బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 21 జనవరి 2021 (15:10 IST)

నిమ్మగడ్డకు అనేక ఆటంకాలు, అధర్మంపై ధర్మం, న్యాయం గెలిచింది: యరపతినేని వ్యాఖ్యలు

గుంటూరు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో అధర్మంపై ధర్మం , న్యాయం గెలిచిందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నిస్తే సీఎం జగన్ ఎన్నికలను అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేశారని ఆయన ఆరోపించారు.
 
ఎస్ఈసీ నిమ్మగడ్డకు అనేక ఆటంకాలు కల్పించారని ఆయన పేర్కొన్నారు. మంత్రులు కూడా ఎస్ఈసీ రమేష్ కుమార్ పైన ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు. ఒకానొక దశలో న్యాయ వ్యవస్థపై సైతం జగన్ దాడి చేశారన్నారు.
 
హైకోర్టు తీర్పు సీఎం జగన్ కు పెద్ద చెంపపెట్టులాంటిదని ఆయన అన్నారు.హైకోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసులను ఎస్ఈసీ ఆధీనంలో ఉంచి స్థానిక ఎన్నికలను నిర్వహించాలని ఆయన కోరారు. ఏనాటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందనే విషయాన్ని సీఎం జగన్, వైసీపీ నాయకులు గమనించాలన్నారు.
 
సీఎం జగన్ తన అసమర్థ పాలనతో ఏపీని అంధకారంలోకి నెట్టేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని మతాల ప్రార్థనాలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ మారి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.