గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (19:46 IST)

తిరుమల రోడ్లపై యధేచ్చగా సంచరిస్తున్న మృగాలు - ఎంపీ నత్వానీ ప్రశంసలు

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా దేశంలో లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని కూడా భక్తులకు నిలిపివేసింది. పైగా, తిరుమల ఘాట్ రోడ్లలో వాహనాలను కూడా అనుమతించడం లేదు. దీంతో దాంతో అక్కడి వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. 
 
ముఖ్యంగా, జనసంచారం లేకపోవడంతో శేషాచల అడవుల నుంచి వస్తున్న వన్యమృగాలు తిరుమల వీధుల్లో దర్శనమిస్తున్నాయి. తాజాగా, తిరుమల రహదారిపై రెండు ఎలుగుబంట్లు కనిపించాయి. అవి రోడ్డు దాటుతుండగా వీడియో తీశారు. 
 
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ఆ వీడియోను షేర్ చేశారు. ఇటీవలే కొన్ని చిరుతలు కూడా తిరుమలలోని నారాయణగిరి గెస్ట్ హౌస్ వద్ద కనిపించిన విషయంతెల్సిందే. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారికి నిత్య కైంకర్యాలు తప్ప మరేమీ జరగడంలేదు. 
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానీ రాష్ట్రానికి సంబంధించిన ఓ అంశంపై స్పందించారు. చిత్తూరు జిల్లాలో ఓ ఏనుగు పెద్ద గోతిలో పడిపోగా, చిత్తూరు జిల్లా అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమించి దాన్ని కాపాడారు. దీనిపై పరిమళ్ నత్వానీ ట్విట్టరులో స్పందించారు. 
 
'అటవీశాఖ అధికారులు గోతిలో పడిపోయిన ఏనుగును అతి కష్టమ్మీద బయటికి తీశారు. జంతువుల ప్రాణాలకు సైతం వారు విలువ ఇచ్చిన తీరును అభినందిస్తున్నాను. ప్రతి జంతువు ప్రాణం ఎంతో ముఖ్యమని భావించి కాపాడేందుకు ప్రయత్నించిన వైనం ప్రశంసనీయం' అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.