మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2019 (18:43 IST)

పెదనాన్నఇంట్లోనే చోరీ

వ్యసనాలకు బానిసగా మారిన ఓ యువకుడు సొంత పెదనాన్న ఇంట్లోనే చోరీకి పాల్పడిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...
 
ఈ మధ్య కాలంలో నగరంలో జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేక దృష్టిసారించిన నగర పోలీస్ కమీషనర్ సి.హెచ్. ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు అడ్మిన్ డిసిపి మరియు క్రైమ్ ఇన్ ఛార్జ్ డి.కోటేశ్వరరావు పర్యవేక్షణలో సీసీఎస్ ఏసిపి కె.శ్రీనివాసరావు దొంగతనాల నియంత్రణ నిమిత్తం పోలీసు గస్తీని ముమ్మరం చేయడంతో పాటు పాత నేరస్తులు, జైలు నుండి విడుదలైన నేరస్థులు మరియు అనుమానాస్పద వ్యక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.

అలాగే ఈ మధ్య కాలంలో వినూత్నంగా ప్రవేశపెట్టిన చేరువ వాహనాల ద్వారా ప్రజలకు వివిధ నేరాల గురించి అవగాహన కలిగించి వారిని అప్రమత్తం చేయడం జరుగుతుంది.

ఈ నేపథ్యంలో 07.09.2019న సిసిఎస్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఒన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాళేశ్వరరావు మార్కెట్ వద్ద అనుమానంగా తిరుగుతున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది.

విచారణలో ఐదుగురు నిందితులు కలసి 30.08.2019న మధ్యాహ్నం సమయంలో ఒన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివాలయం వీధిలో ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడి కావడంతో ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 16 లక్షల విలువైన 477 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
 
ఈ కేసులో ఫిర్యాది అయిన మగన్లాల్కు ప్రధాన నిందితుడు అయిన వర్షల్ జైన్ స్వయానా సోదరుడి కుమారుడు కాగా ఇద్దరివి ప్రక్క ప్రక్క ఇళ్ళు. చెడు వ్యసనాలకు, సహవాసాలకు అలవాటుపడిన వర్షల్ జైన్ తేలిగ్గా డబ్బు సంపాదించి విలాసవంతంగా జీవించాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో ఫైనాన్స్ వ్యాపారం నిర్వహించే తన పెదనాన్న మగన్ లాల్ వద్ద పెద్ద మొత్తంలో నగదు మరియు నగలు ఉంటాయని తెలిసిన వర్షల్ అతని ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుడైన నూరిద్దిన్ ను సంప్రదించి దొంగతనం విషయం గురించి తెలియజేయగా ఇందుకు నూరిద్దిన్ అంగీకరించడం జరిగింది.

ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడైన వరిల్ జైన్ 30.08.2019న మధ్యాహ్నం సమయంలో తన పెదనాన్న అయిన మగన్లాల్ కుటుంబ సభ్యులతో కలసి గుడికి వెళ్ళి, తిరిగి ఇంటికి వచ్చిన వరిల్ జైన్ తన స్నేహితుడు నూరిద్దిన్తో కలసి ముందుగా రచించిన పధకం ప్రకారం ఇంటి తలుపులు పగులగొట్టి బంగారు నగలు (సుమారు 1/2 కేజీ) దొంగిలించడం జరిగింది.

అనంతరం దొంగిలించిన బంగారాన్ని అమ్మి సొమ్ము చేసుకుందామనే దురుద్దేశంతో సిద్దిక్, జానీబాష మరియు దేవాసిన్ల వద్ద దాచిపెట్టడం జరిగింది. దొంగతనానికి సంబంధించి బాధితుడు మగన్ లాల్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన ఒన్టౌన్ పోలీసులు తదుపరి దర్యాప్తులో భాగంగా ఈ కేసును సీసీఎసకు బదిలీ చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసిన సీసీఎస్ పోలీసులు దొంగతనానికి పాల్పడిన ఐదుగురు నిందితులను గుర్తించి 07.09.2019న అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి సుమారు రూ. 16 లక్షల విలువైన సుమారు 1/2 కేజీ బంగారు అభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. 
ఈ కేసు దర్యాప్తులో చురుగ్గా వ్యవహరించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి, విధి నిర్వహణలో ప్రతిభ చూపిన సీసీఎస్ ఏసిపి కె.శ్రీనివాసరావు, ఇన్ స్పెక్టర్లు కృష్ణంరాజు, పి.వెంకటేశ్వర్లు, రామ్ కుమార్, చలపతిరావు, ఎస్.ఐ.లు, నాగశ్రీనివాస్, కృష్ణారావు, కిషోర్, తిరుపతిరావు మరియు సీసీఎస్ సిబ్బందిని పోలీస్ కమీషనర్ అభినందించడం జరిగింది.