శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 9 డిశెంబరు 2021 (16:51 IST)

ఛార్జి తీసుకోవ‌డంతోనే దూకుడు...

విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ గా కొత్త‌గా ఛార్జ్ తీసుకోవడంతోనే ఆయ‌న ప‌నిలో దూకుడు ప్రారంభించారు. కొత్త సీపీ కాంతి రాణా టాటా దొంగ‌ల ముఠా చెడ్డీ గ్యాంగ్ పై విచార‌ణ ప్రారంభించారు. ఇటీవల విజయవాడ శివారులో జరిగిన చెడ్డి గ్యాంగ్ దొంగతనాలకు చెక్ పెట్టేందుకు సీపీ కాంతి రాణా త‌న‌దైన శౌలిలో కార్య‌రంగంలోకి దిగారు. 

 
విజ‌య‌వాడ కొత్త పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జక్కంపూడి సీవీ అర్ ఫ్లై ఓవర్ సమీపంలో జరిగిన నేరానికి సంబంధించిన నేర స్థ‌లిని పోలీస్ కమిషనర్ స్వ‌యంగా సందర్శించి, నేరం జరిగిన తీరు తెన్నులను తెలుసుకున్నారు. బాధితులను కలిసి వివ‌రాలు సేకరించారు. 

 
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  కాంతి రాణా టాటా మాట్లాడుతూ, నేరాలకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నేరగాళ్ళ‌ను గుర్తించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఇతర రాష్ట్ర క్రైమ్ పోలీసుల సహాయ సహకారాలను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలకు పంపించామని తెలిపారు. 
 
 
పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని అపార్ట్మెంట్ల‌లో నేర నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల‌ని సంబంధిత స్టేషన్ సీఐ కు ఆదేశాలు జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వెంట డీసీపీ హర్షవర్ధన్, బాబురావు, క్రైమ్ బ్రాంచ్ ఎడిసీపీ శ్రీనివాస్, వెస్ట్ ఏసీపీ హనుమంత్ రావు, క్రైమ్ ఎసీపీ శ్రీనివాస్, కొత్త పేట సీఐ మోహన్ రెడ్డి సిబ్బంది ఉన్నారు.