గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 29 జులై 2020 (15:08 IST)

ఏపీలో కొత్తగా 38 ఎల్పిజి దహన వాటికలు: మంత్రి బొత్స

ఏపీ వ్యాప్తంగా 35 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.51.48 కోట్ల అంచనా వ్యయంతో కొత్తగా 38 దహన వాటికలను నిర్మిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి కనీసం ఒకటి చొప్పున ఉండేలా చేపట్టిన ఈ పనులకు సంబంధించిన టెండరింగ్ ప్రక్రియను పూర్తి చేసి, వచ్చే నవంబరు నెలాఖరు కల్లా అందుబాటులోకి తేనున్నట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 
 
పట్టణ ప్రాంతాల్లో మరణించిన వారి అంతిమ సంస్కారాల నిర్వహణకు సరైన సదుపాయాలు లేని వైనం, కోవిడ్ పరిస్థితులు, సంప్రదాయబద్ధంగా కర్రలను ఉపయోగిస్తున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మరణించిన వారి అంత్యక్రియల నిర్వహణకు పర్యావరణ హితమైన ఏర్పాట్లు ఉండేలా చూడాలన్న ముఖ్యమంత్రి వైయఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

పర్యావరణ హితంగా, ఎల్పీజి తో నిర్వహించేలా దహన వాటికల నిర్మాణం, శ్మశానాల్లో మౌలిక వసతుల కల్పన వంటివి ఈ పనుల్లో భాగంగా చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. రూ.51.48 కోట్లలో 37 దహనవాటికల ఏర్పాటుకు రూ.15.92 కోట్లు, 35 శ్మశానాల్లో వసతుల కల్పనకు రూ.35.56కోట్లను ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో కొన్ని చోట్ల అంతిమ సంస్కారాల నిర్వహణలో  దురదృష్టకరమైన  కొన్ని అమానవీయ సంఘటనలు చోటుచోసుకున్న సంగతిని మంత్రి ప్రస్తావించారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి, పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశలో ప్రభుత్వం దహన వాటికల నిర్మాణం, శ్మశానాల్లో వసతుల కల్పన పనులను చేపట్టిందని ఆయన అన్నారు.

కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా అమలులో ఉన్న ఆంక్షలను (మినిమమ్ కాంటాక్ట్) దృష్టిలో ఉంచుకుని, అంత్యక్రియలనేవి గౌరవప్రదమైన రీతిలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుటున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఆయా శ్మశాన వాటికల్లో గ్యాస్ లేదా ఎలక్ట్రిక్ ఆధారిత చిమ్ని, కార్యాలయ భవనం, సంప్రదాయబద్దంగా కార్యక్రమాల నిర్వహణకు అనువైన హాల్ , టాయిలెట్లు, నీటి సరఫరా , డ్రైనేజి లేన్ నిర్మాణం తోపాటు ఇతరత్రా ల్యాండ్ స్కేపింగ్ పనులు, ప్రహారీ నిర్మాణం వంటి పనులను ఈ నిధులతో చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. నిర్వహణ వ్యయాన్ని తగ్గించడంతోపాటు, పర్యావరణ హితంగా ఉండేలా ఎల్ పిజి ద్వారా దహనవాటికలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 
 
హిందూపుర్, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో 3 చొప్పున దహన వాటికలు, నర్సాపురం, మచిలీపట్నం, గుంటూరు, నర్సరావుపేట, ఒంగోలు, కడప, కర్నూలు, విశాఖ పార్లమెంటు నియోజకవర్గాల్లో 2 చొప్పున, మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున వీటిని ఏర్పాటు చేయనున్నారు. నవంబరు నెలాఖరు నాటికల్లా ఈ పనులన్నీ పూర్తి అయ్యేలా చూడాలని ప్రజా ఆరోగ్య శాఖ ఇంజనీరింగ్ చీఫ్ కు మంత్రి  ఆదేశాలిచ్చారు.