సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (21:45 IST)

ప్రజల ఆదరణతో 2019లోనే కాదు 2024లోనూ గెలుస్తాం... సీఎం చంద్రబాబు

అమరావతి : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ విషయంలో ఎటువంటి రాజకీయాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం సచివాలయంలో విలేకర్లతో

అమరావతి : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ విషయంలో ఎటువంటి రాజకీయాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం సచివాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ పేదవారందరకి చేయూతను ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. ఈ పథకాలు అమలు జరుగుతున్న తీరుతోపాటు వివిధ అంశాలపై ప్రజల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. అందుకు అనుగుణంగా పాలనలో మార్పులు చేసుకుంటున్నామని అన్నారు. ఇందుకు ఇసుక అంశాన్ని ఆయన ఉదాహరించారు.
 
తొలుత డ్వాక్రా మహిళలకు ఇసుక పంపిణీ బాధ్యత అప్పజెప్పామని గుర్తు చేశారు. వాళ్లకు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు అండగా ఉన్నా ఇసుక పంపిణీలో అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో ఇసుకను ఉచితం చేశామన్నారు. ప్రస్తుతం ఇసుక రీచ్‌లో జియో ట్యాగింగ్ ద్వారా వాహనాలు, వాటి నెంబర్లు, డ్రైవర్లు ఫోటోలు నమోదు చేస్తున్నామని అన్నారు. ఇదే విషయాన్ని వినియోగదారుడుకి సమాచారం అందిస్తున్నామని చెప్పారు. దీనివల్ల 95 శాతం ఇసుక సమస్యలు పరిష్కారమయ్యాయని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు.
 
20, 21 తేదీల్లో జరిగిన కలెక్టర్ల సమావేశం సంతృప్తికరంగా సాగిందన్నారు. రాష్ట్రంలో ఉన్న ఐఎఎస్‌లను చూసి బి టీమ్ అనే కామెంట్స్ వచ్చాయని అన్నారు. బి టీమ్ కాదు బెస్ట్ టీమ్ అని నేడు రుజువు చేశామని చెప్పారు. తరచూ కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం వల్ల 13 సమావేశాల తరువాత కలెక్టర్లలోనూ కాన్ఫడెన్స్ పెరిగిందని చెప్పారు. మరో ఐదారు పర్యాయాలు సమావేశాలు నిర్వహిస్తే పూర్తి పరిపూర్ణత వస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. 1999లో గెలుపొందడం ద్వారా దేశంలో అభివృద్ధి పేరుతో రెండో పర్యాయం గెలుపొందిన ముఖ్యమంత్రి తానేనని ఆయన గుర్తు చేశారు. 
 
మంచి పనులు చేస్తున్నంత కాలం ప్రజలు ఆదరిస్తూనే ఉంటారని ఆయన అన్నారు. ప్రస్తుతం 58 శాతం ప్రజల్లో ప్రభుత్వ తీరుపై సంతృప్తి ఉందన్నారు. ఈ సంతృప్తి 80 ప్రజల నుంచి వచ్చేలా  చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాబట్టి 2019లోనే కాదు, 2024లోనూ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రక్త సంబంధీకుల ప్రేమానుబంధాలకు దూరమవుతున్న హిజ్రాల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. హిజ్రాలకు నెలకు రూ. 1000 పెన్షన్, ఇళ్లు, రేషన్ కార్డుతోపాటు భవిష్యత్‌లో ఉపాధి కూడా కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 
 
ఆర్టీజీ, కాల్ సెంటర్ల వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ వచ్చిన తరవాతే సంక్షేమ పథకాలు అమలు ప్రారంభమైందని గుర్తు చేశారు. శ్రద్ధగా పనిచేస్తే డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమికాదన్నారు. 1991-94 మధ్య ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు హెరిటేజ్ డెయిరీ ప్రారంభించి దాదాపు రెండేళ్లపాటు దానికి ఎండీగా ఉన్నానని చెప్పారు. 2004 తరవాత మరోసారి వ్యాపార రంగంలోకి వచ్చి హెరిటేజ్ ఫ్రెష్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. హెరిటేజ్ ఫ్రెష్ తొలుత నష్టాలు వచ్చినా తరువాత లాభాలను ఆర్జించిందన్నారు. రాజకీయాలతోనే ప్రజలకు చేరువగా ఉండొచ్చని భావించి వ్యాపార బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. 
 
పేదల అభ్యున్నతిలోనే తనకు ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. అందుకే వారి కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నానని చెప్పారు. సంపన్నుల కోసం కష్టపడాల్సిన పనే లేదన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఎన్నో సమస్యలు తలెత్తాయన్నారు. రాష్ట్ర ప్రజలంతా నిస్తేజంలోకి కూరుకుపోయారన్నారు. ఆ సమయంలో ఒక నాయకుడిగా తాను చలించిపోకుండా, ప్రజల్లో ధైర్యాన్ని నూరిపోశానన్నారు. దృఢ చిత్తంతో పనిచేసి, నేడు దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపానన్నారు. పీపుల్స్ ఫస్ట్ యాప్ ద్వారా ప్రజలు తమకు కావాల్సిన పథకాలు వివరాలు తెలుసుకోవచ్చన్నారు. 
 
చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్టీలు, మైనార్టీలకు రూ.50 వేల చొప్పున ఇస్తున్నామని చెప్పారు. ఎస్సీలకు, బీసీలకు కూడా చంద్రన్న పెళ్లి కానుక అందజేస్తున్నామని చెప్పారు. ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నామన్నారు. సాధారణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందిస్తామన్నారు. గతంలో టీటీడీలో ప్రాణదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వచ్ఛతే సేవ-స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి ప్రారంభించనున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని గ్రామాలనూ ఓడీఎఫ్‌లగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్మార్ట్ వాటర్ గ్రిడ్  కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. దీనివల్ల రాష్ట్రంలో సాగు, తాగునీటి కష్టాలు అన్నమాటే వినిపించదన్నారు. కరెంట్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసి, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు.