సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (13:47 IST)

ఆంధ్రాలో సర్కారీ మద్యం దుకాణాలు... మూడు కొంటే ఒకటి ఫ్రీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సర్కారీ మద్యం దుకాణాలు రానున్నాయి. అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఈ దుకాణాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. దీంతో ప్రస్తుతం ప్రైవేటు మద్యం షాపుల్లో విక్రయాలు సోమవారం రాత్రి 10 గంటల వరకు మాత్రమే సాగనున్నాయి. దీంతో మద్యం వ్యాపారులు అందిన కాడికి మద్యాన్ని అమ్ముకునే యత్నాల్లో ఉన్నారు. డిస్కౌంట్స్ రేట్లకే మద్యం విక్రయాలు సాగించనున్నారు. ముఖ్యంగా, మూడు బాటిల్స్ మద్యం కొనుగోలు చేస్తే ఒక బాటిల్ మద్యాన్ని ఉచితంగా ఇవ్వనున్నారు. 
 
మరోవైపు, శని, ఆదివారాల్లో ప్రీమియం బ్రాండ్‌లపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించారు. నగరంలోని కుందులరోడ్డు కృష్ణానగర్‌లో ఉన్న లిక్కర్‌ మార్ట్‌లో ఈ తరహా డిస్కౌంట్లను ఇచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. దీంతో మద్యం ప్రియులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని మద్యాన్ని కొనుగోలు చేశారు.
 
ఈ నెల 30వ తేదీ రాత్రి 10 గంటలతో ప్రైవేటు మద్యం దుకాణాలు పూర్తిగా తొలగించేసి అక్టోబరు ఒకటో నుంచి జిల్లా వ్యాప్తంగా 282 మద్యం షాపులను ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించనున్నారు. దీంతో సోమవారం రాత్రి 10 దాటిన తర్వాత ప్రైవేటు మద్యం షాపుల్లో ఉన్న స్టాకును ఎక్సైజ్‌ శాఖకు అప్పగించాల్సి ఉంది. 
 
అయితే ఎక్సైజ్‌ శాఖ మద్యాన్ని తీసుకుంటుందే తప్ప ఆ మద్యానికి ధరకట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. దీంతో జిల్లా వ్యాప్తంగా అనేక మంది వ్యాపారులు ముందుగానే జాగ్రత్తపడ్డారు. గత 15 రోజులుగా కేవలం అమ్ముడుపోయే బ్రాండ్లు మినహా మిగతా ఇతర బ్రాండ్లను వారు కొనుగోలు చేయలేదు. 
 
అయితే గుంటూరులోని లిక్కర్‌ మార్ట్‌ను హై ప్రీమియం బ్రాండ్లను మాత్రమే అమ్మేందుకు పెట్టారు. ఈ ఒక్క షాపులోనే స్టాకు మరింతగా ఉండడంతో హై క్వాలిటీ మద్యానికి ఫుల్‌బాటిల్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు డిస్కౌంట్లు ఇస్తున్నట్లు తెలిసింది. 
 
జిల్లాలో అక్కడక్కడ మినహా చాలా దుకాణాల్లో హై ప్రీమియం బ్రాండ్లు లేవు. నగరంలోని జేకేసీ కాలేజీ రోడ్డులో ఉన్న ఓ బార్‌లో మూడు బాటిళ్ళు కొన్న వారికి ఒక బాటిల్‌ ఉచితంగా ఇస్తున్నట్లు సమాచారం.