శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2019 (17:26 IST)

జగన్ సర్కారు ఆయుష్షు తొమ్మిది నెలలేనా? ఉండవల్లి వ్యాఖ్యలు దేనికి సంకేతం..?

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి సర్కారును ఉండవల్లి హెచ్చరించారు. జగన్ రెడ్డి సర్కారు ఆయుష్షు తొమ్మిది నెలలేనని ఆయన చెప్పారు. అంతేగాకుండా ఎమ్మెల్యేలను సంతృప్తిపరచకపోతే అందరూ ఎదురుతిరిగే ప్రమాదం వుందని తీవ్రంగా హెచ్చరించారు. 
 
ఉండవల్లి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 1972లో పివి నరసింహారావు ముఖ్యమంత్రి అయిన తొమ్మిది నెలలకే అందరూ కలిసి దింపేశారని గుర్తుచేశారు. అలాగే 1994లో మంచి మెజారిటితో గెలిచిన ఎన్టీఆర్‌ను కూడా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి దింపేశారన్నారు. ఎన్టీఆర్‌పై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేస్తారని ఎవరైనా అనుకున్నారా? అంటూ ప్రశ్నించారు. 
 
నరసింహారావును, ఎన్టీఆర్‌ను దించేసిన ఘటనలు ఎమ్మెల్యేలలో అసంతృప్తి వచ్చే జరిగిందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. తాజాగా 151 ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చిన జగన్ పరిస్ధితి అలా కాకూడదనే ముందుగా హెచ్చరిస్తున్నట్లు ఉండవల్లి చెప్పటం పార్టీలో తీవ్ర చర్చగా మారింది. వైసీపీని అధికారంలోకి తేవటంలో ప్రధానంగా నవరత్నాలే కారణమన్నారు.
 
తర్వాతే చంద్రబాబు అవినీతి ఇతరత్రా అంశాలని స్పష్టం చేశారు. నవరత్నాలు అమలు చేయకపోతే.. జనాలు తిరగబడతారని.. ప్రాధాన్యత లేదంటూ.. ఎమ్మెల్యేలు కూడా తిరగబడతారని చెప్పారు. ఉండవల్లి వ్యాఖ్యల్లో కూడా కొంత నిజముందని.. ఎమ్మెల్యే అసంతృప్తికి గురైతే మాత్రం జగన్ సర్కారు కూలిపోయే ప్రమాదం వుందని రాజకీయ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.