గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 మే 2024 (16:39 IST)

వైకాపా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది.. విజయం తథ్యం : ప్రధాని నరేంద్ర మోడీ

modi - babu - pawan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందని, అందవల్ల ఏపీలో ఎన్డీయే కూటమికి విజయం తథ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన బుధవారం రాత్రి విజయవాడ నగరంలో రోడ్ షో నిర్వహించారు. ఇందులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌లు కూడా పాల్గొన్నారు. ఈ రోడ్‌షో తర్వాత ప్రధాని మోడీ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌‍తో పది నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలో తన రెండురోజుల పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేశారు. 
 
"ఇక్కడ ఎండ వేడిమి తీవ్రంగా ఉంది. ఆ ప్రభావం పోలింగ్‌పై పడకుండా చూడాలి. పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటలలోపే ఎక్కువమంది తమ ఓటుహక్కును వినియోగించుకునేలా చూడాలి. పోలింగ్ శాతం ఎంత పెరిగితే ఎన్డీయేకు అంత లాభం' అని వారికి మోడీ సూచించారు. తనను ఆదరించిన ఏపీ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా, రాష్ట్ర ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని, ఏపీలో కూటమి అభ్యర్థుల విజయం తథ్యమన్నారు. మహిళలు, యువత మద్దతు మూడు పార్టీలకు పుష్కలంగా ఉందన్నారు. 
 
అలాగే, టీడీపీ చీఫ్ చంద్రబాబు మాట్లాడుతూ, విజయవాడలో జరిగిన ప్రధాని మోడీ రోడ్ షోకు ప్రజల నుంచి వచ్చిన భారీ స్పందనతో తాను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యానని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఎన్డీయే ర్యాలీ చరిత్ర సృష్టించిందని ట్విట్టర్ బుధవారం పోస్టు చేశారు. 'మాపై ప్రజలు కురిపించిన ప్రేమాభిమానాలతో ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయనే నమ్మకం ఏర్పడింది. జూన్ 4న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు పార్టీల కలయికతో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది' అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 
 
'మోడీ తలపెట్టిన వికసిత భారత్ కోసం నిర్విరామంగా కృషిచేస్తున్నాం. రాష్ట్రంలో ప్రధాని పర్యటన విలువైనది. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి' అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.