సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 నవంబరు 2021 (14:20 IST)

అధికారంలో ఉన్నవారికంటే అధికారంలో కూర్చూబెట్టిన ప్రజలే శక్తిమంతులు : కేటీఆర్

వివాదాస్పద మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అన్ని విపక్ష పార్టీల నేతలు స్వాగతిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాంధీ, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వంటివారు కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఓ ట్వీట్ చేశారు.
 
అధికారంలో ఉన్నవారి కంటే అధికారంలో కూర్చోబెట్టిన ప్రజల శక్తి మరింత శక్తిమంతమైనది అంటూ ట్వీట్ చేశారు. అలుపులేని పోరాటంతో తమకు కావాల్సిన దానిని సాధించుకుని, భారత రైతులంటే ఏంటో నిరూపించారని వ్యాఖ్యానించారు. జై కిసాన్ - జై జవాన్ అంటూ కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
అలాగే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా స్పందించారు. రైతులు సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలను గుర్తించాలని ఆయన కోరారు. రైతులు ఏమాత్రం వెనకంచ వేయకుండా, పట్టువదలకుండా పోరాటం చేసి కేంద్రం మెడలు వంచి ఒక చరిత్ర సృష్టించారని సీఎం స్టాలిన్ అన్నారు.