బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2020 (18:57 IST)

ఎన్నికల ముందు జగన్‌ ఏం చెప్పారు?.. ఇప్పుడేం చేస్తున్నారు?.. చంద్రబాబు ఆగ్రహం

తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధ‌వారం హైద‌రాబాద్‌లోని త‌న నివాసం నుండి జూమ్ యాప్‌‌లో విలేకరుల స‌మావేశంలో మాట్లాడారు. ప్రజలను నమ్మించి ద్రోహం చేశారని, వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.

వైకాపా నాయకులు ఎలా మాట తప్పారో ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు. జగన్‌, వైకాపా నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో వినిపించారు. రాష్ట్ర విభజన కంటే పెద్ద అన్యాయం ఇవాళ జరుగుతోందని విమర్శించారు. ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలని పేర్కొన్నారు.

రాజధానికి 30వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో చెప్పారా? లేదా? అని ప్రశ్నించారు. మీరు చేసే పనులు సరైనవని అనిపిస్తే ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ విసిరారు. ప్రజా ప్రయోజనాలను వదిలి నీచ రాజకీయాలను చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్నీ మరిచిపోయి ఇవాళ మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు.

అమరావతిని నాశనం చేస్తారని ఎన్నికల ముందే చెప్పానని గుర్తు చేశారు. వేలాది మంది రైతులు రహదారులపై ఆందోళన చేస్తున్నారన్నారు. 
 
అమరావతిపై ఎన్ని రకాలుగా మాట్లాడతారు?
అమరావతిపై మీరు ఎన్ని రకాలుగా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యముంటే ఎన్నికలకు వెళ్దాం.. రండి అని సవాల్‌ విసిరారు. రైతులతో జరిగిన ఒప్పందాన్ని కాపాడాలని చెప్పారు. కేంద్రం జోక్యం చేసుకుని రాజధానిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. వైకాపా, కాంగ్రెస్‌ నేతలు జగన్‌ను నిలదీయాలన్నారు. అసత్యాలు చెప్పి ప్రజలను మోసం చేయడం తప్పు అని హితవు పలికారు. అమరావతిపై ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని చెప్పారు.

రాజధానిని మార్చే అధికారం మీకు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో పోరాటం ఉద్ధృతం చేస్తామని వెల్లడించారు. ఐదు కోట్ల మంది ప్రజలు త‌మ‌తో కలిసి రావాలని కోరారు. నీతికి, నిజాయతీకి మారు పేరు.. విశాఖ వాసులు అని చెప్పారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించండి, మా పదవులు వదిలేస్తామని వెల్లడించారు. 2014లో అన్యాయం జరిగింది, మళ్లీ మళ్లీ మోసపోవడం తగదని పేర్కొన్నారు. 
 
రామాలయానికి భూమి పూజ శుభకరం:
రామాలయం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని చంద్రబాబు తెలిపారు. రామాలయానికి భూమి పూజ చేయడం శుభకరమని చెప్పారు. 200 నదుల పవిత్ర జలాలతో భూమి పూజలు చేశారన్నారు. అమరావతిలోనూ 30 నదుల పుణ్య జలాలతో భూమి పూజ చేసినట్లు చెప్పిన చంద్రబాబు, అమరావతికి అండగా ఉంటామని శంకుస్థాపన సమయంలో ప్రధాని చెప్పిన అంశాన్ని కూడా ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.