడు గారు గొప్ప రాజనీతిజ్ఞుడని, ఆయన గారి గొప్ప పరిపాలన చూసి ముగ్ధులై ఎమ్మెల్యేలు అటువైపు పోతున్నారని దిక్కుమాలిన స్టోరీలు. దిక్కుమాలిన రాతలు.

ఆ రోజుల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి బలం లేకపోయినా కడప, కర్నూలు, నెల్లూరులో  ఎంపీటీలు, జడ్పీటీసీల్లో మాకు బలం ఉన్నా, వీళ్లు ఎంత దిక్కుమాలిన రీతిలో కొనుగోలు చేసి గెల్చారో కూడా అందరికీ తెలుసు. అయినా ఈ ఎల్లో మీడియా కానీ, ఈనాడు కానీ, చంద్రజ్యోతి కానీ, ఈ టీవీ5 కానీ ఏరోజైనా ఒక్క రోజైనా మాట్లాడారా?’ అని సీఎం సూటిగా ప్రశ్నించారు.
 
మూడు రోజుల సమయం ఇచ్చినా! 
‘అలాంటి రాజకీయాలు మేము చేయాలనుకోవడం లేదు. ఈ చట్టసభలో అడుగు పెట్టిన మొట్టమొదటి రోజే నేను చెప్పాను.. 23 మంది వాళ్ల సభ్యులున్నారు. చంద్రబాబునాయుడు గారి మాదిరిగానే నా ఆలోచనలు ఉంటే, చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా రాదని చెప్పాను.

ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేయడం కోసం మేము ఈ చట్టసభలోకి అడుగు పెట్టలేదు. రాజకీయాలను మార్చడం కోసం అధికారంలోకి వచ్చామని గర్వంగా చెబుతున్నాం. గురువారం నాడు మండలి రద్దుకు ప్రతిపాదించాం’.
‘సోమవారం సభ పెట్టాం. మండలి రద్దు కోసమే సభ పెడుతున్నామని ఆరోజు గురువారం చెప్పడం జరిగింది.

అయినా మేమేదో మాట మార్చబోతున్నామని, ఒక్కొక్క ఎమ్మెల్సీకి మేము రూ.5 కోట్లు ఆఫర్‌ చేస్తున్నామని, ఆ పేపర్లు రాతలు చూస్తుంటే, ఆ టీవీ ఛానళ్ల వాళ్లు చెబుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కేవలం శుక్రవారం, శనివారం, ఆదివారం.. ఈ మూడు రోజులు మాత్రమే సమయం ఇచ్చాం’.

‘ఈ మాత్రం సమయం కూడా మేము ఇవ్వకపోయి ఉంటే, ఇదే ఎల్లో మీడియా, ఇదే ఈనాడు, ఇదే చంద్రజ్యోతి, ఇదే టీవీ5 ఏమనేవి? యూనిలేటరల్‌గా జగన్‌ నిర్ణయం తీసుకున్నాడు. ఎవరితోనూ సంప్రదించలేదు. ఎవరి సలహాలు తీసుకోలేదు. యూనిలేటరల్‌గా జగన్‌ నిర్ణయం తీసుకున్నాడు అంటారు.

అలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి, కనీసం రాష్ట్ర ప్రజలు అందరూ దీని గురించి ఆలోచన చేయాలి. శాసనసభ్యులు కూడా ఆలోచన చేయాలి అని చెప్పి, ఇది నానాలి అని చెప్పి కేవలం శుక్ర, శని, ఆదివారాలు మూడు రోజుల సమయం ఇచ్చి, నాలుగో రోజు సోమవారం మళ్లీ ఇదే సభలో ఇదే అంశం మీద మండలి రద్దు మీద కూర్చుంటే వీళ్లు రాసిన రాతలు ఏమిటి?

ఒక్కో ఎమ్మెల్సీకి 5 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని దిక్కుమాలిన రీతిలో రాతలు. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు, ఎటు వాటం పడితే అటు మాట్లాడే నాయకులు, ఇటువంటి పార్టీలు, వీళ్లకు తానా అంటే తందానా అంటున్న ఎల్లో మీడియా. వీళ్లను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
 
నిజంగా వీళ్లు ఎలా మాటలు మారుస్తారు? మాటలు మార్చే అలవాటు ఎవరికి ఉంది? విలువలు, విశ్వసనీయత లేని వారు ఎవరు అని ఒక్కసారి గమనించాలి. ఒక్కసారి మీరు అనుమతి ఇస్తే.. ఎవరికి విలువలు, ఎవరికి విశ్వసనీయత లేదు.

