బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 26 మే 2021 (09:53 IST)

వ్యాక్సినేషన్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 45 ఏళ్లు బడిన వారికే టీకాలిస్తున్నారు. తాజాగా 18 ఏళ్లు పైబడి, పని ప్రదేశాల్లోని వ్యక్తులకు టీకా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పని ప్రదేశాల్లో ఉన్నవారికి ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది నేరుగా వెళ్లి టీకాలు ఇవ్వవచ్చు. లేదా వారే ఆస్పత్రులకు వచ్చి టీకాలు తీసుకోవచ్చు.

ఆయా సంస్థలు, కంపెనీలు, గేటెడ్‌ కమ్యూనిటీల వారికి కూడా ప్రైవేటు ఆస్పత్రులు టీకాలు ఇవ్వొచ్చని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రైవేటు ఆస్పత్రులకు ఈ అవకాశమిచ్చింది. ఈ మేరకు మంగళవారం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. 
 
ప్రస్తుతం కంపెనీలు నిర్ణయించిన ధరతో పాటు వ్యాక్సినేషన్‌ చార్జీలు చెల్లించి ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాలు తీసుకోవచ్చని తెలిపారు.  వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 244 ప్రైవేటు ఆస్పత్రులు టీకాలిచ్చేందుకు అనుమతులు తీసుకున్నాయి. వాటిలో కొన్ని ఆస్పత్రులు ప్రస్తు తం టీకాలివ్వడం లేదు. ఇంతకుముందు ప్రైవేటు ఆస్పత్రులు కేంద్రానికి డబ్బులు చెల్లించి, ఆ మేరకు టీకా డోసులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద తీసుకునేవి.

అయితే ఈ నెల 1 నుంచి ప్రైవేటు ఆస్పత్రులే ఉత్పత్తి కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేసుకోవచ్చని కేంద్రం పేర్కొంది. కాగా, ఇప్పటికే కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు పేరొందిన ఐటీ కంపెనీలతో టీకా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ కంపెనీల్లో పనిచేసే సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకూ టీకాలు వేసేందుకు ముందుకొచ్చాయి. కొన్ని ఐటీ కంపెనీలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకున్నాయి.
 
టీకా కోసం సమన్వయం..
ప్రైవేటు ఆస్పత్రులన్నీ ఉత్పత్తి సంస్థలతో నేరుగా సంప్రదింపులు జరిపే స్థితిలో లేవు. దీంతో టీకా వేసేందుకు ఆసక్తిగా ఉన్న ఆస్పత్రులను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సంప్రదిస్తున్నారు. సమ్మతి లేఖలతో పాటు వారికెంత వ్యాక్సిన్‌ కావాలో ఇండెంట్‌ తీసుకుంటున్నారు. ఆ ఇండెంట్లన్నీ ఉత్పత్తి కంపెనీలకు పంపుతారు. టీకాలకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఆయా ఆస్పత్రులు నేరుగా వ్యాక్సిన్‌ కంపెనీలకు చెల్లిస్తాయి. టీకా అనుమతి పొందిన అన్ని ప్రైవేటు ఆస్పత్రులతో వైద్యశాఖ మంగళవారమే సంప్రదింపుల ప్రక్రియ మొదలుపెట్టింది.
 
 
కంపెనీలు నిర్ణయించిన ధర మేరకే..
ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ను ప్రైవేటు ఆస్పత్రులకు ఒక్కో డోసును రూ.1200 చొప్పున విక్రయిస్తోంది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ కొవిషీల్డ్‌ ఒక్కో డోసును రూ.600కు అమ్ముతోంది. ప్రైవేటు ఆస్పత్రులు వీటికి అదనంగా సర్వీస్‌ చార్జీలు కలిపి టీకాలను వేయనున్నాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రులు రోజుకు ఇన్ని టీకాలను మాత్రమే వేయాలనే పరిమితి లేదు. వ్యాక్సిన్‌ లభ్యతను బట్టి ఎన్నయినా వేసుకోవచ్చు.  
 
సర్కారుపై తగ్గనున్న భారం
ప్రైవేటుకు అనుమతించడం వల్ల ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాలపై భారం తగ్గనుంది. మొదట్నుంచి రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాలు వేయించుకునేందుకే ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేటులో బంద్‌ అయిన తర్వాతే ప్రభు త్వ కేంద్రాలకు బారులు తీరారు. ప్రస్తుతం మళ్లీ ప్రైవేటుకు, అదీ 18 ఏళ్లు పైబడిన వారికి అవకాశం ఇవ్వడం, ప్రభుత్వ కేంద్రాల్లో 18-45 మధ్య వారికి టీకాలు దొరికే పరిస్థితి లేకపోవడంతో ఆ మధ్య వయస్కులంతా అటువైపే వెళ్లనున్నారు. 
 
ఈ మార్గదర్శకాలు పాటించాల్సిందే..
టీకా వేయించుకోవాలనుకునేవారు కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. 
ఒకవేళ డోసులు మిగిలితే అక్కడికక్కడే రిజిస్ట్రేషన్‌ చేసి టీకాలు ఇవ్వచ్చు.
టీకా తీసుకున్న వారు వేచి ఉండేందుకు తగినన్ని గదులు అందుబాటులో ఉండాలి. 
టీకా తీసుకున్న తర్వాత ఏదైనా దుష్ప్రభావం వస్తే, అటువంటి వారికి చికిత్స అందించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.