తిరుపతి బస్తీమే సవాల్.. తెదేపా గెలిస్తే వైకాపా ఎంపీలంతా రాజీనామా : పెద్దిరెడ్డి ఓపెన్ ఛాలెంజ్
తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నిక త్వరలో జరుగనుంది. ఈ ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే, ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే తమ పార్టీకి చెందిన ఎంపీలంతా రాజీనామా చేస్తారంటూ ఏపీ మంత్రి, వైకాపా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బహిరంగ సవాల్ విసిరారు.
పైగా, ప్రజాహిత కార్యక్రమాలే వైకాపాకు బలమని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నామన్న ఆయన .. తెలుగుదేశం గెలిస్తే తమ ఎంపీలంతా రాజీనామాకు సిద్ధమన్నారు. వైకాపా అభ్యర్థి గెలిస్తే తెలుగుదేశం ఎంపీలు ముగ్గురు, వారి వద్ద ఉన్న రఘురామకృష్ణరాజు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.
వైకాపా అభ్యర్థి గురుమూర్తికి మద్దతుగా ఆదివారం ఉదయం వైకాపా నేతలతో కలిసి తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. భాజపా, జనసేన, తెదేపా మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు.
పాచిపోయిన లడ్డూ ఇప్పుడు పవన్‌కు తాజా లడ్డూ అయ్యిందా? అని ప్రశ్నించారు. భాజపా రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించారు. సునీల్ దియోధర్ ఎలాంటి వ్యక్తో మేఘాలయ ప్రజలకు తెలుసని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా తీవ్రత దృష్ట్యానే సీఎం సభ రద్దు చేసుకున్నారని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.