శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (07:33 IST)

విజయవాడలో వాహన కాలుష్య తనిఖీలు

విజయవాడ బందరు రోడ్డులోని స్వరాజ్య మైదానం ప్రాంగణంలో డిటిసి యం పురేంద్ర వాహన కాలుష్య తనిఖీ మొబైల్ వాహనాలపై తనిఖీలను చేపట్టారు. అనంతరం మొబైల్ వాహనాల ద్వారా వాహన కాలుష్య తనిఖీలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు నిబంధనలపై అవగాహన కార్యక్రమంను నిర్వహించారు.

డిటీసీ యం పురేంద్ర మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వాహనాలకు కాలుష్య తనిఖీలను చేపట్టకుండానే ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్నారని, వాహన కాలుష్య పరీక్ష కేంద్రాలపై అందుతున్న ఫిర్యాదుల మేరకు రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఉన్న కాలుష్య పరీక్ష కేంద్రాలపై తనిఖీలను చేపట్టామని ఆయన తెలిపారు.

మార్స్, నేటెల్, ఏవిల్ కంపిణీలకు సంబంధించిన మిషన్ సర్వీస్ ఇంజనీర్ల సహకారంతో కాలుష్య తనిఖీ వాహనాలకు పరీక్షలు చేపట్టి లోపలను గుర్తించడం జరిగిందన్నారు. లోపలున్న వాహన కాలుష్య తనిఖీ కేంద్రాలు ఈ నెల 31లోపు లోపాలను సరిచేయించుకోవాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా 60 వాహన కాలుష్య తనిఖీ కేంద్రాలకు అనుమతులుఇవ్వడం జరిగిందని, వీటిలో మొబైల్ వాన్ ద్వారా 50, స్టేషనరీ ద్వారా 10 మొత్తం 60 వరకు వాహన కాలుష్య పరీక్షలు కేంద్రాలు ఉన్నాయన్నారు. వాహన చట్టంలో నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వాహన కాలుష్య తనిఖీ చేసి కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం జారీ చేయవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

కొత్త వాహనాలతో పాటు, కాలం చెల్లిన వాహనాలు సైతం రోడ్లపై తిరగడంతో పాత వాహనాలు నుండి వెలువడే ప్రమాదకరమైన కాలుష్య కారక పదార్థాల వలన ఆనారోగ్యాలకు కారణాలవుతున్నాయన్నారు. ఇలాంటి వాహనాలకు కొంతమంది నిర్వాహకులు కాలుష్య తనిఖీలలో ఏలాంటి నాణ్యత ప్రమాణాలు చూడకుండా డబ్బులు ఆశించి ఉత్తుత్తి తనిఖీలను చేపట్టి కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్నారన్నారు.

నాణ్యత ప్రమాణాలకు మించి పొగ ఎక్కువ వచ్చినా కూడా  మొబైల్ వాన్ నిర్వాహకులు తక్కువ శాతం కంప్యూటర్లో నమోదు చేసి క్షణాల మీద ప్రింట్ తీసి ధ్రువీకరణ పత్రాలను ఇచ్చేస్తున్నారని ఆయన తెలిపారు.అటువంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. వాహనాల నుండి వెలువడే పొగ సాంద్రత దానిలోని కాలుష్య కారక పదార్థాలను నిర్ధారించి, ఎంత మోతాదులో పొగ సాంద్రత బయటకు విడుదల అవుతుందో ఆ మేరకు ధ్రువీకరణ పత్రాలను అందజేయాలన్నారు.

వాహన కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం పూర్తి పారదర్శకంగా పరీక్షలు చేపట్టిన తర్వాత మాత్రమే వాహనదారులకు అందజేయాలన్నారు. కాలుష్య తనిఖీలకు తీసుకోవలసిన చార్జీల కంటే అక్రమ వసూళ్లకు పాల్పడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేదేలేదని అటువంటి వారిపై చట్టఫరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

కాలుష్య తనిఖీ కేంద్రాల అనుమతిని కూడా రద్దు చేస్తామన్నారు. మోటార్ వాహన చట్టం రూపొందించిన ప్రమాణాలకు అనుగుణంగా వాహన కాలుష్య తనిఖీలు చేపట్టాలన్నారు. గతనెలలో చేసిన వాహనాల కాలుష్య తనిఖీ రికార్డులను ప్రతినెల 5 తారీఖులోవు ఆర్టీఏ కార్యాలయాల్లో చూపించాలన్నారు. జనవరి మొదటివారం నుండి వీటిపై జిల్లా వ్యాప్తంగా నిఘాలను ముమ్మరం చేస్తామన్నారు.
 
ఈ వాహనాల తనిఖీలలో డిటిసి పురేంద్రతో పాటుగా ఆర్టీవో రాంప్రసాద్ మోటార్ వాహన తనిఖీ అధికారులు జి సంజయ్ కుమార్, జి నాగమురళి, ఆర్ ప్రవీణ్, కె ఎస్ ఎన్ ప్రసాద్, కార్యాలయ పరిపాలన అధికారి సిహెచ్ శ్రీనివాసరావు ఉన్నారు.