సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (09:47 IST)

అదుపులోకిరాని కరోనా... శ్రీవారి దర్శనం ఇప్పట్లే లేనట్టే...

దేశంలో కరోనా వైరస్ అదుపులోకిరావడం లేదు. పైగా, మరింతగా విజృంభిస్తోంది. దీనికి నిదర్శనమే.. శనివారం ఒక్కరోజు ఏకంగా వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం. దీంతో ఈ నెల 14వ తేదీతో ముగియనున్న లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడగించాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సూచన మేరకు కేంద్రం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. 
 
ఇదిలావుంటే, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం కేవలం వేదపండితులు మాత్రమే శ్రీవారికి రోజువారీ కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. అయితే, కరోనా వైరస్ అదుపులోకి రాకపోవడంతో తిరుమలలోనూ దర్శనాల నిలిపివేతను కొనసాగించాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.
 
ఈ మేరకు తితిదే అధికారులు నేడో, రేపో అధికారిక ప్రకటనను విడుదల చేసే అవకాశం ఉంది. గత నెలలో లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత, తిరుమలలో భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు, ఆపై దాన్ని ఏప్రిల్ 14 వరకూ పొడిగించారు. 
 
ఇప్పుడు లాక్‌డౌన్ మరోమారు పొడిగించక తప్పదన్న అంచనాల నేపథ్యంలో, భక్తులకు దర్శనం రద్దు నిర్ణయాన్ని కొనసాగించనున్నట్టు సమాచారం. నెలాఖరు వరకూ దర్శనాలు నిలిపివేసి, ఆపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.