ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 23 జూన్ 2019 (15:48 IST)

తితిదే కొత్త ఛైర్మన్ తులాభారానికి హెరిటేజ్ నెయ్యి.. నెటిజన్స్ కామెంట్స్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి కొత్త ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఆయన శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకోసం ముందుగా ఆయన తలనీలాలు సమర్పించి, ఆ తర్వాత శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. పిమ్మట కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆయన నెయ్యితో తులాభారం నిర్వహించారు. ఈ తులాభారానికి ఉపయోగించిన నెయ్యి హెరిటేజ్ సంస్థ తయారు చేసింది. ఇక్కడే వైకాపా నేతలు చిక్కుల్లో పడ్డారు. 
 
నిజానికి ఈ హెరిటేజ్ సంస్థ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందినది. పైగా, ఈ హెరిటేజ్ సంస్థపై వైకాపా నేతలు అనేక సంచలన ఆరోపణలు చేశారు.. చేస్తున్నారు కూడా. అలాంటిది ఆ సంస్థకు చెందిన నెయ్యిని టీటీడీ ఛైర్మన్‌గా ఎన్నికైన వైసీపీ నేతల వైవీ సుబ్బారెడ్డి తులాభారంలో ఉపయోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
సుబ్బారెడ్డి శనివారం కాలిన నడకన తిరుమల చేరుకుని వేంకటేశుని దర్శించుకున్నారు. అనంతరం గరుడ ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. తులాభారం ఫొటోను ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.  
 
ఈ సందర్భంగా శ్రీవారి సన్నిధిలో ఉన్న వైవీ సుబ్బారెడ్డికి తులాభారం వేశారు. అయితే, తులాభారం కోసం త్రాసులోని మరోవైపు హెరిటేజ్ నెయ్యిని వాడారు. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హెరిటేజ్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసినవారు ఇప్పుడు అదే సంస్థ నెయ్యి వాడడం ఏమిటని వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తుండగా, హెరిటేజ్ అనుసరిస్తున్న నాణ్యతా విధానాల వల్లే టీటీడీ ఇంకా దానిని వినియోగిస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు.