మంగళవారం, 2 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2025 (09:38 IST)

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

rain in telangana
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం నెలకొనివుంది. వెస్ట్ బెంగాల్ - ఒరిస్సా తీరాలకు అనుకుని, వాయువ్య బంగాళాఖాతం 1.5 నుంచి 1.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం కారణంగా మంగళవారం నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ కారణంగా తూర్పు గాలులు బలంగా వీచే అవకాశం ఉండటంతో పాటు తీర ప్రాంతాల్లో వర్షాలు మళ్లీ పెరగనున్నాయన్నారు.
 
ముఖ్యంగా, సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
 
తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సరఫరా అంతరాయం, వరదల ప్రమాదాలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.