శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , గురువారం, 23 సెప్టెంబరు 2021 (16:33 IST)

క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి వినూత్న ఆలోచన...కన్వర్జెన్సీ మీట్-2021

వినూత్నమైన ఆలోచనలతో, శాఖల మధ్య సమన్వయంతో అత్యుత్తమ ఫలితాలను సాధించవచ్చని విజ‌య‌న‌గ‌రం జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి అన్నారు. వివిధ శాఖల మధ్య పరస్పర అవగాహన, సహకారం, సంయుక్త కార్యాచరణ ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చని ఆమె స్పష్టం చేశారు.  జిల్లా సమగ్రాభివృద్దే లక్ష్యంగా, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో సమగ్రమైన కార్యాచరణ రూపొందించేందుకు కన్వర్జెన్సీ మీట్-2021 సమావేశాన్ని గురువారం భోగాపురంలో నిర్వహించారు. సుమారు 35 శాఖలకు చెందిన అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తమ శాఖాపరమైన కార్యకలాపాలను, పథకాలను వివరించారు. ఇతర శాఖల భాగస్వామ్యంతో చేపట్టగలిగే కార్యక్రమాలపై పలు ప్రతిపాదనలు చేశారు. వీటిపై సమగ్రంగా, సుదీర్ఘంగా చర్చించారు. 
 
ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, శాఖలమధ్య సమన్వయంతో సత్ఫలితాలు సిద్ధిస్తాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయడమే కాకుండా, ఆ పథకాల వెనుకనున్న అసలు లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమాల అమలులో భాగంగా స్ఫురించే సరికొత్త ఆలోచనల ద్వారా, వాటిని మరింత సమర్ధవంతంగా, మరింతమందికి ప్రయోజనం చేకూర్చేవిధంగా రూపొందించవచ్చని సూచించారు. అతితక్కువ ఖర్చుతో, ఎక్కువమందికి లబ్ది చేకూర్చేచేందుకు కృషి చేయాలన్నారు. మన జిల్లాలో ఎక్కువమంది వ్యవసాయం పై ఆధారపడి ఉన్నారని, ఈ రంగంపై దృష్టి సారించాలన్నారు. నిరుపయోగంగా ఉన్న భూములను సాగులోకి తీసుకురావడం, నీటి వసతి కల్పించడం, పంట దిగుబడులను పెంచడం, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడం తదితర ఆలోచనలు చేయాలన్నారు. సేంద్రియ పంటల సాగును ఉత్పత్తుల విక్రయాన్ని పెంచేందుకు, వాటికి ప్రాచుర్యం కల్పించాలన్నారు. రైతులు కేవలం వరి తదితర సంప్రదాయ పంటలసాగుకే పరిమితం కాకుండా, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. 
 
జిల్లాలో చిన్న కమతాలు ఉన్నందున, వాటికి తగ్గ యంత్ర పరికరాలు రూపొందించాలన్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ముఖ్యంగా సౌరశక్తి పరికరాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తూనే, స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దీనికి అనుగుణంగా వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. స్పోకెన్ ఇంగ్లీష్ తదితర కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు కృషి చేయాలన్నారు. విభిన్న ప్రతిభావంతులకు, కోవిడ్ కారణంగా సంపాదనాపరులను కోల్పోయిన కుటుంబాలకు ఉపాధి కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జిసి కిశోర్ కుమార్, డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, మయూర్ అశోక్, జె.వెంకటరావు, ఐటిడిఎ పీవో ఆర్.కుర్మానాధ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.