74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ప్రభుత్వ సలహాదారు ( ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ యంత్రాంగం సమయస్ఫూర్తి, పట్టుదలతో వివిధ పద్దతుల్లో పనిచేయడం ద్వారా.. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ ను ఎదుర్కోవడంలో చాలా సమర్థవంతంగా పనిచేసి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా, మార్గదర్శంగా నిలిచిందన్నారు.
దేశం కూడా ఈ విషయాన్ని గుర్తించిందని, విదేశాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ప్రశంసలు వచ్చాయని సజ్జల తెలిపారు. కోవిడ్ పరిస్థితిని సీఎం జగన్ గారు నిత్యం పర్యవేక్షిస్తున్నారని, సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టామని సజ్జల చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారని, వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్రానికి స్వర్ణ యుగం ప్రారంభమైందన్నారు.
గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ద్వారా రియల్ టైంలో నేరుగా ప్రజలతో సంబంధాలు కలిగి లబ్ధిదారుల గడప వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. గత ఆరు-ఏడు నెలల్లోనే.. అంటే 2020 జనవరి నుంచి ఇప్పటివరకు, వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ. 33 వేల కోట్లకు పైగా నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. దీనివల్ల 3 కోట్ల 75 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు.
జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర జానాభాలో 80 శాతం మందికి ఏదో ఒక పథకం ద్వారా ప్రయోజనం చేకూరిందని తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.60వేల కోట్లు దాకా వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ప్రజలకు మనీ ట్రాన్స్ ఫర్ అయిందని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు.
ఇటువంటి ఆపద సమయంలో ఉపాధి లేక కష్టాలు పడుతున్న శ్రమ జీవులకు, కార్మికులకు, పేదలకు, కూలీలకు ఒక పెద్ద రిలీఫ్ గా ఈ సొమ్ము ఉపయోగపడిందన్నారు. కష్ట సమయంలో తిండి లేక ఇబ్బంది పడుతున్నసమయంలో ఇంటింటికి ఉచితంగా బియ్యం సరఫరా చేయడం ద్వారా మాత్రమే కాకుండా.. రైతుల దగ్గర నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనడంలోనూ ప్రభుత్వం ముందుందన్నారు.
అమ్మ ఒడి, రైతు భరోసా, వృత్తుల మీద ఆధారపడిన వారికి వివిధ పథకాల ద్వారా నేరుగా వారి ఖాతాలోకి డబ్బులు జమ చేయడం ద్వారా ఆర్థికశాస్త్రం పరంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ముఖ్మమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేశారన్నారు.
ప్రజల కొనుగోలు శక్తి తగ్గకుండా వారి కుటుంబాలకు అవసరమైన అవసరాలు తీర్చేవిధంగా జగన్ మోహన్ రెడ్డిగారు భరోసా కల్పించారన్నారు. ఈ విషయంలో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా, సగర్వంగా నిలబడిందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి రాష్ట్రానికి స్వర్ణయుగం మొదలైంది అని చెప్పారు.
అయితే ఊహించని ఆపదలు రావడం.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికే గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉండటం, ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూనే జగన్ మోహన్ రెడ్డి గుండె నిబ్బరంతో ఇచ్చిన మాట ప్రకారం అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని సజ్జల తెలిపారు.
ఒకవైపు ప్రభుత్వంలోని బ్యూరోక్రసీని.. మరోవైపు పార్టీనంతటిని సమన్వయం చేస్తూ ప్రజలకు అండగా నిలవడంలో ఒంటి చేత్తో జగన్ పరిపాలన చేస్తున్న తీరు అద్భుతంగా ఉందన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కాలం తర్వాత, ఆనాడు రాజశేఖర్ రెడ్డి పాలన చూసిన తర్వాత, దానికి నాలుగింతలు మిన్నగా, ఈరోజు పాలన ఉందని, ఇది అందరి నోటి వెంట వస్తున్న మాట అని సజ్జల తెలిపారు.
దీర్ఘకాలికంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో చాలా ముందుకు తీసుకోపోగలిగిన శక్తి, దానికి అవసరమైన వ్యూహంతో జగన్ ముందుకు వెళుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రజలముందుకు వెళ్లే సరికి ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఇవ్వగలిగిన పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని చెప్పారు. ఐతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడికక్కడ దెబ్బకొట్టాలన్న కుయుక్తులతో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం నికృష్టమైన ప్రయత్నాలు చేస్తుందన్నారు.
మార్చి 25న ఉగాది రోజున పేదల సొంత ఇంటి కల అయిన ఏకంగా 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని శ్రీకారం చుడితే.. అప్పటి నుంచి ప్రతిపక్ష తెలుగుదేశం దుర్మార్గపు చర్చ లేవనెత్తి, కోర్టుల్లో కేసులు కారణంగా వాయిదా పడుతూ వస్తుందని, ఇది ఒక దురదృష్టమైన పరిణామం అని సజ్జల అన్నారు.
అయినప్పటికి వీటన్నింటినీ అధిగమించి వీలైనంత త్వరగా పేదలకు 30లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి, రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారన్నారు. నిజానికి ఇళ్ళ పట్టాల పంపిణీ ద్వారా ఈ రోజు పేదలకు సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చేది కానీ, టీడీపీ కుయుక్తుల వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడినప్పటికి త్వరలోనే ఆ కార్యక్రమం చేపడతాం అని సజ్జల తెలిపారు.
ఈ కార్యక్రమలో పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, పార్టీ అధికార ప్రతినిధులు నారమల్లి పద్మజ, అంకంరెడ్డి నారాయణ మూర్తి, పార్టీ నాయకులు బొప్పన భవకుమార్, కావటి మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.