బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (12:21 IST)

సాగర్‌లో మిగిలిన నీరంతా మాదే: తెలంగాణ ప్రభుత్వం

ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో నిల్వ ఉన్న నీరంతా తమకే చెందుతుందని తెలంగాణ ప్రభుత్వం.. కృష్ణా బోర్డుకు తెలిపింది. రాబోయే రోజుల్లో దానిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు.. కృష్ణా బోర్డుకు లేఖ రాశారు.

జూన్‌ 1 నుంచి కొత్త వాటర్‌ ఇయర్‌ ప్రారంభమవుతోంది. దాంతో గత ఏడాది ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నీరు, వాడుకున్న నీరు వంటి విషయాలపై అధికారులు లెక్కలను అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టాలు కనీస నీటిమట్టం కంటే దిగువకు పడిపోయాయి.

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి ఎత్తు (ఎఫ్‌ఆర్‌ఎల్‌) 885 అడుగులు కాగా, ప్రస్తుతం 808.40 అడుగుల్లో నీటి నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 33.39 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అంటే.. ఉపయోగించుకోవడానికి ఈ రిజర్వాయర్‌లో నీరు లేదు. నాగార్జునసాగర్‌లో మాత్రం నీటిమట్టం కొంత మేర ఉంది. ఈ ప్రాజెక్టు నీటి మట్టం (ఎఫ్‌ఆర్‌ఎస్‌) 590 అడుగులు కాగా, ప్రస్తుతం 533.10 అడుగుల వరకు  ఉంది.

దీని పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకుగాను ప్రస్తుతం 174.26 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి సుమారు 45 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. మరోవైపు తెలంగాణకు కేటాయించిన కోటా మేర నీటిని ఉపయోగించుకోలేదు. ఏపీ మాత్రం తమకు కేటాయించిన నీటి కోటా కంటే ఎక్కువే వాడుకుంది.

దాంతో ప్రస్తుతం సాగర్‌లో ఉపయోగించుకోవడానికి వీలుగా ఉన్న 45 టీఎంసీలు తమ రాష్ట్రానికే చెందుతాయని, వీటిని వాడుకునే అవకాశం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రం తాజాగా కృష్ణా బోర్డును కోరింది.రానున్న బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

దీంతో తెలంగాణ వాదనపై అభిప్రాయం తెలపాలంటూ కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. నాగార్జునసాగర్‌లో గత ఏడాది కూడా సుమారు 40 టీఎంసీల నీరు ఉపయోగించుకోకుండా మిగిలింది. ఈ నీటిని క్యారీ ఓవర్‌ కింద తమకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డును కోరగా.. ఏపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ అంశం తమ పరిధిలో లేదని ట్రైబ్యునల్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని బోర్డు పేర్కొంది.