బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 1 ఆగస్టు 2020 (20:05 IST)

కరోనావైరస్ భయంతో తిరుమల కొండ ఖాళీ, భయం వద్దని చెప్పినా భక్తులు రావడం లేదంటే?

కరోనావైరస్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రాణం మీద ప్రతి ఒక్కరికి తీపి మొదలైంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే పుణ్యక్షేత్రాలను కూడా కొన్నిరోజుల పాటు మూసివేశారు. తిరుమల లాంటి ప్రధాన క్షేత్రాల్లో అయితే ఏకాంతంగా కైంకర్యాలను నిర్వహించి ఆలయాన్ని మాత్రం అలాగే తెరిచి ఉంచారు. భక్తులను మాత్రం అనుమతించలేదు.
 
కానీ జూలై 10వ తేదీన తిరిగి టిటిడి ఉద్యోగస్తులను దర్శనానికి అనుమతించే ప్రక్రియను ప్రారంభించారు. మొదట్లో పరిమిత సంఖ్యలో టిక్కెట్లను ఇస్తూ వచ్చారు. టోకెన్లను పొందిన వారు మాత్రమే దర్సనానికి వస్తున్నారు. ఆన్లైన్ 3వేల టిక్కెట్లు, ఆఫ్‌లైన్‌లో మరో 3వేల టోకెన్లను ఇచ్చారు. ఆ తరువాత టోకెన్ల సంఖ్యను పెంచారు.
 
ప్రస్తుతం ఆన్లైన్ లోనే 12వేల టోకెన్లను అందిస్తున్నారు. అయితే టోకెన్లను బుక్ చేసుకున్న భక్తులు మాత్రం తిరుమలకు రావడం లేదు. సరిగ్గా 15 రోజుల ముందువరకు భక్తులు టోకెన్లు బుక్ చేసుకున్నా కేవలం సగంమంది మాత్రమే దర్సనానికి వచ్చారు. ఆ తరువాత ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది.
ప్రస్తుతం ఆ సగం మంది సంఖ్య కూడా తగ్గిపోయింది. టోకెన్లు బుక్ చేసుకున్న భక్తులు అస్సలు తిరుమలకు రావడం లేదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది భక్తుల్లో. సాక్షాత్తు టిటిడి ఛైర్మన్ భక్తులు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. కరోనా సోకిన టిటిడి ఉద్యోగస్తులు, అర్చకులు కోలుకుని వచ్చేస్తున్నారని చెప్పారు. 
 
అయినాసరే భక్తుల్లో నమ్మకం కలగడం లేదు. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం... దాంతో పాటు మరణాలు అదే స్థాయిలో ఉండటంతో భక్తుల్లో భయం మాత్రం పోవడం లేదు. దీంతో టోకెన్లు తీసుకున్నా భక్తులు మాత్రం దర్సనానికి రావడం లేదని టిటిడి అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భక్తుల సంఖ్యను పెంచే ఆలోచనలో టిటిడి అస్సలు లేదని ఉన్నతాధికారులు కూడా స్పష్టం చేసేశారు.