1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 27 జులై 2023 (19:45 IST)

పవన్ కళ్యాణ్‌ సినిమాల్లోని ప్రేమకథలే టీనేజీ మహిళల అదృశ్యానికి కారణం : వాసిరెడ్డి పద్మ

vasireddy padma
హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నటించే చిత్రాల్లోని ప్రేమకథలే టీనేజీ మహిళల అదృశ్యానికి ప్రధాన కారణమని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ సెలవిచ్చారు. ఏపీ ప్రభుత్వాన్ని దోషిగా చిత్రీకరించేందుకు, రాష్ట్రంలో రాచరిక రాజ్యం ఏలుతున్నట్టుగా చూపించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. 
 
కాగా, ఏపీలో గత 2019 నుంచి 2021 వరకు 7,918 మంది బాలికలు, 22,278 మంది మహిళలు, యువతుల అదృశ్యమైనట్టు కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్‌ స్పందించాలని పవన్ డిమాండ్ చేశారు. 'ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వాన్ని మహిళా కమిషన్‌ ప్రశ్నించగలదా? దీనిపై మహిళా కమిషన్‌ విలేకరుల సమావేశం పెట్టగలదా? హోం శాఖను, డీజీపీని వివరణ కోరగలదా?' అని పవన్‌ ప్రశ్నించారు. పవన్‌ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ గురువారం స్పందించారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల అదృశ్యంపై పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ప్రకటించటం, దానిపై పవన్‌ కల్యాణ్ మళ్లీ స్పందించటం ఏంటని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగానే రాజ్యసభలో కొందరు ఎంపీలు మహిళల అదృశ్యంపై ప్రశ్నలు అడగటం వెనుక ఏ ఉద్దేశాలు ఉన్నాయని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వాన్ని దోషిగా.. అరాచక రాజ్యం ఏలుతున్నట్టుగా చూపించేందుకు ఎందుకు తాపత్రయపడుతున్నారని ఆక్షేపించారు. 
 
మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో మహిళల అదృశ్యంపై ఎందుకు మాట్లాడటం లేదని ఆమె నిలదీశారు. వాలంటీర్లపై దుష్ప్రచారం చేసేందుకే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. వాలంటీర్ల వల్లే మహిళలు అదృశ్యమవుతున్నారని చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు ఇవ్వాలని ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌కు నోటీసులు ఇచ్చామన్నారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లోని ప్రేమకథలే టీనేజీ మహిళల అదృశ్యానికి కారణమవుతున్నాయని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.