గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (19:54 IST)

తిరుపతి లోక్‌సభ ఉప పోరుకు సర్వం సిద్ధం

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం చేశారు. కోవిడ్ నియమ నిబంధనలను అనుసరిస్తూ ఈ నెల 17వ తేదీన తిరుపతి (ఎస్.సి) పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సర్వం సిద్దం చేశారు. ఈ పోటీలో 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. 
 
ఈ నెల 17న తిరుపతి (ఎస్.సి) పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు ప్రశాంత వాతావరణంలో పటిష్ట బందోబస్తు నడుమ నిర్వహించేందుకు అన్నిచర్యలు చేపట్టామని తెలిపారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలలో 1056 పోలింగ్ స్టేషన్‌లలో శనివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. 
 
తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి 382 పోలింగ్ స్టేషన్లకు పరిధిలో పోలింగ్ జరగనుండగా 1,40,396 మంది పురుషులు, 1,41,898 మంది మహిళలు, ఇతరులు 48 మంది ఓటర్లు ఉన్నారు. 
 
అలాగే, శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి 362 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరగనుండగా 1,20,062 మంది పురుషులు, 1,27,474 మంది మహిళలు, ఇతరులు 25 మంది ఓటర్లు ఉన్నారు. 
 
సత్యవేడు (ఎస్.సి) నియోజకవర్గానికి సంబంధించి 312 పోలింగ్ స్టేషన్‌లలో పోలింగ్ జరగనుండగా 1,02,879 మంది పురుషులు, 1,07,809 మంది మహిళలు, ఇతరులు 16 మంది ఓటర్లు ఉన్నారు. 
 
ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి 7,40,607 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. ఎన్నికల నిర్వహణకు గాను 5054 మంది పోలింగ్ సిబ్బందిని నియామకం చేసినట్లు ఇందులో పి.ఓలు 1266 మంది ఏ.పి.ఓలు 1266 మంది ఓ.పి.ఓలు 2522 మంది, మైక్రో అబ్జర్వర్లు 451 మంది, సెక్టోరల్ ఆఫీసర్లు 111 మంది, రూట్ ఆఫీసర్లు 111 మందిని నియమించారు. 
 
377 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించగా అందులో తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి 83, శ్రీకాళహస్తికి సంబంధించి 136, సత్యవేడుకు సంబంధించి 158 ఉన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు 2,913 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఇందులో 10 మంది అదనపు ఎస్.పి లు, 27 మంది డి.ఎస్.పి లు, 66 మంది సి.ఐ లు 169 మంది ఎస్.ఐ లు,697 మంది ఏ.ఎస్.ఐ‌లు, హెడ్ కానిస్టేబుళ్లు, 1519 మంది పి.సీలు 234 మంది ఎస్.టి.ఎఫ్ సిబ్బంది 191 మంది హోమ్ గార్డ్‌లు, 716 మంది సి.ఐ.ఎస్.ఎఫ్ అధికారులు, 105 మంది రూట్ మొబైల్స్, 27 క్వూ ఆర్ టీమ్స్, 13 సైక్లింగ్ ఫోర్స్, 8 ఎస్.ఎస్.టి టీమ్స్, 8 ఫ్లయింగ్ స్క్వాడ్, 8 ఎం.సి.సి బృందాలు, 19 ఇంటర్వెన్షన్, మహిళా ఇంటర్వెన్షన్ టీమ్స్ ఏర్పాటు చేయడమైనదని తెలిపారు.