రేపు 'నేతన్న నేస్తం' పథకం ప్రారంభం
చేనేత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న నేత కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోన్న ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ రెండో విడత కార్యక్రమాన్ని రేపు(శనివారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు రూ.24 వేలు నగదు పంపిణీ చేయనున్నారు. శనివారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ చేయనున్నారు అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడనున్నారు.
మొత్తం 81024 మంది చేనేతలకు లబ్ధి చేకూరనుంది. కోవిడ్ కారణంగా 6 నెలలు ముందుగానే ప్రభుత్వం సాయం అందించనుంది.
194.46 కోట్లు పంపిణీ : ఈ పథకం కింద మొత్తం 194.46 కోట్లు పంపిణీ జరగనుంది. గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లు చెల్లింపుతో పాటు, కోవిడ్ మాస్క్‌లు తయారు చేసిన ఆప్కోకు రూ.109 కోట్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లించనుంది.
దశాబ్దాలుగా చేనేతలు అనుభవిస్తున్న కష్టాలను పాదయాత్రలో వైఎస్ జగన్ గమనించి, ఆనాడే చేనేతలకు భరోసా ఇచ్చారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం చేస్తానని పాదయాత్రలో ఇచ్చిన మాటను వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు.
డిసెంబరు 21, 2019న వైఎస్సార్ నేతన్ననేస్తం పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఆరు నెలల వ్యవధిలోనే మళ్లీ రెండో విడత సాయం చేసేందుకు సర్వం సిద్ధం చేశారు.