ఎవరు ఎలా మాటలు మారుస్తారు అన్నది చూపిస్తాము అంటూ.. వివిధ సందర్భాలలో చంద్రబాబునాయుడు మాట్లాడిన వాటి క్లిప్పింగ్‌లు ప్రదర్శించారు. ముందుగా ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు మార్చిన మాటల వీడియో క్లిప్పింగ్‌ ప్రదర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో ఏ మాదిరిగా చంద్రబాబునాయుడు గారు ఏ మాదిరిగా మాటుల మారుస్తూ పోయారో క్లిప్పింగ్‌. తర్వాత ప్రధాని మోడీ గారి విషయంలో ఈయన ఏ రకంగా మాట్లాడారో కూడా చూద్దాం అంటూ ఆ వీడియో కూడా ప్రదర్శించి చూపారు.
...
పోనీ కాంగ్రెస్‌ విషయంలో చంద్రబాబు ఏ మాదిరిగా మాట మార్చారన్నది కూడా ఒకసారి చూద్దాం అంటూ.. ఆ క్లిప్పింగ్‌లు కూడా ప్రదర్శించి చూపారు.
...
ఇక మండలి విషయంలో కూడా చంద్రబాబు ఏమేం మాట్లాడారన్నది ఒకసారి చూద్దాం అంటూ, ఆ క్లిప్పింగ్‌లు కూడా సభలో ప్రదర్శించారు.
...
 
ఇదీ చంద్రబాబు నైజం
‘ఏ విషయంలో కూడా ఒక స్థిరత్వం లేదు. అవసరానికి ఏ మాట అయినా మాట్లాడుతాడు. అవసరం తీరిన తర్వాత ఎవరినైనా సరే ఇంక్లూడింగ్‌ కూతురునిచ్చిన మామ అయినా సరే, వెన్నుపోటు పొడవడానికి ఏ మాత్రం వెనుకాడడు. ఇటువంటి చంద్రబాబునాయుడు గారి స్టాండర్డ్‌ మాటలు ఏమంటే.. అన్యాయం జరిగిపోతా ఉంది.

అందుకే నేను మాట్లాడుతున్నాను.. అన్నది చంద్రబాబునాయుడు గారి స్టాండర్డ్‌ మాట. నోరు తెరిస్తే చాలు ఆయన చేసే తప్పుడు పనులను కప్పి పుచ్చుకునేందుకు అన్యాయం జరిగిపోతా ఉంది అని మాట్లాడుతాడు’ అని సీఎం పేర్కొన్నారు.
 
వీటికి సమాధానం చెప్పండి
రాష్ట్ర ప్రజలందరి తరపున ఇదే చంద్రబాబునాయుడు గారిని కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడుగుతున్నానంటూ, పలు అంశాలను సీఎం ప్రస్తావించారు.
 
న్యాయం చేయడమా? అన్యాయం చేయడమా?
‘ఇదే మండలికి సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు గతంలో ఒకే కమిషన్‌ ఉండేది. వారి క్షేమం, అభివృద్ధి కాంక్షించి, మరింత ఫోకస్డ్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు చేస్తూ ఒక చట్టం చేశాం. మరి ఈ చట్టం తీసుకొచ్చే కార్యక్రమం న్యాయం చేయడమా? లేక చంద్రబాబునాయుడు గారు దాన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం ఏదైతే చేశాడో.. ఇది అన్యాయం చేయడమా? అని మీ తరపున ప్రశ్నిస్తున్నాను’.
 
‘పేద పిల్లలకు రూపాయి కూడా ఖర్చు కాకుండా ఇంగ్లిష్‌ మీడియమ్‌ చదువులు తీసుకురావడం మా తరపు నుంచి న్యాయం చేయడమా? లేకపోతే మేము ప్రజలకు అన్యాయం చేయడమా అని అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు దీన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమ బాట పడుతున్న పరిస్థితుల్లో’.

‘ఇదే చంద్రబాబు గారు ఏం అన్యాయం జరిగిందని చెప్పి ఇవాళ అమరావతిలో కొందరిని రెచ్చగొడుతున్నారు? అమరావతిలో రైతులకు ఇస్తున్న యాన్యుటీని గతంలో ఒప్పందం ప్రకారం 10 ఏళ్లు ఉంటే దాన్ని 15 సంవత్సరాలకు పెంచాం. ఇది అన్యాయం చేయడమా? లేక మరింతగా న్యాయం చేయడమా? అని అడుగుతున్నాను’.

