వాల్మీకిని అలా మార్చొచ్చు... వేమనలోని ఆ గుణాన్ని అణచొచ్చు... కానీ బాబును మార్చలేం..
తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు చాలామంది వ్యతిరేకించారని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. ఇంకా ఆయన చెపుతూ... ''చంద్రబాబు వాడుకుని వదిలేస్తారు అన్నారు. అయితే అప్పట్లో అనుభవం ఉన్న వ్యక్తి ఆయనే కావడంతో, ఎక్కడో చిన్నపాటి నమ్మకం. చంద్రబాబు నుంచి గొప్ప వ్యక్తి బయటికి వస్తాడేమోనని నమ్మా. వాల్మీకిని యోగిగా మార్చొచ్చు, వేమనలోని భోగాన్ని అణచవచ్చు గానీ, చంద్రబాబుని మాత్రం మార్చలేమని అర్ధమయ్యింది. మనం మాత్రం అందర్నీ మార్చేద్దాం.
పంచాయతీ స్థాయి నుంచి ప్రధాని వరకు అన్ని కులాలకీ, మతాలకీ బలంగా పనిచేసే వ్యక్తుల్ని తీసుకొద్దాం. మనం రూపొందించే పాలసీలు కింది స్థాయి వరకు వెళ్లాలి. జనసేన నాయకులు కులాలని ముందు పెట్టి మాట్లాడవద్దు. ఇక్కడ అన్ని కులాలు సమానం. ఒక కులానికి పెద్దపీట వేయడం జరగదు. నేను అంబేద్కరిజాన్ని నరనరానా జీర్ణించుకున్నా. పార్టీ నాయకులు ఎవరైనా శృతిమించి మాట్లాడి ఉంటే సరి చేసుకోండి. ఓటమి ఎదురైనా పార్టీ విలువల్ని మాత్రం వదులుకోం.
జనానికి కావాల్సింది 25 కేజీల బియ్యం కాదు.. 25 ఏళ్ల జీవితం. అది ఇచ్చేందుకు జనసేన సిద్ధంగా ఉంది. తుని దుర్ఘటన రాష్ట్ర చరిత్రలోనే చెరిగిపోని మచ్చ. అన్ని లక్షల మంది ఒక చోటుకి చేరుతున్నారంటే, ప్రభుత్వం ఆ సమస్య గురించి వారితో మాట్లాడాలి. దుర్ఘటన జరిగే వరకు ఎందుకు ఊరుకున్నారు.? రాష్ట్ర ప్రభుత్వం కావాలనే వదిలేసిందా.? ధవళేశ్వరం కవాతులో బ్రిడ్జి మీద పోలీసులు లేరు. మూడు రోజుల ముందు తీసుకున్న అనుమతిని మూడు గంటల ముందు రద్దు చేశారు. అంటే జనం తొక్కుకుని చచ్చిపోమనా అర్ధం. ఇలాంటి వ్యవస్థలని మార్చాలి.
పంచాయతీ స్థాయి నుంచి బాధ్యతతో పని చేసే వ్యక్తులు కావాలి. అడ్డగోలుగా వచ్చే గెలుపు వద్దు. శ్వేతజాతీయుడు బారిస్టర్ చదువుకున్న వ్యక్తిని రంగు తక్కువని రైలు కంపార్ట్‌మెంట్ నుంచి గెంటేస్తే, అతను భారతదేశం నుంచి బ్రిటీష్ వారిని గెంటేస్తాడని ఎవరైనా ఊహించారా? మనిషి శక్తి అలాంటిది. మీలో ఉన్న శక్తిని బయటికి తీయండి. రాజకీయ వ్యవస్థలో సరికొత్త మార్పు తీసుకురండి.
అవినీతి లేని వ్యవస్థ, పని కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే లంచం అడగని వ్యవస్థ ఉండాలి. రుణాల కోసం వెళ్లే మహిళలని కూర్చొపెట్టి అప్పు ఇచ్చే వ్యవస్థ ఉండాలి. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చా. ఆ కష్టాలు నాకు తెలుస"న్నారు. విజయవాడ-తుని మధ్య రైలు ప్రయాణంలో ప్రతి స్టేషన్‌లో స్వాగతం పలికిన ప్రతి జనసేన కార్యకర్తకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.