మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (09:46 IST)

జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప.. కుప్పంలో బాబు ప్రచారానికి దిక్కు లేని పరిస్థితి: అంబటి రాంబాబు

"బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు పెట్టుకుని కుప్పంలో ప్రచారం చేసుకోవాల్సిన దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప.. కుప్పంలో బాబు ప్రచారానికి దిక్కు లేని పరిస్థితి. కుప్పంకు అన్యాయం చేశానని చంద్రబాబే అంగీకరించారు" అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు.
 
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
1. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు చూశాక, వైయస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులు గణనీయమైన సంఖ్యలో కనీవినీ ఎరుగని రీతిలో 80 శాతానికి పైగా గెలుపొందారు. అయితే చంద్రబాబు మేమే గెలిచామని టపాసులు కాల్చుకుని ప్రజల్ని గందరగోళం చేయాలని ప్రయత్నించారు. ఓడినా గెలిచామని చెప్పుకోవడం అన్నది చంద్రబాబు మేనేజ్ మెంటు థియరీలో భాగం. 
 
2. చంద్రబాబు చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాత అక్కడ నుంచి కుప్పం వెళ్ళి ఇప్పటికి ఏడు సార్లు గెలిచారు. కుప్పం నియోజకవర్గం ప్రజలు తెలుగుదేశం  పార్టీ స్థాపించాక ప్రతిసారి తెలుగుదేశం పార్టీనే గెలిపించి, ఆ పార్టీకి పెట్టని కోటగా మార్చారు. అలాంటి కుప్పం నియోజకవర్గంలో మొన్న పంచాయతీ ఎన్నికలు జరిగితే.. మొత్తం 89 గ్రామ పంచాయతీల్లో 74 వైయస్ఆర్సీపీ, టీడీపీ కేవలం 14 మాత్రమే గెలిచింది.

అయితే ఓటమిని జీర్ణించుకోలేని చంద్రబాబు.. కుప్పంలో  ప్రజాస్వామ్యం ఓడిపోయింది తప్ప మేము ఓడిపోలేదని మాట్లాడుతున్నారు. ఇలానే రాష్ట్రం అంతా చూసినా, ఆయా నియోజకవర్గాల్లో పట్టుమని పది పంచాయతీ సీట్లు కూడా టీడీపీ గెలిచిన పరిస్థితి లేదు. కొన్నిచోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. మరికొన్ని చోట్ల టీడీపీ అసలు ఖాతానే తెరవని పరిస్థితి వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు అసమర్థత కాదా..?
 
3. నామినేషన్ వేయటానికి కూడా కుప్పం రానటువంటి చంద్రబాబు, గతంలో ఎప్పుడూ కూడా మూడు, నాలుగు రోజులు కుప్పంలో గడపనటువంటి చంద్రబాబు.. ఈరోజు జగన్ మోహన్ రెడ్డిగారి దెబ్బకు కుప్పం బాట పట్టి, వీధి వీధి తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని ఈరోజు కుప్పం ప్రజలే అనుకుంటున్నారు. ఇది కేవలం జగన్ మోహన్ రెడ్డిగారి గొప్పతనం తప్ప చంద్రబాబు గొప్పతనం కాదు. 

- ఒకవైపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నా పట్టించుకోకుండా.. ఈరోజు కుప్పంలో చంద్రబాబు ఊరేగింపులు చేస్తున్నారు. బజారుబజారున మీటింగులు పెట్టి ఉపన్యాసాలు చెప్పినా జనం రావటం లేదు. 
- చిత్రమేమిటంటే.. కుప్పం పర్యటనలో బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు పెట్టుకుని ఫ్లెక్సీలు వేయించుకోవాల్సిన దుస్థితి చంద్రబాబుకు ఈరోజు ఏర్పడింది.  ఇదే జగన్ మోహన్ రెడ్డి దెబ్బ కాదా..?

- 2009 ఎన్నికల సమయంలోనూ, అప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభంజనంలో ఆయన్ను ఎదుర్కొనే ధైర్యం లేక, స్వర్గీయ ఎన్టీఆర్ రూపంలో ఉంటాడని ఆరోజు జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తెచ్చి,  ఎన్నికల ప్రచారంలో తిప్పి, అవసరం తీరాక ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా చూడవద్దని చంద్రబాబు కుటుంబ సభ్యులే ప్రచారం చేశారు. అటువంటి చంద్రబాబు కుటుంబం ఈరోజు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. ఇది జగన్ మోహన్ రెడ్డి దెబ్బ కాదా..?
 
4. చంద్రబాబు ఈరోజు కూడా కుప్పంలో మాట్లాడుతూ..  కుప్పం నియోజకవర్గాన్ని అశ్రద్ధ చేశానని, అన్యాయం చేశాను, నన్ను క్షమించండి, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను.. అని చెబుతూ ఇంతకాలం తాను కుప్పానికి ఏమీ చేయలేదని ఆయన మాటల్లోనే అంగీకరించాడు. 
 
- 14  ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు, కుప్పానికి నీళ్ళు ఇవ్వమని జగన్ మోహన్ రెడ్డిని అడుగటానికి సిగ్గు ఎక్కడ లేదు..? ఏడు సార్లు మిమ్మల్ని కుప్పం ప్రజలు గెలిపిస్తే.. కుప్పంకు దోసెడు నీళ్ళు ఇవ్వలేని మీరు ఇక రాష్ట్రానికి ఏం చేస్తారు..?
 
5. కుప్పంలోనే చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు.  గతంలో చంద్రగిరిని మార్చినట్టు, రేపు కుప్పం నియోజకవర్గాన్ని కూడా మార్చుతాడేమో.. !
 
- అధికారంలోకి వచ్చాక.. కేసులన్నీ మాఫీ చేస్తానని మేనిఫెస్టోలోనే  పెడతానని చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. అంటే చట్టం, రాజ్యాంగం అన్నది తనకు వర్తించదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. కుప్పంలోనే ఇరుక్కుపోయిన చంద్రబాబు గెలిచేదెక్కడ.. ఇక అధికారంలోకి వచ్చేదెప్పుడు..? చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో నూకలు చెల్లిపోయాయి.
 
6.  జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయిన చంద్రబాబు కుప్పంలో మాట్లాడుతుంటే.. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రావాలని కింద నుంచి కార్యకర్తలు అడిగే పరిస్థితి వచ్చిందంటే.. చంద్రబాబు నాయకత్వం మీద తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. 

- జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప.. కుప్పంలో మీ ప్రచారానికి దిక్కు లేని పరిస్థితి ఏర్పడిన తర్వాత రాజకీయంగా చంద్రబాబు ఎక్కడ ఉన్నాడో అర్థం చేసుకోవాలి. 
 
7. పుంగనూరులో ఓడిస్తాను, పులివెందులలో ఓడిస్తాను అని చంద్రబాబు బీరాలు పలుకుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో  పుంగనూరు వెళ్ళి ఏమైనా పోటీ చేస్తావా చంద్రబాబూ..! చంద్రగిరిని వదిలేసినట్టు కుప్పంను కూడా వదిలేస్తున్నావా..! పుంగనూరులో ఒక్క పంచాయతీ అన్నా గెలిచావా..! ఒక్క పంచాయతీ గెలిపించుకోని మీరు పుంగనూరు వెళ్ళి ఎవర్ని ఓడిస్తారు..?
 
8. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఈరోజు మేనిఫెస్టో విడుదల చేశారు.  మేనిఫెస్టోల పిచ్చి చంద్రబాబుకు కొత్త కాదు. మేనిఫెస్టోలు అయితే ప్రతి ఎన్నికల్లో పేజీల కొద్దీ రంగుల్లో ఇస్తారు తప్పితే.. అందులో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయరు.

2014 మున్సిపల్ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకుండా.. మళ్ళీ కొత్త మేనిఫెస్టోని ఈరోజు విడుదల చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేనిఫెస్టోని అమలు చేయలేని మీరు.. అధికారంలో లేకుండా ఎలా అమలు చేస్తారు.. ? 

-గతంలో వైయస్ఆర్ గారు చెప్పినట్టు.. అమ్మకు అన్నం పెట్టలేనివాడు.. చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాను అన్నాడట.. అధికారంలో ఉన్నప్పుడే మేనిఫెస్టోను అమలు చేయలేని మీరు.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కొత్త మేనిఫెస్టోను అమలు చేస్తానని  చెప్పటం దగాకోరుతనం కాదా..
 
9. గత రెండు రోజులుగా నారా లోకేష్ తన స్థాయికి మించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి పిరికివాడు అని, గన్ లో బుల్లెట్ లు లేవు అని, అమ్మ మొగుడు సొమ్మా అని.. ఏం పీకారు అని.. ఏదేదో మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నాడు. 
 
- వాస్తవానికి లోకేష్ వచ్చిన తర్వాతే.. టీడీపీ సైకిల్ పూర్తిగా తునాతునకలైందన్న విషయాన్ని గమనించుకోవాలి. 
- జగన్ గన్ లో బుల్లెట్ లు లేకపోతేనే.. లోకేష్ మంగళగిరిలో కూలిపోయాడా..? 
- కుప్పంలో పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ 14 సీట్లకు సర్దుకోవాల్సి వచ్చిందా..? 
- రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పరిమితమైందా..? 

- ముఖ్యమంత్రుల కొడుకులందరూ ముఖ్యమంత్రులు కాలేరు. దానికి జగన్ మోహన్ రెడ్డిలా దమ్ము, ధైర్యం ఉండాలి. 
- మీ నాన్న ఎమ్మెల్సీ చేసి, దొడ్డిదారిన మంత్రిగా చేస్తే.. మూడేళ్ళు మంత్రిగా పనిచేసి మంగళగిరిలో ఘోరంగా ఓడిపోయిన లోకేష్ కూడా మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. 
 
10. లోకేష్ కు ఐడెంటిటీ క్రైసెస్ ఉంది. మంత్రిగా చేశాను, టీడీపీ జాతీయ అధ్యక్షుడి కొడుకుని.. అయినా మంగళగిరిలో ఓడిపోయాను, రాజకీయంగా ఎవరూ గుర్తించటం లేదు అనే ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది. తనను గుర్తించాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. 
 
- నారా భువనేశ్వరికి మనవి చేస్తున్నాను.. మీ అబ్బాయిలో ఏదో తేడా ఉంది. మీరు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి ఎన్టీఆర్ గారి కుమార్తె. మీరు హెరిటేజ్ గొడవలో పడి మీ కొడుకుని పట్టించుకోకపోవడం మంచిది కాదు. 

- చంద్రబాబు రాజకీయంగా తిరుగుతూ పట్టించుకోకపోయినా, ఒక తల్లిగా మంచి డాక్టర్ కు ఎవరికైనా లోకేష్ ను చూపించండి. మీ ఏకైక కుమారుడ్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. 

- మీ నాన్న మీ భర్త ముఖ్యమంత్రిగా పని చేశారు. అయినా, మీ కొడుకు నారా లోకేష్ ముఖ్యమంత్రి మెటీరియల్ కాదు అని చెబుతున్నాను.
- నారావారి కుటుంబంలో మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని లోకేష్ బాబాయ్ ను చూస్తే అర్థమవుతుంది.
- మంచి పౌరుడిగా తీర్చిదిద్దండి తప్ప.. మంచి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దటం అయ్యే పని కాదు.