‘అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాలలో భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇస్తున్న జీవనభృతి టీడీపీ హయాంలో రూ.2500 ఇస్తే, మేము రూ.5 వేలు ఇవ్వబోతున్నాము. ఇది అన్యాయం చేయడం అవుతుందా? లేక మరింత న్యాయం చేయడం అవుతుందా?’.

‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, పేదలు.. ల్యాండ్‌ పూలింగ్‌లు భూములిచ్చిన అసైన్డ్‌ రైతులకు కూడా పట్టా రైతుల మాదిరిగానే సమాన విస్తీర్ణంలో రిటర్నబుల్‌ ప్లాట్లు ఇవ్వబోతున్నాం. ఇది అన్యాయం చేయడం అవుతుందా? లేక గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు గారు చేసిన తప్పిదాన్ని మేము రిపేర్‌చేస్తున్నాం. ఇది తప్పవుతుందా? అని అడుగుతున్నాను’.

‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందించాలని వికేంద్రీకరణ బిల్లు తీసుకువచ్చి, ఇక్కడే లెజిస్లేటివ్‌ అసెంబ్లీ కొనసాగిస్తూ, రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా ఉన్న విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గానూ, 1937 నాటి (స్వాతంత్య్రానికన్నా ముందు) శ్రీబాగ్‌ ఒప్పందాన్ని ఇప్పటికైనా అమలు చేయాలన్న ఉద్దేశంతో కర్నూలును జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా ప్రకటిస్తే, ఎవరికి అన్యాయం చేసినట్లు అని చంద్రబాబునాయుడు గారిని అడుగుతున్నాను’.
 
‘బాబు సింగపూర్‌నో, జపాన్‌నో, బాహుబలి వంటి మోసపు సినిమా సెట్టింగ్‌లు చూపకుండా మన ఆర్థిక పరిస్థితి, మన అవసరాలు, మనం ఏం చేయగలం? ఏ మేరకు అవి చేయగలం? ఏవి చేస్తే మన పిల్లలకు మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మెరుగవుతుంది? అని చెప్పి ఎవరికీ అన్యాయం చేయకుండా, అందరికీ న్యాయం చేయడానికి ఆరాప పడితే అది తప్పా? అని అడుగుతున్నాను’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.
 
మండళ్లు మంచి చేసేవిగా ఉండాలి
వీటన్నింటి గురించి రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచించాలన్న ఆయన, సభలు, మండళ్లు ప్రజలకు మంచి చేసేవిగా ఉండాలని, మంచి చేసే నిర్ణయాలు ఆలస్యం కాకూడదని, మంచి చేసే నిర్ణయాలు కుట్రల వల్ల, రాజకీయ కోణంతో ఆలస్యమై ప్రజలకు జరగాల్సిన మేలు జరగకుండా పోయే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు.
 
అందరూ బలపర్చాలి
అందుకే ఇటువంటి రద్దు చేసే తీర్మానం ఇవాళ చేస్తున్నామన్న సీఎం, దీనికి ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ, అందరి దీవెనలు కావాలంటూ, తీర్మానాన్ని సభ్యులంతా బలపర్చాలని కోరారు.
 
మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ కోట్‌తో..
చివరగా.. వన్‌ ఆఫ్‌ ది గ్రేటెస్ట్‌ సివిల్‌ రైట్స్‌ యాక్టివిస్ట్‌ మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ కోట్‌.. ‘ది టైమ్‌ ఈజ్‌ ఆల్వేస్‌ రైట్‌ టు డు వాటీజ్‌ రైట్‌’ ను ప్రస్తావించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌.. మండలి రద్దు తీర్మానానికి అందరి ఆశీస్సులు కోరుతున్నానంటూ ప్రసంగం ముగించారు.
 
తీర్మానానికి ఆమోదం
ఆ తర్వాత మండలి రద్దుపై ఓటింగ్‌ జరిగింది. డివిజన్‌ విధానంలో ఆ ఓటింగ్‌ జరిగింది. సభలో ఉన్న మొత్తం 133 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. ఈ సందర్భంగా సభలో సభ్యులు కాని మంత్రులు శ్రీ మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను వేరుగా కూర్చోబెట్టారు. 
 
సభ నిరవధిక వాయిదా
ఆర్టికిల్‌ 169–1 ప్రకారం శాసనసభ మూడింట రెండొంతుల మెజారిటీతో మండలిని రద్దు చేయవచ్చని నిర్దేశించిందని, ఆ ప్రకారం సభకు హాజరైన మొత్తం సభ్యుల నిర్ణయంతో మండలిని రద్దు చేస్తే తీర్మానం ఆమోదం పొందిందని ప్రకటించిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆ తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేశారు.