గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 25 జనవరి 2020 (08:53 IST)

జగన్ వద్దకు వెళ్లాల్సిన ఖర్మ లేదు.. ఆ మాట ఎవరు.. ఎందుకన్నారో తెలుసా?

జగన్ వద్దకు వెళ్లాల్సిన ఖర్మ లేదని, తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. టీడీపీని వీడుతున్నట్లు కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు.

శ్రీశైలంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో సహకరించిన చంద్రబాబును వదిలి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. వైసీపీ నాయకులే ఇలాంటి ప్రచారాలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదని, తమనేత చంద్రబాబు సీఎం హోదాలో ఉన్నప్పుడు కూడా తనకెంతో మర్యాద ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అలాంటి వ్యక్తిని వదిలి జగన్‌ ఇంటి గేట్ల దగ్గరకు వెళ్లాల్సిన ఖర్మ తనకు లేదని తేల్చిచెప్పారు.

శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీకి, బుడ్డా కుటుంబానికి బలమైన క్యాడర్‌ ఉందని, తనకు పార్టీ మారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాను కార్యకర్తల అభిప్రాయం మేరకే నడుచుకుంటానని అన్నారు. రాష్ట్రంలో ప్రాంతల మధ్య చిచ్చురేపి సీఎం జగన్‌ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని, ఇది క్రూరమైన చర్య అని విమర్శించారు.

రాష్ట్రానికి చరిత్రాత్మక రాజధాని కావాలని అమరావతి రైతులు 33 వేల ఎకరాల భూములను త్యాగం చేశారని, సీఎం జగన్‌ రాజధానిని మార్చాలని నిర్ణయించడం దుర్మార్గమని అన్నారు. మూడు రాజధానుల మాట మూర్ఖత్వమని స్పష్టం చేశారు.

ఇప్పటికే అనేక కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లాలయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని మార్పు జరిగితే కర్నూలుకు అవకాశం ఇవ్వాలే గాని విశాఖకు తరలించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

వైసీపీ నాయకులు చేస్తున్న కుట్రలతో సీమ ప్రజలకు తీవ్ర నష్టం జరుగనుందని, త్వరలో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం రావడం ఖాయమని అన్నారు. సీమ ప్రజల్ని మభ్యపెట్టేందుకే కర్నూలుకు హైకోర్టు ఇచ్చారని, దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు.

రాజధానిని విశాఖకు తరలిస్తున్నా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు నోరు మెదపకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఎనిమిది నెలల వైసీపీ పాలనతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడ్డారని, నవరత్నాలతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన జగన్‌కు ప్రజలు బుద్ధిచెబుతారని అన్నారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఎలాంటి శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను ఖర్చు చేస్తున్నారే తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని అన్నారు.

ఈ సమావేశంలో శ్రీశైలం ట్రస్టుబోర్డు చైర్మన్‌ వంగాల శివరామిరెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నూర్‌ మహ్మద్‌, టీడీపీ నాయకులు తిరుపమయ్య, యుగంధర్‌ రెడ్డి, శివప్రసాద్‌ రెడ్డి, ఇస్కాల రమేష్‌, వరాల మాలిక్‌, మోమిన్‌ ముస్తఫా, గౌస్‌ ఆజం, అబ్దుల్లాపురం బాషా పాల్గొన్నారు.