శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 16 నవంబరు 2021 (12:00 IST)

అయోమయంలో ఆంధ్రా సర్పంచులు... అడకత్తెరలో పోకచెక్క!

గ్రామ స‌ర్పంచి అంటే...అదో హోదా... పెద్ద‌రికం! గ్రామాల్లో చాలా మంది త‌మ గొప్ప‌త‌నం చాటుకోవ‌డానికి స‌ర్పంచి కావాల‌ని కోరుకుంటారు. కొంత సామాజిక స్పృహ, మరికొంత తాము పుట్టిన గ్రామానికి మేలు చేద్దామన్న కోరికతో, లక్షలు, కోట్లు ఖర్చుపెట్టి సర్పంచ్ గా పోటీ చేస్తుంటారు. 
 
 
కొందరైతే  లక్షలు పెట్టి గ్రామంలో పనులు కూడా చేశారు. ఇదంతా సర్పంచి కాకముందు మాత్రమే. మన  ప్రభుత్వమేగా, డబ్బులెక్కడికి పోతాయనే ధైర్యంతో ఈ సాహసం చేశారు. తర్వాత బిల్లులు సి ఎఫ్ ఎం ఎస్ కు పంపటం, వాళ్ళు బడ్జెట్ లేదనో, మరో కారణంతోనో బిల్లు పెండింగ్ లో ఉంచ‌డం జ‌రిగింది. ఒకవేళ అదృష్టం బాగుండి బిల్లులు వెనక్కు రాకపోయినా, క్లియర్ కావటానికి మాత్రం కనీసం 6 నుండి 12 నెలలు పడుతుంది. గత ప్రభుత్వంలో చివరి 6 నెలలు మినహాయిస్తే, సీఎఫ్ ఎమ్ ఎస్ కి పంపిన 24 గంటల్లో బిల్లులు క్లియర్ అయ్యేవి. ఆ నమ్మకంతో వీళ్ళు ఇలా కూడా ప‌నుల విష‌యంలో ధైర్యం చేశారు.
 

ఉన్న ఆదాయం సరిపోక, ఒకపక్క అప్పులు తెచ్చి, ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి నవరత్నాలకు పంచుతున్నా, హ‌ఠాత్తుగా త‌మ బిల్లులు వ‌స్తాయ‌ని ఏదో ఆశ. ఇలా ఆశల పల్లకిలో ఊరేగుతుండగానే, పులి మీద పుట్రలా 'పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువ‌డింది. గ్రామాభివృద్ధి కోసం కోట్లలో ఖర్చు పెట్టిన కొందరైతే , అధికార పార్టీ సర్పంచ్ గా ఉంటే కనీసం తమ అభివృద్ధి పనుల బిల్లులైన పాస్ చేయించుకోవచ్చనే ఆలోచనతో, తమ ఎమ్మెల్యే దగ్గర పేరు సంపాదించుకోవచ్చని కొందరు, ఇలా పంచాయితీ ఎన్నికల్లోనే దాని స్థాయిని బట్టి 20 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టి సర్పంచిగా ఎన్నికయ్యారు.
 

అప్పటి నుండి అస‌లు క‌థ మొద‌లైంది. పంచాయతీ అవసరాలకు, పంచాయతీలోని  కింది స్థాయి ఉద్యోగుల జీతాలకు చాలా మంది సర్పంచులు తమ సొంత డబ్బును ఇవ్వటం, మరికొందరు సర్పంచులు అప్పు చేసి వాళ్లకి జీతాలు ఇవ్వడం జరిగిపోతోంది. అయితే ఇన్నాళ్లయినా పాత బిల్లులు రాకపోగా, మొన్నీమధ్య వచ్చిన 14వ ఆర్ధిక సంఘం నిధులను కూడా, కరెంట్ బకాయిలంటూ వీళ్లకు చెప్పాపెట్టకుండా ప్రభుత్వం తీసేసుకోవటం అన్నీ జరిగిపోయాయి. పాపం కొందరు సర్పంచులకైతే ఆ నిధులు వచ్చినట్లు, వాటిని ప్రభుత్వం తీసుకున్నట్టు తెలియదు. ఇందులో ఇంకో చోద్యమైన విషయమేంటంటే కరెంట్ బిల్లులు కట్టినా, టీడీపీ సర్పంచ్ గెలిచిన పంచాయితీలలో కొన్నిచోట్ల ఈ నిధులు కరెంట్ ఖాతా కింద తీసుకున్నారు.
 

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామ సర్పంచ్ దేవరకొండ రాజ్ కుమార్ టీడీపీకి చెందిన వ్యక్తి. ఈ పంచాయితీకి సంబందించిన దాదాపు నలభై లక్షల బిల్లు గతంలో చెల్లించటం జరిగింది. అయినా సరే, ఆ మోత్తాన్ని ప్రభుత్వం తీసుకోవటం జరిగింది. ఇలాంటి సర్పంచులు ఇపుడు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పంచాయతీల్లో నిధులు లేక సర్పంచులే సొంతవో, వడ్డీకి తెచ్చో ప్రస్తుతానికి కార్యాలయ కనీస అవసరాలను తీర్చుతున్నారు.
 

