మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (07:51 IST)

కుటుంబం, సమాజం బాగున్నపుడే నిజమైన ఉగాది: మంత్రి మేకపాటి

మన కుటుంబం, మన చుట్టూ ఉన్న సమాజం బాగున్నపుడే ఉగాది పండగ అని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం పండుగ జరుపుకోలేని విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా చూడడం ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యమని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.

కరోనా వైరస్ నాకు రాదనుకునే అతి విశ్వాసం తగదని, అజాగ్రత్తగా ఉంటే మనతో పాటు మన వాళ్లని బాధపడేలా చేస్తుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసరమైతే మినహా పరిస్థితులు అదుపులోకి వచ్చేదాకా ఎవరికి వారు వ్యక్తిగతంగా ఇంట్లోనే ఉండాలని కోరారు.

వైరస్ గురించి తెలియని వారికి అవగాహన కలిగించి, గ్రామీణ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి బయటకు రాకుండా చూడడంలో యువత కీలక పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు.

ముఖ్యంగా ఇటలీ నుంచి వచ్చిన యువకుడు నెల్లూరు జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదైనా...ఆస్పత్రిలో చికిత్స తీసుకుని నెగటివ్ గా డిశ్చార్జ్ అవడం మంచి పరిణామమని మంత్రి అన్నారు. తొలి కేసు వచ్చిన వెంటనే అప్రమత్తమై ఎక్కడికక్కడ యంత్రాంగంతో కరోనా నివారణకు చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్ ఎం.వీ శేషగిరి బాబు, జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అభినందనలు తెలిపారు.

ఇదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని మంత్రి మేకపాటి విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ పట్ల అశ్రద్ధగా ఉంటే వస్తుందని, శ్రద్ధ తీసుకుంటే పారిపోతుందని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఇంటర్ నెట్ సేవలు, టెలికం సేవలలో ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు.

పరిశ్రమల శాఖలో కీలకమైన ఫార్మా, ఆహార పదార్థాల యూనిట్లు మాత్రమే ప్రస్తుతం నడిచే విధంగా తగు మార్గదర్శకాలు విడుదల చేశామని మంత్రి స్పష్టం చేశారు. ఫ్యాక్టరీలు, ఫార్మాసుటికల్స్ లో పని చేసేవారు కూడా పరిశుభ్రత చర్యలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. లాక్ డౌన్ సమయంలోనూ ఉద్యోగులు, కార్మికులకు వేతనమందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు.

తప్పని పరిస్థితులలో పని చేస్తున్న కార్మికులు యూనిట్లలో తగిన దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడం, వారికి చికిత్సను అందించడంలో నిస్వార్థంగా సేవ చేస్తున్న వాలంటీర్లు నిజమైన హీరోలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ నివారణకు ఇంకా మందు రాలేదని, ఇంట్లో ఉండి, శుభ్రత పాటించి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తే కరోనాను నివారించినట్లేనన్నారు.

ప్రజలు వ్యక్తిగత బాధ్యత తీసుకోకపోవడం వల్ల మనకోసం తమ జీవితాలను పణంగా పెట్టి పని చేస్తున్న వారి ప్రాణాలను ప్రమాదంలో పెట్టినవారిగా మిగిలిపోతామని, అది ఎవరికీ మంచిది కాదని మంత్రి వ్యాఖ్యానించారు. కర్ఫ్యూ, లాక్ డౌన్ సమయాలలో సకల సౌకర్యాలు కల్పించడం కష్టమని, పరిస్థితులకు తగినట్లుగా అత్యవసరాలతో సర్దుకుపోవాలని మంత్రి తెలిపారు. ప్రజలకు సేవ చేయడంలో భాగస్వామ్యమవుతున్న పార్టీ కార్యకర్తలు సహా, అధికార యంత్రాంగం కూడా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
 
లాక్‌డౌన్‌ పాటించి.. కరోనాను ఎదుర్కొందాం: మంత్రి పేర్ని నాని
కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రతి పౌరుడు వారియర్‌గా పోరాడాలని మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ  కరోనా నేపథ్యంలో టెన్త్ పరీక్షలు వాయిదా వేశామని పేర్కొన్నారు. గుంటూరు మిర్చి యార్డ్‌ను తాత్కాలికంగా మూసివేశామని చెప్పారు.

ఎంసెట్, ఈసెట్ దరఖాస్తులకు ఆన్‌లైన్‌లో గడువు పెంచామన్నారు. ఈసెట్‌కు ఏప్రిల్ 9 వరకు ఆన్‌లైన్‌లో గడువు పెంచామని పేర్కొన్నారు.  కరోనా వైరస్‌ పై అవగాహన కోసం రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. సామాజిక దూరం ద్వారా కరోనాను నియంత్రించవచ్చన్నారు.

లాక్‌డౌన్‌ను పాటించి కరోనాను ఎదుర్కొందామని తెలిపారు. సోషల్‌ మీడియాలో కరోనాపై  వదంతులను నమ్మొద్దని ఆయన సూచించారు. తప్పడు ప్రచారాలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత కూడా అవసరమని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.