శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 నవంబరు 2021 (09:35 IST)

రోజుకు రూ.50 వేలు చెల్లించాల్సిందే.. జగన్ తరపు న్యాయవాదులకు కోర్టు హెచ్చరిక

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు గట్టి హెచ్చరిక చేసింది. పెండింగ్ కేసుల విచారణ సందర్భంగా వాయిదా కోరిని పక్షంలో రోజుకు రూ.50 వేల చొప్పున చెల్లించాల్సిందేనంటూ హెచ్చరిక చేసింది. జగన్ అక్రమాస్తులు కేసులు అనేకం ఉన్నాయి. ఇవి విచారణకు వచ్చినపుడు జగన్ తరపు న్యాయవాదులు చీటికి మాటికి వాయిదాలు కోరుతూ కాలయాపన చేస్తున్నారు. దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై తప్పనిసరిగా వాదనలు వినిపించాల్సిందేనని లేకుంటే రోజుకు రూ.50 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 
 
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు.. ఇతర పిటిషన్లపై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇందులోభాగంగా దాల్మియా సిమెంట్స్‌కు చెందిన పునీత్ దాల్మియా దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు గడువు కావాలని ఆయన తరపు న్యాయవాదులు కోరారు. 
 
అలాగే జగన్ హాజరు మినహాయింపునకు సంబంధించిన పిటిషన్‌లో వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హాజరుకావాల్సి వుందని, అందువల్ల ఈ కేసు విచారణను ఒక రోజు వాయిదా వేయాలని కోరగా, హైకోర్టు పై విధంగా కీలక వ్యాఖ్యలు చేసింది.