శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2022 (15:17 IST)

తితిదే ఈవో ధర్మారెడ్డికి ఊరట.. జైలుశిక్షపై తాత్కాలిక స్టే

dharma reddy
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి విధించిన నెల రోజుల జైలు శిక్షనపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. 
 
తితిదే ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో తితిదే ఈవోకు నెల రోజుల జైలు, రూ.2 వేల అపరాధం విధిస్తూ సింగిల్ జడ్జి ఇటీవల తీర్పునిచ్చారు. దీనిపై ఈవో ధర్మారెడ్డి హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది. 
 
కాగా, గతంలో ముగ్గురు తితిదే ఉద్యోగులు తమను క్రమబద్దీకరించేలా తితిదే ఈవోను ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించి సింగిల్ జడ్జి ధర్మాసనం ఉద్యోగులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. వారిని క్రమబద్దీకరించాలని తితిదే ఈవోకు ఆదేశాలు జారీ చేసింది. కానీ తితిదే ఈవో అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద ఈవోకు నెల రోజుల జైలుశిక్ష విధించింది.