కానీ చిన్న, సన్నకారు సర్పంచులకు ఇది ఇప్పటికే భారమైపోయింది. ఇక తమ వల్ల కాదంటూ చేతులెత్తేసి ఫ్యాన్ కింద కూర్చున్నా, వారికి చెమటలు పడుతున్నాయి. ఇక అభివృద్ధి విషయానికొస్తే , కనీసం గతంలో పని చేసిన వాటిల్లో ఏదో ఒకటన్నా బిల్లు వస్తే, ఇంకేదైనా అభివృద్ధి పనులు చేయొచ్చు. కానీ, అసలు ఒక ఒక బిల్లు కూడా ఇవ్వకపోతే ఎక్కడ నుండి తెచ్చి చేస్తామంటున్నారు వైసీపీ సర్పంచులు. ఇవి అన్నీ తెలిసిన ఉదారవాదులు మాత్రం అన్నీ కావాలంటే ఎలా? ఒకటి కావాలంటే, ఇంకోటి వదిలేసుకోవాలని నిజాల్ని తమకు తెలియకుండానే కక్కేస్తున్నారు.
 

ఇక ఇతర పార్టీల సర్పంచుల సమస్యలు వేరేలా ఉన్నాయి. రిస్క్ చేసి పనులు చేసిన వాళ్ళను వెళ్లపైనే లెక్కేసుకోవచ్చు. అసలు ఆ రిస్క్ చేసే ఆలోచనే ఉన్నట్టు కనిపించటం లేదు. ఇక అధికార పార్టీ సర్పంచుల విషయానికొస్తే ఏదో విధంగా డబ్బు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేద్దామంటే ఆ డబ్బులు తిరిగి ఇప్పట్లో వస్తాయో రావో అన్న అనుమానం. ఒకవేళ ఏమి చేయకుండా కూర్చుంటే, స్థానికంగా ఊర్లో అవమానం.  ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి లాగా మింగలేక, కక్కలేక త్రిశంకు స్వర్గంలో ఉన్న‌ట్లుంది స‌ర్పంచుల ప‌రిస్థితి. 
 

ఇక  వార్డ్ వాలంటీర్ ల విషయానికి వస్తే ఏ పంచాయతీ కెళ్ళి చూసిన అది మేజర్ అయినా, మైనరయినా వాలంటీర్లకు మాత్రం అక్కడ కొదువలేదు. ఆఫీసుకు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకు వెళ్తారు. కానీ ఎప్పుడూ కంప్యూటర్ ముందే ఉంటారు. ఏం చేస్తారో అర్థం కావట్లేదని స్థానికంగా ఉండే సర్పంచులు, పంచాయితీ సెక్రటరీలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ఇంత మంది చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు గతంలో ఒక సర్పంచి, సెక్రటరీ ఉండి చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు. కొందరు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, దీనివల్ల ఎంత ప్రభుత్వ ధనం వృధా అవుతుందో తెలుసా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇదంతా గ్రామాభివృద్ధి కాకుండా, ఎవరో కొందరిని అభివృద్ధి చేస్తున్నట్లుందంటున్నారు.
 

ఇంకా ముఖ్యంగా ఈ వార్డ్ వాలంటీర్లు తాము ప్రభుత్వం ద్వారా నియమించబడ్డామని సర్పంచులని,  పంచాయితీ కార్యదర్శుల‌ను కూడా లెక్క చేయని సంఘటనలు ఎన్నో. ఇంకా కొన్ని చోట్లయితే స్థానిక నాయకుల వల్ల తమకు ఈ అవకాశం వచ్చిందని, ఎవరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదనడం వీరి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. ఇది పైదాక వెళ్ళటం వల్ల 'కార్యదర్సుల ఆధీనంలో ఉంటూ, వారి సలహాలతో వార్డ్ వాలంటీర్లు పని చేయాలంటూస‌ ఈ మధ్యే పంచాయితీ రాజ్ కమీషనర్ జీ. ఓ విడుదల చేసారు. 
 

ఇక తెలుగుదేశం బలపరచిన అభ్యర్థులు గెలిచిన చోట్లయితే, ఈ వాలంటీర్లు సర్పంచ్ లను అసలు పట్టించుకోరు. వీరిపై పెత్తనమంతా అధికార పార్టీ నేతలదే. ప్ర‌తిపక్షాల పరిస్థితి ఇలా ఉంటే..  అధికార పార్టీ సర్పంచులు కొందరయితే ఇంకాస్త‌ ముందుకెళ్లి, గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న జన్మభూమి కమిటీలను ఉదహరిస్తూ, ఏ విధంగా అయితే ఆ కమిటీలు వల్ల గత ప్రభుత్వం గ్రామ స్థాయిలో అంత వ్యతిరేకత తెచ్చుకుందో, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అంతకు మించిన స్థాయిలో అపఖ్యాతి మూటగట్టుకుంటుందని తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.