సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 24 ఏప్రియల్ 2019 (20:16 IST)

బైకులపై రయ్.. రయ్: అదీ వరస.. అలా దండించండి... హిమాన్షు శుక్లా శభాష్

ర‌హ‌దారి భ‌ద్ర‌త‌కు సంబంధించి వారంతా త‌ప్పులు చేసారు. కానీ ఇప్ప‌డు వారే అలా చేయ‌టం స‌రికాదంటూ రోడ్డెక్కారు. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా... గుంటూరు జిల్లా సంయిక్త క‌లెక్ట‌ర్, జిల్లా అద‌న‌పు న్యాయమూర్తి హిమాన్హు శుక్లా స‌మాజ హితం కాంక్షిస్తూ చేప‌ట్టిన చ‌ర్య‌ల ఫ‌లితమే ఈ మార్పు. ప్ర‌త్యేకించి ర‌హ‌దారి భ‌ద్ర‌తకు పెద్ద‌పీట వేస్తున్న శుక్లా నియ‌మాల ఉల్లంఘ‌నులపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించారు. వారిలో మార్పును ఆకాంక్షిస్తూ స‌రికొత్త వ‌ర‌వ‌డికి శ్రీ‌కారం చుట్ట‌గా దాని కొన‌సాగింపుగానే తాజా కార్య‌క్ర‌మానికి గుంటూరు ప‌ట్ట‌ణం వేదికైంది.  
 
మునుపెన్న‌డూ లేనివిధంగా బ‌హుశా రాష్ట్రంలోనే తొలిసారిగా జెసి సామాజిక సేవ‌ను దండన రూపంలో విధిస్తున్నారు. అది ఏరూపంలోనైనా ఉండ‌వ‌చ్చంటున్నారు. భోజ‌న ప‌ధ‌కంలో వ‌డ్డ‌న, ఆసుప‌త్రుల‌లో సేవ‌కుడు,  ట్రాఫిక్ పోలీస్‌కు స‌హాయ‌కారి, ప్రార్ధ‌నా మందిరాల‌ను ప‌రిశుభ్రం చేయ‌టం, ర‌హ‌దారులను ప‌రిశుభ్రం చేయ‌టం, వ‌యోవృద్ధుల‌కు స‌హాయ‌కులుగా ఉండ‌టం, స్వ‌ఛ్చ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సేవ‌లు ఇలా ఏ దండ‌న అయినా కావ‌చ్చు. కాకుంటే అది సామాజిక సేవ‌తో ముడిప‌డి ఉండేలా శుక్లా చ‌ర్య‌లు చేప‌ట్టారు. 
 
ఈ నేప‌ధ్యంలోనే బుధ‌వారం సాయంత్రం 50 మంది ఉల్లంఘ‌నుల‌కు న‌గ‌రంలోని ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ట్రాఫిక్ నియంత్ర‌ణ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. వీరంద‌రినీ క‌లెక్ట‌రేట్ మొద‌లు గుంటూరు న‌గ‌రంలోని ప‌లు కూడ‌ళ్ల‌లో ట్రాఫిక్ విధులు నిర్వ‌హింప‌చేసారు. పోలీసుల స‌హ‌కారంతో ట్రాఫిక్ విధులు చేప‌ట్ట‌గా, స‌గ‌టు వాహ‌నచోద‌కులు దీనిని ఆస‌క్తిగా గ‌మ‌నించారు. ఫ‌లితంగా ఈ ప‌రిణామం ఇత‌ర వాహ‌న‌ చోద‌కుల‌కు ఒక సందేశంగా మార‌గా, వారిని సైతం ఆలోచింపచేసింది.
 
ప్ర‌త్యేకించి గుంటూరు జిల్లాలో 2018 క్యాలెండ‌ర్ సంవత్సరంలో 1992 ప్ర‌మాదాలు జ‌ర‌ుగ‌గా, ఈ సంఘ‌ట‌న‌ల‌లో 947 మంది మృత్యువాత ప‌డ్డారు. 2019 సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి నెల‌ల్లో 199 ప్ర‌మాదాలు జ‌ర‌గ‌గా, 72 మంది మ‌ర‌ణించారు. 192 మంది గాయ‌ప‌డ్డారు. 2018లో కేవ‌లం ట్రాఫిక్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌కు సంబంధించి 71,975 కేసులు న‌మోదయ్యాయి. రోడ్డు ప్ర‌మాదాల‌లో నిత్యం ప‌దుల సంఖ్య‌లలో మృత్యువాత ప‌డుతున్నారు. కొన్ని సంద‌ర్భాల‌లో ఎవ‌రికి వారే కార‌ణం కావ‌చ్చు. మ‌రికొన్ని సంద‌ర్భాల‌లో ఎవ‌రో చేసిన త‌ప్పుల‌కు ఇంకెవ్వ‌రో ప్రాణాలు కోల్పోతున్నారు. కేవ‌లం అతి వేగం, ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌టం వ‌ల్లే ఈ స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. 
 
జ‌రిమానా, డ్రైవింగ్ లైసెన్సు ర‌ద్దు వంటి క‌ఠిన నిర్ణ‌యాలు సైతం ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వలేక‌పోతున్నాయి. ఈ నేప‌ధ్యంలో త‌న న్యాయాధికారాల‌కు ప‌దును పెట్టిన శుక్లా ర‌హ‌దారి భ‌ధ్ర‌త నియ‌మాల‌ను ప‌క్క‌న పెట్టి ద్విచ‌క్ర వాహ‌నం న‌డుపుతూ సెల్‌ఫోన్ మాట్లాడుతున్న మంగ‌ళ‌గిరివాసి నాగ‌స‌తీష్‌కు గతంలోనే సామాజిక సేవ‌ను దండ‌న‌గా విధించారు. మూడురోజుల పాటు మ‌ధ్యాహ్న భోజ‌న ప‌ధ‌కం అమ‌లులో స‌హాయ‌కారిగా ఉండాల‌ని ఆదేశించి, అమ‌లు చేయించారు. 
 
ఈ నేప‌ధ్యంలో హిమాన్షు శుక్లా మాట్లాడుతూ ఇటీవ‌లి కాలంలో మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహ‌నాల‌ను న‌డ‌ప‌టం పెరిగింద‌ని, అది వారితో పాటు రోడ్డుపై వెళుతున్న ఇత‌ర చోద‌కుల‌కు కూడా న‌ష్టం తెస్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. కేవ‌లం నేటి యువ‌త‌లో మార్పు కోస‌మే ఈ త‌ర‌హా విధానాన్ని ఎంచుకున్నామ‌ని, సామాజిక స‌మ‌స్య‌గా ప‌రిణ‌మిస్తున్న ర‌హ‌దారి నియ‌మాల ఉల్లంఘ‌న‌కు సామాజిక సేవే చేయడం అనే శిక్ష ద్వారానే మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు వారు చెప్పారు.