తిరుపతి ఉప ఎన్నిక రద్దు చేయాలి: చంద్రబాబు నాయుడు
తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసారు. పోలీసులు, ఎన్నికల అధికారులు, వాలంటీర్లు అంతా కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారనీ, ఎన్నికలను ఓ ప్రహసనంగా మార్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
తిరుపతిలో స్థానికేతురులు దొంగ ఓట్లు వేసేందుకు వస్తుంటే వారిని తెదేపా శ్రేణులు అడ్డుకుంటే, అడ్డుకున్నవారిని పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధి దాటి వేల మంది బయట నుంచి వచ్చారని అన్నారు.
ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వచ్చేవారిని పర్యాటకులు అంటూ వారిని వదిలేశారన్నారు. పోలీసులు, అధికారులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారు. వైసిపి అక్రమాలను ఈసీకి ఆధారాలతో సహా సమర్పిస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఇన్ని అక్రమాల మధ్య జరిగిన ఉప ఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల మధ్య నిర్వహించాలంటూ డిమాండ్ చేసారు.