సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (08:11 IST)

జగన్ ముమ్మాటికీ దళిత ద్రోహే: వర్ల రామయ్య

ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పటినుంచీ రాష్ట్రంలో దళితవర్గాలపై దాడులు అధికమయ్యాయని, అవన్నీ యాథృచ్ఛికంగా జరుగుతున్నాయా, ప్రణాళికప్రకారం జరుగుతున్నాయా అనే అనుమానం ప్రజలందరికీ కలుగుతోందని, రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ, ప్రివెన్షన్ యాక్ట్ – 1989 అమల్లో ఉందా అనే సందేహం దళితులకు ఉందని టీడీపీ సీనియర్ నేత, ఆపార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు.

ఆయన మాజీమంత్రి నక్కా ఆనందబాబుతో కలిసి  మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో “దళితులపై దమనకాండ - దళితద్రోహి జగన్మోహన్ రెడ్డి” పేరుతో ఒక బుక్ లెట్ (పుస్తకం)ను ఆవిష్కరించారు.

అనంతరం రామయ్య విలేకరులతో మాట్లాడుతూ, దళితులపై జరుగుతున్న దాడులను ముఖ్యమంత్రి చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని,  దళితులు, గిరిజనులపై వరుసపెట్టి దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాడన్నారు.  రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ – 1989 అమల్లో ఉందా అనే సందేహం దళితుల్లో ఉందన్నారు.

జగన్ పాలనలో దళితులపైజరుగుతున్న దాడులను తెలియచేస్తూ, తెలుగుదేశం పార్టీ దళితవిభాగం “ దళితులపై దమనకాండ- దళితద్రోహి జగన్మోహన్ రెడ్డి”  పేరుతో పస్తకాన్ని విడుదలచేస్తున్నామన్నారు. ఈ పుస్తకం చదివితే రాష్ట్రంలోని దళితుల పరిస్థితేమిటో ప్రతి ఒక్కరికీ తెలుస్తుందన్న రామయ్య,  ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారులు, అధికారులు, విలేకరులు, ప్రతి దళితుడు ఈ పుస్తకం చదివి దళితుల గురించి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. 

దళితులపై దాడులను సమీక్షించాలని, పోలీసుల దర్యాప్తును సమీక్షించాలని ముఖ్యమంత్రిని గతంలో అనేకసార్లు కోరడం జరిగిందని రామయ్య చెప్పారు.

మేం ఎన్నిసార్లుకోరినా పట్టించుకోని ముఖ్యమంత్రి, చివరకు నిన్న జిల్లా ఎస్పీలు, కలెక్టర్లతో స్పందన కార్యక్రమం పేరుతో సమీక్ష నిర్వహించారని, ఆ సమావేశంలో  దళితులపై దాడులను ఉపేక్షించమని,  బాధ్యులు ఎంతటివారైనా కఠినచర్యలు తప్పవని, పోలీస్ అధికారులపై చర్యలు తీసుకొని జైలుకు పంపామని, పోలీస్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం బాధాకరం, అయినా తప్పుచేసినప్పుడు కఠినంగా వ్యవహరించక తప్పదు, గతంలో దళితులపై జరగరానివి జరిగితే చర్యలు తీసుకోలేదని, గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా అదేనని జగన్ చెప్పినట్లు,  ప్రజాస్వామ్య వ్యవస్థలో గుండుకొట్టించడం లాంటి ఘటనలు మంచిది కాదన్నట్లు సాక్షిలో రాశారని  వర్ల తెలిపారు. 

దళితవర్గాలకు చెందిన నాయకుడిగా ముఖ్యమంత్రికి రెండు ప్రశ్నలు వేస్తున్నానన్న వర్ల, జగన్  మాటలకు, జరుగుతున్న దారుణాలకు ఎక్కడా పొంతన కుదరడంలేదన్నారు. దళితులపై అధికారపార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సాగిస్తున్న దమనకాండే అందుకు నిదర్శనమన్నారు. 

జగన్ కు  ఏదన్నా అటు ఇటూ అయితే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఆరాటపడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  దళిత మేజిస్ట్రేట్ గురించి వాడొక పిచ్చి వెధవ, ఎవడు వాడంటూ కించపరిచేలా మాట్లాడాడని, అటువంటి రామచంద్రారెడ్డిపై  జగన్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు.

బాధ్యతాయుతమైన మంత్రే దళిత మేజిస్ట్రేట్  రామకృష్ణ గురించి, అతని కులాన్ని గురించి చులకనగా మాట్లాడితే, ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అటువంటి అసమర్థ ప్రభుత్వానికి, దళితవ్యతిరేక ప్రభుత్వానికి జగన్ నాయకుడిగా ఉన్నాడన్నారు. 

చేయని పనిని చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి,  దళిత మేజిస్ట్రేట్ ను ఆత్మన్యూనతకు లోనయ్యేలా మాట్లాడిన పెద్దిరెడ్డిపై తీసుకున్నచర్యలంతా బుస్సేనని వర్ల ఎద్దేవాచేశారు.  రామకృష్ణ కేసును విచారిస్తున్న అధికారులు కనీసం మంత్రి దగ్గరకు వెళ్లి ఆయన స్టేట్ మెంట్ కూడా రికార్డు చేయలేకపోయారన్నారు.

ప్రజలకు  ముఖ్యమంత్రి చెప్పిందేమిటో.. వాస్తవంలో జరుగుతున్నదేమిటో  అందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు.  దళితులను గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డిని ముఖ్యమంత్రి ఉపేక్షించారా... దళితులపై దాడులను ఉపేక్షిస్తున్నారా అని రామయ్య నిలదీశారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలాగు తనమాట వినరుకాబట్టి, సీఎం అమాయకులైన అధికారులు, పోలీసులను బలిచేస్తున్నాడన్నారు.  పోలీస్ స్టేషన్లో దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటనలో ట్రైనీ ఎస్సైని ఉసిగొల్పిన వారిని వదిలేసి, అతన్ని ప్రలోభపెట్టి తమస్వార్థానికి వాడుకున్నవారిని విడిచిపెట్టి, సదరు సబ్ ఇన్ స్పెక్టర్ పై చర్యలు తీసుకోవడం ఏమిటని వర్ల ప్రశ్నించారు.

మూడురోజుల క్రితం ట్రైనింగ్ పూర్తిచేసుకొని బాధ్యతలు చేపట్టిన కొత్త ఎస్సై, తెగించి ఒక దళిత యువకుడికి శిరోముండనం చేశాడంటే ఎవరైనా నమ్ముతారా అన్న రామయ్య, ఏమాత్రం సిగ్గులేకుండా  ఈ ప్రభుత్వం పోలీసులపై చర్యలు తీసుకున్నామంటోందన్నారు. 

అధికారపార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అతని అనుచరుడు కవల కృష్ణమూర్తిని రక్షించేందుకు ఈ ప్రభుత్వం  ఉద్యోగంలో చేరిన 48గంటల్లోనే ఎస్సైని బలిపశువుని చేసిందన్నారు. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఎస్సైతోపాటు కృష్ణమూర్తిని కూడా సెంట్రల్ జైలుకి పంపి ఉండాల్సిందన్నారు.  ముఖ్యమంత్రి స్వార్థంవల్ల శిరోముండనం కేసుని విచారిస్తున్నఅధికారి కూడా త్వరలోనే ముద్దాయిగా మారబోతున్నాడన్నారు.   

అధికారం ఉంది కదా.. ఏం చెప్పినా వింటారు కదా అని ముఖ్యమంత్రి అధికారులకు హితబోధ చేస్తున్నాడని, ఆయన చెప్పాల్సింది వారికి కాదని, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నప్పుడు   ఎలామసలుకోవాలో  తనపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీనేతలకు చెబితే బాగుంటుందని వర్ల హితవుపలికారు.  ప్రజలు  మనకు అధికారమిచ్చింది రౌడీయిజం, టెర్రరిజం చేయడానికి కాదని జగన్ తనపార్టీ వారికి చెప్పుకుంటే మంచిదన్నారు. తప్పుచేసిన ప్రతి అధికారి ప్రజాక్షేత్రంలో ఏదో ఒకరోజు దోషిగా నిలవాల్సిందేనని రామయ్య తేల్చిచెప్పారు. 

చిత్తూరులో ఓంప్రతాప్ అనే  దళితయువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరు కారకులన్న రామయ్య,  అతని ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్ట్ చేసే ధైర్యం జగన్ ప్రభుత్వానికి ఉందా అని నిగ్గదీశారు. ఎందుకయ్యా ఇలా కల్తీ మద్యం అమ్ముతూ, ప్రజల ప్రాణాలు తీస్తున్నారని అడగటమే అతను చేసిననేరమా అన్నారు. అతన్ని ఆత్మహత్య చేసుకునేలా, వేధించి, వెంటాడిన వారిపై చర్యలు తీసుకునే ధైర్యం ఈ ముఖ్యమంత్రికుందా అని వర్ల నిగ్గదీశారు. 

ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లు తెరిచి, శిరోముండనం ఘటనసహా, దళితులపై అధికారపార్టీ నేతల కనుసన్నల్లో సాగుతున్న దమనకాండపై సమీక్ష నిర్వహించాలన్నారు. దళితులను వేధించవద్దని తనపార్టీ వారికి, మంత్రులు, ఎమ్మెల్యేలకు  చెప్పే ధైర్యం ముఖ్యమంత్రికి ఉంటే ఆయన బహిరంగంగా వారిని హెచ్చరించాలన్నారు.

కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన  సమీక్షలో ముఖ్యమంత్రి తప్పుగా మాట్లాడారన్న వర్ల, దళిత మహిళను హోంమంత్రిగా పెట్టింది, ఆమెను ప్రేక్షకపాత్రకు పరిమితం చేయడానికే కదా అన్నారు.  దళితమహిళను బొమ్మనుచేసి, నిజంగా హోంమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నది ఎవరో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. 

హోంమంత్రికి కాళ్లున్నాయి.. కానీ నడవలేదు,  చెవులున్నాయి కానీ వినలేదు,  నోరుంది కానీ మాట్లాడలేదని, ఇన్ని మంచిలక్షణాలున్నాయి కాబట్టే, ఆమెను హోంమంత్రిగా పెట్టారని రామయ్య దెప్పిపొడిచారు.

దళిత డాక్టర్ ని పిచ్చివాడిని చేసి, రోడ్లపై ఈడ్చుకెళ్లినప్పుడు, దళిత వైద్యురాలు అనితారాణిని వైసీపీనేతలు వేధింపులకు గురిచేసినప్పుడు, దళిత బాలికపై అత్యంత కిరాతకంగా వైసీపీ కార్యకర్తలు అత్యాచారం చేసినప్పుడు, పోలీసులు దారుణంగా దళితయువకుడు కిరణ్ కుమార్ ను పాశవికంగా కొట్టి చంపినప్పుడు, వరప్రసాద్ కు  పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేసినప్పుడు హోంమంత్రి ఎక్కడున్నారో, వారిని ఎందుకు పరామర్శించలేదో సమాధానం చెప్పాలన్నారు. 

గౌతమ్ సవాంగ్ సమర్థత చూసి  ఆయన్ని డీజీపీగా నియమించారా లేక ఎస్టీ కులం వాడని  డైరెక్టర్ జనరల్ ని చేశారో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు.  పోలీస్ శాఖలో డైరెక్టర్ జనరల్ కులం గురించి ముఖ్యమంత్రి స్థాయివ్యక్తి మాట్లాడిన సందర్భాలు, దాఖలాలు దేశంలో ఎక్కడా జరగలేదన్నారు.

ముఖ్యమంత్రి బలహీనుడు కాబట్టే, ఇలా బలహీనంగా కులాల గురించి  మాట్లాడుతున్నారన్న రామయ్య,  హోంమంత్రి, డీజీపీ కులాలను ప్రస్తావించి, వారిని కించపరిచినందుకు ఆయన తక్షణమే బహిరంగంగా రాష్ట్రంలోని దళితులకు క్షమాపణ చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు.

తమకు తాము దళితులమని చెప్పుకుంటూ, ప్రభుత్వ దుర్మార్గాలను, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను సమర్థించేవారు ఎంతమంది ఎన్ని చెప్పినా, ముఖ్యమంత్రి తనచర్యలను తాను సమర్థించుకున్నా, ఆయన్ని ఎవరు ఎన్నిరకాలుగా వెనకేసుకొచ్చినా జగన్ ఎప్పటికీ దళిత ద్రోహేనని రామయ్య తేల్చిచెప్పారు. 

రాష్ట్రపతికి తెలియబట్టే ముఖ్యమంత్రి స్పందించాడు : ఆనందబాబు
శిరోముండనం ఘటన జరిగి 40రోజులైతే, ముఖ్యమంత్రికి అది  ఇప్పుడు గుర్తొచ్చిందన్న ఆనందబాబు, ఆ ఘటన రాష్ట్రపతి దృష్టికి వెళ్లబట్టే సీఎం స్పందించారన్నారు. 15 నెలలుగా రాష్ట్రంలో దళితులపై దమనకాండ సాగుతుంటే, ముఖ్యమంత్రి నిన్న దానిపై స్పందించడం సిగ్గుచేటన్నారు. 

దళితులు ఎన్నో ఆశలతో తమను ఉధ్దరిస్తాడని జగన్ ను గెలిపించుకున్నారని,  అందుకే వారిని ఏం చేయడానికైనా ఆయన వెనుకాడటం లేదని మాజీమంత్రి తెలిపారు.  

దళితులపై సర్వహక్కులు తమవే అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అందుకే కొట్టినా, తిట్టినా, చంపినా, గుండు గీసి అవమానించినా  పడుండాలన్నట్లుగా  జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తోందన్నారు.  మనుగడకోసం, ఆత్మగౌరవం కోసం దళితులంతా బతకాల్సిన పరిస్థితులు రాష్రంత్లో ఏర్పడ్డాయన్నారు.  శిరోముండనం జరిగిన వెంటనే ఎవరు చేశారు, ఎందుకు చేశారనేది ముఖ్యమంత్రి విచారించలేదన్నారు. 

అటువంటి ఘటనకు పాల్పడటం, చేయడం, ఎంతటి అమానుషమో, అనాగరికమో,  అమానవీయమో ముఖ్యమంత్రికి తెలుసా అని ఆనందబాబు ప్రశ్నించారు.  జరిగిన దారుణం రాష్ట్రపతికి తెలియబట్టే, అభద్రతతో ముఖ్యమంత్రి మాట్లాడారన్నారు. రాబోయే రోజుల్లో ఈ అంశం ఎక్కడ పార్లమెంట్ లో చర్చకు వస్తుందోనన్న భయంతోనే ముఖ్యమంత్రి శిరోముండనం పై స్పందించాడన్నారు.

టీడీపీ దళితవిభాగం ఆవిష్కరించిన బుక్ లెట్ లోని అంశాలు పార్లమెంట్ లో చర్చకు వచ్చేలా చేస్తామని  మాజీమంత్రి స్పష్టంచేశారు.  ముఖ్యమంత్రి మాస్కు పెట్టుకోకుండా,  చీరాలలో దళితయువకుడికి మాస్కు లేదని కొట్టి చంపడమేంటని ఆనందబాబు ప్రశ్నించారు. 

దళిత బాలికను దారుణంగా అత్యాచారం చేసి, పోలీస్ స్టేషన్ ముందు పడేసిన వారిపై ఏంచర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. ఈ 15నెలల్లో ముఖ్యమంత్రి దళితులకు ఏం చేశారో, వారిపై జరగుతున్న దారుణాలను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారో సమాధానం చెప్పాలన్నారు.  ఆరు ఎస్సీ నియోజకవర్గాల మధ్యనున్న రాజధాని అమరావతిని జగన్ నిట్టనిలువునా చంపేశాడని, వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగకుండా తొక్కేశాడన్నారు. 

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం టీడీపీ ప్రభుత్వం 40వేలకోట్లు ఖర్చు చేస్తే, జగన్ ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.  జగన్ ప్రభుత్వం దళితులపై సాగిస్తున్న దమనకాండను, దుశ్చర్యలను పూర్తి వివరాలతో, ఆధారాలతో “దళితులపై దమనకాండ-దళితద్రోహి జగన్” పుస్తకంలో వివరించామని ఆనందబాబు స్పష్టంచేశారు.

దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పిన కొన్ని గంటలకే, చిత్తూరులో  దళితయువకుడు ఆత్మహత్య చేసుకునేలా వైసీపీనేతలు వేధించారన్నారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, దేశంలో మరెక్కడా జరగడం లేదన్నారు.